Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
Sponsor Namasthe Telangana Telugu Daily From Online
Namasthe telangana Videos
Thursday, June 20, 2013
 


Home >> Parenting
ఆ మూడింటి విషయంలో మీరెలా స్పందిస్తున్నారు?

చిరుతిళ్లు :అడిగినవన్నీ నోటికిస్తున్నారా?
ఆట వస్తువులు:కోరినవన్నీ కొనిస్తున్నారా?
డ్రస్సులు:మోజుపడితే సొంతం చేస్తున్నారా?

పిల్లల విషయంలో పెద్దలకు ఎప్పుడూ ఒక విషయంలో అస్పష్టత ఉంటుంది. పిల్లలు అడిగినవన్నీ కొనివ్వాలా? లేక కంట్రోల్‌లో పెట్టాలా? కొనివ్వకపోతే వారి మనసు గాయపడుతుందేమోనన్న భయం. ఇలా కొంటూ పోతే ఎక్కడికి దారితీస్తుందోనన్న అనుమానం వెంటాడుతుంటుంది?
ఎదిగే పిల్లలకు ఎన్నెన్నో కోరికలు. 3 సంవత్సరాల నుంచి మొదలుకొని ఒక్కో సంవత్సరం పెరుగుతున్న కొద్దీ పిల్లల కోరికలు కూడా మారుతుంటాయి. వయసుతో సంబంధం లేకుండా పిల్లలంతా ఇష్టపడేది చాక్లెట్లు, బిస్కెట్లు, ఐస్‌క్రీములు. వీటిల్లోనే ఛాయిస్‌లు కూడా పిల్లల వయసును బట్టి మారుతుంటాయి. ప్రస్తుతం టీవీలు, ఇతర ప్రకటనలు, ఇరుగుపొరుగు పిల్లలు దగ్గరున్న వస్తువులు మొదలైన వాటి ప్రభావంతో పిల్లల కోరికలకు అంతుండడం లేదు. పైగా పిల్లలకు దేని మీదా ఎక్కువ సేపు మోజు ఉండదు. గొడవ చేసి కొనిపించినంత సేపు కూడా ఆ వస్తువు మీద ఇష్టం ఉండదు. తల్లిదండ్రులకి ఇది చాలా కన్‌ప్యూజింగ్‌గా ఉంటుంది.

పిల్లలు తినుబండారాలు, ఆట వస్తువులు, షికార్లు, బ్యాట్లు, సైకిళ్లు ఇలా ఎన్నెన్నో అడుగుతుంటారు. వాటిలో ఏది కొనివ్వాలో, ఏది కొనివ్వకూడదో తల్లిదండ్రులు తెలసుకోవడం, పిల్లల్లో ఆ కోరికలను సహజంగా నియ్రంతించడం, వద్దనే విషయం చాలా సున్నితంగా చెప్పడం చేయాలి. పిల్లలకి ఏయే వయసులో ఏం కావాలనిపిస్తుందో తెలుసుకోవడం తల్లిదండ్రులకు చాలా అవసరం. కొంత మంది తల్లిదండ్రులు పిల్లలు ఏది అడిగితే అది కొనిచ్చేస్తుంటారు. మరికొంత మంది తల్లిదండ్రులు అసలు ఏదీ కొనివ్వకుండా పిల్లలు అసలు అడగడానికే భయపడేలా ప్రవరిస్తుంటారు.

eatingచిరుతిళ్లు
పిల్లలకు తొలి దశలో అన్నింటికంటే ఇష్టమైనవి చాక్లెట్లు, బిస్కెట్లు వంటి తినే పదార్ధాలు. వీటి కోసం పిల్లలు చేయని ప్రయత్నం, వేయని ఎత్తు ఉండదు. ఇంట్లో వీలు పడకపోతే బయట కూడా ఏదోలా సంపాదించి తినే ప్రయత్నం చేస్తారు. దీనికి తల్లిదండ్రులు చేయవలసింది తామే పిల్లలకు సమయానుసారంగా చాకెట్లు, లాంటివి ఇవ్వడం అలవాటు చేయాలి. ఇంట్లో ఎన్ని రకాల పిండి వంటలు చేసినా షాపులో దొరికే చాక్లెట్లు వంటివి కొని తినడంలోనే పిల్లలకు ఆనందం, తృప్తి లభిస్తాయి. పిల్లలు తమకు కావలసిన ఈ రకమైన చిరు తిండి కోరికలు ‘అమ్మా, నాన్న’లే తీరుస్తారు అనే భావన ఏర్పరచుకునేలా తల్లిదండ్రులు ప్రవర్తించాలి. అలాగని ఏది అడిగితే అది ఇవ్వకుండా, నచ్చజెప్పే ప్రయత్నం చేయండి.

