ఎంత చదివినా మార్కులు రావే?
-అందరికీ తెలివి ఒకేలా ఉండదు.
-ఐ.క్యూ స్కోర్ 90-110 మధ్య ఉంటే సాధారణ తెలివి తేటలు కింద లెక్క.
-ఎప్పుడూ స్పెల్లింగ్ మిస్టేక్స్ చేస్తుంటే ఆ విద్యార్థికి డిస్‌గ్రాఫియా సమస్య ఉండొచ్చు.
-కొంతమందికి పరీక్షల ఫోబియా ఉంటుంది. ఇదీ మార్కులు తగ్గిస్తుంది.
-విద్యార్థులో 4శాతం మందికి ఏకాగ్రత లోపాలుంటాయి.
-స్లో లెర్నర్స్ అధైర్యపడకూడదు. ఈ సమస్య అధిగమించేందుకు మార్గాలున్నాయి.
చదవని పిల్లలకు ఎలాగూ మార్కులు రావు. కానీ పొద్దస్తమానం పుస్తకాలతో కుస్తీ పట్టే పిల్లల్లో కొందరికి మార్కులు రాకపోవడం తల్లిదండ్రులను ఆందోళన పరుస్తుంది. క్లాసులో పాఠాలు శ్రద్ధగా వింటారు. ఇంటికి రాగానే బుద్ధిగా పుస్తకాలు ముందేసుకొని చదువుకుంటారు. అయినా మార్కులు రావెందుకని? దీని వెనుక కారణాలేమిటి? ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ కె. నిరంజన్‌రెడ్డి విశ్లేషణ.
కిరణ్ చాలా హార్డ్ వర్కింగ్ విద్యార్థి. అల్లరి, చిల్లరగా తిరగకుండా, బుద్ధిగా చదువుకుంటాడు. టైం వేస్ట్ చెయ్యడం నేరమని ఆలోచించే తత్వం అతనిది. అమ్మా, నాన్న కూడా అతనికి కావలసిన వసతులు కల్పించి, ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తుంటారు. కిరణ్ ప్రపంచమే కష్టపడి చదువుకోవడం. అయితే ఎంతకష్టపడి చదివినా ఫలితం మాత్రం శూన్యమే. అతనికి కొన్ని సబ్జెక్ట్స్‌లో బొటాబొటి మార్కులొస్తే, కొన్నింటిలో ఫెయిల్ అవుతున్నాడు. ఎందుకిలా జరుగుతోంది? ఏమిటి ఈ లోపం? మంచి మార్కులు సంపాదించాలంటే ఇంకేమి చెయ్యాలి? ఆడుతూ, పాడుతూ అంతంత మాత్రం చదువుతున్న తన క్లాస్‌మేట్స్‌కు తన కన్నా మంచిమార్కులు రావడమేంటి? ఇలాంటి సందేహాలతో తేజ మనస్సు దిగులుతో నిండుకుంది. ఇక అతని అమ్మా, నాన్నల మనసు అయితే చెరువైపోతోంది.
ఇది కేవలం కిరణ్‌కు సంబందించిన విషయమే కాదు. చాలా మంది పిల్లలు ఇలాంటి బాధాకరమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటారు. చదివినా మంచి మార్కులు పొందలేక, దీనికి కారణాలేంటో తెలియక బాధ పడుతుంటారు. ఈ సమస్యని సైకాలజి కోణం లోంచి గమనించి , విశ్లేషించి అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, ఈ సమస్యను కొంతవరకు పరిష్కరించే మార్గాలు కూడా సూచించవచ్చు. పరిష్కారానికి ముందు కారణాలను అర్థం చేసుకోవాలి.
