మనస్తత్వానికి నప్పే కెరీర్
ఇది కోర్సుల ఎంపిక సమయం. ముఖ్యంగా ఇంజనీరింగ్ కోర్సు చేయాలని అభిలషిస్తున్న విద్యార్థులు అందుబాటులో ఉన్న పదుల సంఖ్యలో బ్రాంచ్‌లలో దేనిని ఎంపిక చేసుకోవాలన్నది ప్రశ్న.
ర్యాంకు ప్రకారం వచ్చిన బ్రాంచ్ తీసుకోవాలా? తెలిసినవారి పిల్లలు తీసుకున్న బ్రాంచ్ వైపు మొగ్గు చూపాలా? ఏ ఆధారంగా బ్రాంచ్ ఎంపిక జరగాలన్నది సందేహంగా ఉంటుంది. అయితే మనస్తత్వ రీత్యా ఇందుకు చక్కటి మార్గదర్శకాలున్నాయి.కెరీర్ అనేది జీవితంలో ఓ వరం లాంటిది. కెరీర్‌ను ఎంచుకోవడమంటే జీవితా న్ని ఎంచుకున్నట్లవుతుంది. కెరీర్‌ను అదృష్టంగా భావించే వారు అనేకం. అదృష్టం వల్లనే ప్రాప్తిస్తుందని భావించే వారు కెరీర్‌ను సమర్థవంతంగా నిర్మించుకోలేరు. కెరీర్ నిర్మాణంలో కోర్సుల ఎంపికలో అవగాహన లోపం ఉంటే అది అసంపూర్తిగానే మిగులుతుంది. చేరబోయే కోర్సుకి వృత్తికి సంబంధించిన అవకాశాలను ప్రశ్నించుకోవాలి.కెరీర్ (ఎంపిక) నిర్మాణం అంత సులభమైనది కాదు. ఇది వ్యక్తిగత విజయాలు, ర్యాంకులు, భవిష్యత్తును నిర్ణయించే సమస్య మాత్రమే కాదు. వ్యక్తి జీవితానికి, యావత్తు ఈ జన్మకు సంబంధించిన సైద్దాంతిక సమస్య అని గుర్తించాలి. కెరీర్ నిర్మాణంలో అనుకరణ కన్నా వ్యక్తిత్వానికే పూర్తి అవకాశాన్ని కల్పించాలి.మీ పంచేంద్రియాల్లో ఉన్న అభిరుచులు, ఆసక్తితో పాటు మీ వ్యక్తిత్వాన్ని బట్టి కెరీర్‌ను నిర్మించుకోవాలి. భవిష్యత్తు పట్ల మీ ఆలోచనలు ఎటు తొంగి చూస్తున్నాయో గమనించాలి. మన వ్యక్తిత్వానికి తగినట్టుగా కెరీర్‌లో గాని, కోర్సుల్లో గాని చేరితే భవిష్యత్తులో ఢీలా పడిపోకుండా జీవనాన్ని సాఫీగా కొనసాగించగలం. మనస్తత్వ లక్షణాలు ః వివిధ వ్యక్తుల మనస్తత్వాలను అంచనా వేసేందుకు ప్రధానంగా మూడు రకాలుగా గుర్తించవచ్చు. అందులో మొదటిది అంతర్వర్తనులు (Introverts) వీరు నలుగురితో కలిసి ఉండలేరు. ఒంటరి జీవితానికి ప్రాధాన్యతనిస్తారు. అయితే ఒక విషయం పట్ల ఖచ్చితమైన నిర్ణయానికి కట్టుబడి ఉంటారు. రెండవది బాహ్యవర్తనులు (Extroverts) వీరు నలుగురితో ఇట్టే కలిసిపోతారు. వీరి మనస్తత్వం కాలంతో పాటు మారుతూ ఉంటుంది. పరిస్థితులను బట్టి సంఘంలో గుర్తింపు కోసం పాకులాడు తారు. ఇక మూడో రకం మధ్యవర్తనులు (Amiverts) వీరు నిలకడ లేని మనస్తత్వం గల వారు, ప్రవర్తనలో తనదైన రీతిలో ప్రవర్తిస్తారు. ఇతరుల ఇష్టాయిష్టాలతో పట్టింపు లేకుండా ఉంటారు. ఆలోచన ధోరణిలో స్థిరత్వం ఉండదు. క్షణంలో ఇష్టంగా ఉన్నట్లే ఉంటారు మరో క్షణంలో అయిష్టంగా ఉంటారు.
అబ్‌సెసివ్ - కంపల్సివ్ పర్సనాలిటి ః
కచ్చితమైన ధోరణి దృఢమైన ప్రవర్తన కలిగి ఉంటారు. ఏ పని చేసినా అన్ని కోణాల నుంచి పద్ధతుల ప్రకారం చెయ్యాలనే తపన ఉంటుంది. ఇలాంటి వారిని పరిపూర్ణ వాదు లుగా గుర్తించవచ్చును. నియమ నిబంధనలకు కచ్చితంగా కట్టుబడి ఉంటారు. పరిపూర్ణమైన లక్ష్యాలతో ముందడుగు వేస్తారు. ఇతరుల లోపాలను గుర్తించడ మే కాదు తమ లోపాలను సైతం గుర్తించుకోవడానికి వెనుకాడరు. అబ్‌సెసివ్ కంపల్సివ్ పర్సనాలిటి అంతర్వర్తనులు, బాహ్యవర్తనులు, మధ్య వర్తనగల వారు కెరీర్/ కోర్స్‌ల ఎంపికలో అంచనా వేసేందుకు ఈ కింది వర్గీకరణను గమనించగలరు.
డిపెండెంట్ పర్సనాలిటి
స్వీయ నిర్ణయాలు తీసుకోలేరు. ప్రతి విషయానికి ఇతరులపై ఆధారపడుతారు. వృత్తిపరంగా ఎంత గొప్ప హోదాలో ఉన్నా, వీరు ఇటు కింది స్థాయి ఉద్యోగులు, అటు పై స్థాయి అధికారులపై ఆధారపడి ఉంటారు. దృఢమైన ప్రవర్తన ఉండదు. వీరిలో ఆత్మ న్యూతనా లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి.
బోర్డర్‌లైన్ పర్సనాలిటి ః
బోర్డర్‌లైన్ పర్సనాలిటి లక్షణాలు గల వారు త్యాగానికి గాని, ప్రతీకారానికి గాని వెనుకంజవేయరు. వీరిలో కంగారుతనం ఎక్కువ ఉంటుంది. భావోద్రేకాలకు తొందరగా గురవుతారు. ఎదుటివారిని నమ్మించడానికి ఏ పనినైనా చేస్తారు. వీరిలో అపజయాలను తట్టుకునే శక్తి చాలావరకు ఉండదు. దుఖాన్ని ఆపుకోలేరు. కోపంతో అదుపు తప్పుతారు.
ప్రొఫెషనల్ కోర్స్‌లు : కెరీర్‌ను గాని కోర్సును గాని ఎంపిక చేసుకునే సమయంలో ఈ వర్గీకరణతో పాటు ఆచరణలో తీసుకోకుండా మీ... మీ వ్యక్తిత్వాన్ని మనస్థత్వాన్ని ముందుగానే అంచనా వేసుకుని జీవితంలో నిలబడడానికి ఆయా రంగాలలో మీకున్న ఆసక్తి, అభిరుచి, అర్హతలు, ప్రతిభ కుటుంబ పరిస్థితులతో పాటు ఆర్థిక ఆవసరాలను కూడా గమనించి తుది నిర్ణయం తీసుకుంటే విజయం మీదే.
Other News