gamesఆట వస్తువులు
తిను బండారాల తరువాత పిల్లలు అధికంగా ఇష్టపడేది బొమ్మలు, ఆట వస్తువులు. మైదానంలో ఆడుకునే వయస్సు కన్నా ముందు దశ బొమ్మలతో ఆడుకునే దశ. ఈ వయసులో ఆడ పిల్లలు, మగ పిల్లలకు బొమ్మల విషయంలో వేరు వేరు విధంగా కోరికలు ఉంటాయి. లక్క పిడతలు, టెడ్డీ బేర్‌లు, కుక్కపిల్ల బొమ్మలు, బుట్ట బొమ్మలు, బార్బీ బొమ్మలు మొదలైనవి ఆడ పిల్లలు ఇష్టపడితే, కార్లు, ట్రైన్లు, బస్సులు, విమానాలు, తుపాకీ బొమ్మలు మగ పిల్లలు ఇష్టపడ తారు. తిను బండారాలతో పోల్చితే ఇది తల్లిదండ్రుల బడ్జెట్‌పై ప్రభావం చూపించే కోరిక. పైగా ఈ కంప్యూటర్ రోజుల్లో అధునాతన టెక్నాలజీతో రూపాందుతున్న ఆట బొమ్మల ధరలు ఎక్కువగా ఉంటున్నాయి. ఆట బొమ్మల విషయంలో పిల్లలు కనీసం వారానికి రెండు సార్లు కొత్త బొమ్మలు కొనిపెట్టమని మారాం చేస్తారని ఒక పరిశోధనలో తేలింది.

పిల్లల కోరికలను ఒక వైపు నియంత్రణలో పెడుతూనే మరోవైపు బొమ్మలను కొనే విషయంలో తల్లిదండ్రులు ఆలోచించవలసింది పిల్లల మానసిక శారీరక ఆరోగ్యం, ఆట బొమ్మల తయారీలో వినియోగించే రంగులు, రసాయనాలు ఇతర ముడి పదార్ధాలు పిల్లలకు ఎలర్జీలు వంటి అనారోగాలను తెచ్చిపెట్టకుండా చూసుకోవాలి. అంతకంటే ముఖ్యమైనది మానసిక స్థితి. బొమ్మలు, వాటితో ఆడే విధానం పిల్లల వ్యక్తిత్వ, మనస్తత్వ రూపకల్పనలో ఒక ముఖ్య పాత్రను పోషిస్తాయనేది మానసిక శాస్త్రవేత్తల అభిప్రాయం. ముఖ్యంగా ఆధునిక ఆట వస్తువులలో తుపాకీలు, ట్యాంకులు, కత్తులు, వికృతాకార రాక్షస బొమ్మలు మొదలైన వాటితో కత్తి యుద్ధాలు, షూటింగ్‌లు, ఇతర పోరాటాలను సినిమాల్లోలా ఆడుతుంటారు పిల్లలు. ఇది చాలా ప్రమాదకరమైనది. పెద్దయ్యాక నేర పూరిత చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాలనే సున్నితత్వం వారిలో ఉండదు. తుపాకీతో షూట్ చేసినా ఫరవాలేదనే మనస్తత్వం వారిలో రూపుదిద్దుకునే ప్రమాదం ఉంది. దీంతో పాటు బొమ్మలు ఎంతో ఖరీదైని అయినా వాటిని పిల్లలు పట్టించుకోరు. కాబట్టి తల్లిదండ్రులు దాని అవసరాన్ని, డబ్బు విలువని వారికి వివరించి అర్ధమయ్యేలా చెప్పాలి. అందుకని ‘మా అమ్మా నాన్న పేదవాళ్లు. మేం డబ్బులేని వాళ్లం’ అనే భావన కూడా వాళ్లలో రాకుండా చూడవలసిన బాధ్యత కూడా తల్లిదండ్రులదే. ఇంకో చిట్కా ఏమిటంటే వాయిదా వేయడం, పిల్లలకు ఏ ఆట వస్తువు మీదా ఎక్కువ కాలం మోజు ఉండదు. కాబట్టి ఓ రెండు రోజులు తర్వాత కొంటానని అంటే అప్పటికి వాళ్ల సరదా మారిపోవచ్చు.