స్లో లెర్నర్స్ :కష్టపడ్డా సరైన మార్కులు రాకపోవడానికి , కారణాలేమిటి? ఇంటలిజెన్స్ మొదటి కారణంగా చెప్పుకోవచ్చు. తెలివి తేటలే విద్యార్థి సర్వస్వం. జీవితంలో పైకి ఎదగడానికి దేవుడు ప్రసాదించిన నిచ్చెన. ‘రైమాండ్ కాటిల్’ అనే సైకాలజిస్ట్ అభిప్రాయం ప్రకారం. తెలివి తేటలున్న విద్యార్థి సులవుగా నేర్చుకోవడమే కాకుండా, చక్కగా గుర్తుంచుకుంటాడు. విస్తృతంగా ఆలోచించే శక్తి ఉండడం వలన, చదివిన విషయాలను విశ్లేషించి అర్థం చేసుకుంటాడు. విద్యార్థుల తెలివితేటల్ని అంచనా వేయడానికి, సైకాలజీలో ఎన్నో ‘ఇంటలిజెన్స్ టెస్టులు’ ఉన్నాయి. ఈ టెస్టుల ఫలితాలను intelligence quotient (I.Q) అని అంటారు. ఈ IQ scores 90 నుంచి 110 వరకు ఉంటే విద్యార్థికి సాధారణ ఇంటలిజెన్స్ ఉన్నట్టు. ఎవరికైతే ఈ స్కోరు తొంభై కంటే తక్కువ ఉంటాయో వాళ్ళను ‘స్లోలెర్నర్స్’ కింద జమ కట్టవచ్చు. ఈ కోవకు చెందిన విద్యార్థులు చదివి నేర్చుకోవడం, నేర్చుకున్నది గుర్తుంచుకోవడంలో వెనుకబడి ఉంటారు. ఈ విషయాన్ని Kail, Chamberlin, Hale తో పాటు ఇంకెందరో సైకాలజిస్టులు ప్రూవ్ చేసారు. అందుకే ఈ విద్యార్థులు శ్రమ పడ్డా, ఫలితాలు అంతంత మాత్రమే ఉంటాయి.
ఇలాంటి విద్యార్థులు ‘క్లాస్‌టాపర్స్’ కాలేకపోయినా, ‘‘మేము ఏమీ చేయలేము’’ అని అధైర్య పడకూడదు. కొన్ని పద్ధతులు పాటిస్తే నేర్చుకోగల సామర్థ్యం పెంచుకుని, ‘మెమోరి’ని పెంచుకునే పద్ధతులు కూడా నేర్చుకోవచ్చు.
జూలై 8వతేదీ నాటి ‘నమస్తే తెలంగాణా’లో టర్నింగ్ పాయింట్ లో మీరు చదివిన ‘SQ-3R’ పద్ధతి వీరికెంతో ఉపయోగపడుతుంది. దీనితో పాటు ‘over learning disorder’ అంటే నేర్చుకున్నదే తిరిగి మరో తడవ నేర్చుకోవడంతో నేర్చుకున్న విషయాలు చక్కగా గుర్తుంటాయి.
లెర్నింగ్ డిజార్డర్స్ :మరి కొందరు విద్యార్థులకు తెలివితేటలు బాగున్నప్పటికీ చదువులో వెనకబడతారు. దీనికి ముఖ్యకారణం వీరి ‘హ్యాండ్ రైటింగ్’ లో దొర్లే పొరపాట్లే. ఈ విద్యార్థులు ‘b’ బదులు ‘d’ రాస్తుంటారు. లేదా అక్షరాలను తిరిగేసి రాస్తారు. హ్యాండ్ రైటింగ్ నీట్ గా లేకపోవడమే కాదు, ఒక చిన్న సెంటెన్స్ లో బోలెడు ‘స్పెల్లింగ్ మిస్టేక్స్’ చేస్తారు. డిస్ గ్రాఫియా, అనబడే ఈ ‘లెర్నింగ్ డిజార్డర్’ చాలా ప్రఖ్యాతి గాంచిన వ్యక్తుల్లో కూడా కనిపించవచ్చు. సుప్రసిద్ద సైంటిస్టు అయిన అల్బర్ట్ ఐన్‌స్టీన్, ఎలక్ట్రిక్ బల్బును కనుగొన్న థామస్ ఎడిసన్, ప్రఖ్యాత పెయింటర్ లియోనార్డో డావెన్సీ, ఒకనాటి అమెరికా దేశ ప్రధాని అయిన ఉడ్రో విల్సన్‌లను ఉదాహరణగా తీసుకోవచ్చు.
ఈ లెర్నింగ్ డిజార్డర్‌లో డిస్‌లెక్సియా అనే ఇంకో డిజార్డర్ కూడా ఉంటుంది. ఈ కండిషన్ లో విద్యార్థికి పుస్తకం చూసి చదవడంలో లోపాలుంటాయి. కనుచూపులో ఎలాంటి లోపం లేకపోయినప్పటికీ, విద్యార్థి పదాన్ని చూస్తుంటాడు, కానీ చదవలేడు. అందుకే పాత కాలంలో ఈ సమస్యను, word blindness అని పేర్కొన్నారు. ఈ సమస్య ఎక్కువ మోతాదుల్లో ఉన్న విద్యార్థులు, చిన్న పదాన్ని చదవడానికి కూడా చాలా సమ యం తీసుకుంటారు. ఒక్కొక్క పదాన్ని గమనిస్తూ, ఉచ్చరిస్తూ ఎంతో కష్టపడి చదువుతారు. మొత్తం పదాన్ని కలిపి చదవడం వారికో పెద్ద సమస్య.
ఇలాంటి సమస్యలు ఉంటే తల్లిదండ్రులు, టీచర్స్ ఒకటి లేదా రెండవ తరగతిలో ఉన్నప్పుడే తెలుసుకోవాలి. ఆ వయస్సులో ‘రెమెడియల్ ఎడ్యుకేషన్’ ఇప్పిస్తే పిల్లలు ఈ సమస్యను అధిగమించగలుగుతారు. అంతేకాకుండా క్లినికల్ సైకాలజిస్ట్ నుంచి, ఈ సమస్య ఉన్నట్టు ఒక ‘సర్టిఫికెట్’ తీసుకొని స్కూల్ లో సబ్మిట్ చేస్తే ఈ విద్యార్థులకు విద్యాపరంగా కొన్ని కన్పిషన్స్ కూడా లభిస్తాయి.
పరీక్షల భయం:విద్యార్థుల్లో కొందరికి వ్యాకులతా స్వభావం ఉంటుంది. ముఖ్యంగా ఈ స్టూడెంట్స్‌కు, పరీక్షలంటే బెరుకు. ‘‘పరీక్ష రాస్తున్నప్పుడు చదివింది గుర్తుకు వస్తుందో, రాదో... నేనూ చక్కగా రాయగలుగుతానో లేదో... అనే ఆలోచనలు వీళ్ళ మనస్సును తొలిచి వేస్తాయి. పరీక్షలు దగ్గరపడుతుంటే వీరి భయం మరింత తీవ్ర స్థాయికి చేరుకుంటుంది. ఇక పరీక్ష హాల్‌లో సరేసరి. ఈ భయం తారా స్థాయికి చేరుకుంటుంది. గుండె వేగంగా కొట్టుకుంటుంది. శరీరమంతా చల్లబడి చమటలతో తడిసి ముద్దవుతుంది. కాళ్ళు, చేతులు వణకుతుంటాయి. నోరు తడారి పోతుంది. ఈ భయం వలన చక్కగా చదివి నేర్చుకున్న విషయాలేవీ గుర్తుకురావు. పర్యవసానం.... మార్కులు సరిగా రాకపోవడమో, లేదా ఫెయిల్ అవడమో.