పిల్లలు ఏ బొమ్మలపై కూడా ఎక్కవ రోజులు సరదా ఉండదు. వాటితో వారం రోజులు ఆడగానే సరదా తీరిపోతుంది. దాంతో పాటు ఆట వస్తువును తెచ్చిన ఒకటి రెండు రోజుల్లోనే దాని ముక్కలు ముక్కలుగా చేసెయ్యడం వారికి మామూలే. అలాగని కొన్న ఆట వస్తువులను పిల్లల్ని ఆడనివ్వకుండా వాటిని జాగ్రత్తగా బీరువాలోనో, షోకేసుల్లోనో, వీళ్లకి అందనంత ఎత్తులో పెట్టేయకండి. ఆట వస్తువు కొని దానితో ఆడనివ్వకుండా చేయడం అది పిల్లలను మానసికంగా హింసించినట్టే, దాని కన్నా కొనకుండా ఊరుకోవడమే ఉత్తమమనే సంగతి తల్లిదండులు గ్రహించాలి.

childడ్రస్సులు
పిల్లల మరో ముఖ్యమైన కోరిక ధరించే దుస్తులు. తిను బండారాలు, ఆట వస్తువుల కన్నా పిల్లల మానసిక స్థితిపై అధిక ప్రభావం చూపించేది, వారు మానసికంగా అధిక అనుభూతిని, ఆనందాన్ని పొందేది, వారు కొత్త బట్టలు వేసుకున్నపుడే. ‘కొత్త డ్రస్’ అనేది పిల్లలకు ఒక దర్జా అయిన, గాలిలో తేలిపోయేలాంటి అద్భుతమైన అనుభూతి. కొత్త డ్రస్ వేసుకున్నప్పుడు వారి ప్రవర్తన చూస్తే ఆ విషయం మీకే తెలుస్తుంది. గతంలో కన్నా ఇప్పుడు పిల్లలకు డ్రస్సుల విషయంలో ఛాయస్‌లు ఎక్కువైపోయాయి. డిజైన్లు, రంగులు, సైజులు అన్నీ పిల్లలే చెబుతున్నారు. పైగా బ్రాండ్లు కూడా వాళ్లే చెబుతున్నారు. కాకపోతే స్కూల్స్‌తో విధించిన యూనిఫాం పుణ్యమా అని పిల్లలకు ఎక్కువ డ్రస్సులు అవసరం పడటం లేదు.
డ్రస్సులను కొనే విషయంలో పిల్లలను కూడా భాగస్వాములను చేయండి. మీరు ఆఫీసు నుంచి వస్తూ వస్తూ ఏదో ఒకటి కొనేసి ఇంటికి తీసుకురావడం చేయకండి.అలాగే ఎవరో ఇన్‌స్టాల్‌మెంట్లు మీద ఇస్తుంటే కొనేయకండి. దుస్తుల సెలక్షన్ విషయంలోమీతో పాటే పిల్లలను షాపింగ్‌కు తీసుకువెళ్లండి. పిల్లలనే సెలక్షన్ చేయమనండి. కాకపోతే అందులో ధర, మన్నిక ఇతర విషయాలు మీరు పరిశీలించి వీలు పడని పక్షంలో పిల్లలకు నచ్చజెప్పండి. రంగుల మన్నిక విషయంలో మంచీ చెడులకు సంబంధించిన పరిజ్ఞానం పిల్లలకు కలిగేలా తల్లిదండ్రులు వివరించాలి.

Other News
Most Viewed galleries


Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd
News Photo Galleries Features
Latest News
Telangana News
Seemandhra News
National News
International News
Festivals gallery
Actress gallery
Cinema gallery
Fashion gallery
Political gallery
Sports gallery
Zindagi
Turning Point
Mee Features
Life Style
Sunday magazine