ఈ కోవకు చెందిన పిల్లలు, పరీక్షల పట్ల తమ భయాన్ని తగ్గించుకోవాలి. యోగా, మెడిటేషన్ చేయడం వలన కొందరు ఈ సమస్యను జయించవచ్చు. ఒకవేళ ఈ భయం మరీ తీవ్ర స్థాయిలో ఉంటే, ఒక క్లినికల్ సైకాలజిస్ట్‌ను సంప్రదించాలి. ఈ సైకాలజిస్ట్‌లు రిలాక్సేషన్, డీసెన్సిటైజేషన్, కాగ్నెటివ్ రీస్ట్రక్చరింగ్ లాంటి ఇంకెన్నో కాగ్నెటివ్ బిహేవియర్ థెరపి టెక్నిక్స్ ఉపయోగించి ఈ సమస్యను తొలగిస్తారు.
ఏకాగ్రతలో లోపాలు:సుమారు 4% విద్యార్థులలో ఈ ఏకాగ్రతా లోపాలు ఉంటాయని సర్వేలు తెలిపాయి. ప్రముఖ సైంటిస్ట్ ‘న్యూటన్’ ఏకాగ్రతకు పెద్ద పీట వేసాడు. ‘నేను ముఖ్యమైన విషయాలను కనిపెట్టడానికి మూలకారణం, కేవలం నా తెలివితేటలే కాదు. నా ఏకాగ్రత’ అని అంటాడు. మనం ఒక ఏదైనా రికార్డ్ చేయాలంటే, పైన ఉన్న ‘ప్లే బటన్’ తోపాటు ‘రికార్డు బటన్’ కూడా నొక్కుతాము. కేవలం ‘ప్లే బటన్ నొక్కితే లాభం లేదు. అదే విధంగా స్టూడెంట్ చదువుతున్న టాపిక్ పైన మనసు పెట్టకుండా ఎన్ని గంటలు చదివినా నిష్ప్రయోజనమే. ఎంత చదివినా మార్కులు రాకపోవడానికి ఇది ఇంకో కారణం. ఏకాగ్రతలో లోపాలకు కారణం మనసులోని వ్యాకులత. వ్యాకులతను తగ్గించుకోవడానికి పైన తెలిపిన విధానాలు విద్యార్థులు పాటించాలి.
విద్యార్థుల్లో కొందరికి తొందరపాటు ఎక్కువ. ఈ తొందర మనస్తత్వం వల్ల, పరీక్ష రాస్తున్నప్పుడు త్వరత్వరగా ఆన్సర్లు రాస్తారు. త్వరగా రాయడం వలన తప్పులు దొర్లే ప్రమాదముంటుంది. ఓపిక లేకపోవడంతో, నేను రాసింది కరెక్టేనా, కాదా అని వెరిఫై చేసుకోరు. అందుకే చక్కగా చదివి నేర్చుకున్నా, పరీక్షలో రాస్తున్నప్పుడు పొరపాట్లు చేస్తారు. ఈ విషయాన్ని గమనించి, విద్యార్థులు ఈ తొందర పాటును తగ్గించుకొని, సావధానంగా అన్సర్స్ రాయాలి.
మంట లేనిదే పొగరాదు. అదే విధంగా లోపం లేనిదే సమస్యరాదు. విద్యార్థులు వారిలోని ఈ లోపాన్ని అర్థం చేసుకొని, దాన్ని అధిగమించే ప్రయత్నం చేస్తే సమస్యకు పరిష్కారం లభిస్తుంది. విజయం వరిస్తుంది. జీవితంలో విజయ బావుటాల్ని ఎగరేస్తారు.
వ్యాసకర్త ః క్లినికల్ సైకాలజిస్టుగా ప్రభుత్వ సర్వీసు
నుంచి రిటైరై, ప్రస్తుతం హైదరాబాద్‌లోని
రోష్నీ కౌన్సిలింగ్ సెంటర్ సలహాదారుగా వ్యవహరిస్తున్నారు.
Other News