|
|
స్కూల్స్ తెరుస్తున్నారోచ్ !
వేసవి సెలవులు పూర్తికావస్తున్నాయి. స్కూళ్ళు మళ్ళీ తెరరుచుకోవడానికి ముస్తాబవుతున్నాయి. కొత్త పుస్తకాలు, కొత్త డ్రస్సులు, కొత్త షూస్, కొత్త వస్తువుల ఖర్చు లెక్కలు వేసుకొని తల్లిదండ్రులు ప్రతి సంవత్సరంలాగే మళ్ళీ ‘అమ్మో’ అనుకోక తప్పదు. కాబట్టి మళ్ళీ సర్దుబాటులో బిజీ అయిపోతున్నారు. ఈ హడావిడిలో అన్నింటికన్నా ఆనందకరమైనది, ఉద్వేగభరిత మైనది... మీ అమ్మాయి లేదా అబ్బాయి కొత్త క్లాసులో అడుగుపెట్టడం.
గత నెలలో ప్రొగ్రెస్ రిపోర్ట్‌లో మంచి మార్కులు రావడం, తరువాతి తరగతికి ప్రమోషన్ రావడం - ఆ సందర్భంలో తల్లిదండ్రులు ‘మావాడు ఇప్పుడు ఫిఫ్త్‌కి వచ్చేశాడండీ’, ‘మా అమ్మాయి...థర్డ్ పూర్తయి ఫోర్త్‌కి వచ్చేసింది’ అని గొప్పగా చెప్పుకో వడం బానే ఉంటుంది. కానీ తీరా బడులు తెరచి కొత్త తరగతిలో అడుగు పెట్టడం అనేది పిల్లలకి ఎంత ఇబ్బందికరమైనదో.. ఒక్క సారి ఆలోచించండి. కొత్త క్లాసు ఎలా ఉంటుందో! కొత్త టీచర్.. ఎలా ఉంటుందో? కొత్త పాఠాలు ఎంత కష్టంగా ఉంటాయో? కొత్త ఫ్రెండ్స్... కొడతారో... ఏడిపిస్తారో? ఇలా ...పిల్లల మదిలో అనేక ప్రశ్నలు.
కేజీ దాటితే ఈజీ కాదు పిల్లలు ఎల్‌కెజి, యుకెజిలు పూర్తి చేసుకుని ఫస్ట్‌క్లాస్‌కి రావడం మీకే కాదు పిల్లలకు కూడా చాలా ఉత్తేజంగా ఉంటుంది. తామేదో పెద్దవాళ్ళమైపోయినట్టు ఫీలయిపోతారు. ఫస్ట్ క్లాస్‌కు ఎంతో ఉత్సాహంగా వెళ్తారు. అంతవరకూ బానే ఉంది. కానీ తరగతుల బోధనా పద్ధతిలో వచ్చే మార్పులు, స్కూలు పని వేళలు పిల్లలకి చాలా ఇబ్బందిగా ఉంటాయి. ఎక్కువ గంటలు స్కూ ల్లో ఉండాల్సి వస్తుంది.
కొత్త పాఠాల బరువు ఒకటి నుంచి రెండు, రెండు నుంచి మూడు, మూడు నుంచి నాలుగు తరగతులకు వెళ్ళిన పిల్లలకు పాఠాలు పెరుగుతాయి. ఇంతకు ముందు కన్నా చదువు భారం పెరుగుతుంది. కొత్త పాఠాలు క్లిష్టంగా ఉంటాయి.
హైస్కూల్లో అడుగుపెడితే... పిల్లలు విద్యార్థి దశలో ప్రైమరీ స్కూలు నుంచి హైస్కూలుకు వెళ్ళడం ఒక కీలకమైన మార్పు. హైస్కూల్లో పిల్లలు కూడా పెద్ద వాళ్ళలా కనిపిస్తారు. వాళ్ళ గొంతుల్లో కూడా పెడసరం ధ్వనిస్తుంది. అలాగే టీచర్లు కూడా ఎంతో స్ట్రిక్టుగా ఉంటారు.చిన్న క్లాసుల్లో చిన్నపిల్లలు కదా అని టీచర్లు కూడా కాస్త సున్నితంగా ప్రవర్తిస్తుంటారు. హైస్కూల్లో మ్రాతం వీళ్ళంతా ఎదిగిన పిల్లలు, పిడుగులు అనే భావనతో కాస్త గట్టిగానే మందలిస్తుంటారు. హైస్కూలు దశలో పిల్లలు స్వతంత్రులుగా ఉండాలని, క్లిష్టమైన బాధ్యతలు స్వయంగా నిర్వహించాలని టీచర్స్ కోరుకుంటారు.
కొత్త విద్యా సంవత్సరంలో కొత్త క్లాసులకు వెళ్ళడం పిల్లలకు, తల్లిదండ్రులకు ఒక ఆనంద కరమైన విషయమే. కానీ ఆ కొత్త క్లాసులలో పిల్లలకు తలెత్తే ఇబ్బందులను అర్థం చేసుకుని, సరిచేసి వారిని స్థిమితపరచి మంచి విద్యార్థులుగా తీర్చిదిద్దవలసిన బాధ్యత తల్లిదండ్రులదే.
తల్లిదండ్రులు ఏం చేయాలి ? తమ పిల్లలు ఏ కొత్త తరగ తిలో ప్రవేశిస్తున్నారో, ఆ విషయంలో పిల్లలు తొందరగా అలవాటుపడటానికి ఆ కొత్త తరగతి పట్ల ముందుగానే తల్లిదండ్రులకు సంపూర్ణ అవగాహన ఉండవలసిన అవసరం ఉంది. దానికోసం తల్లిదండ్రులు కొత్త స్కూలు, లేదా కొత్త తరగతి, అందులో పాఠాలు, ఆ స్కూలు పని వేళలు పద్ధతులు అన్నీ క్షుణ్ణంగా తెలుసుకోవాలి. క్లాసులో ఎంతమంది పిల్లలుంటారు. లంచ్‌టైమ్ ఎంతుంటుంది? పాఠాలతోపాటు ఇతర కార్యకలాపాలేమైనా ఉంటాయా? మొదలైన వివరాలన్నీ తల్లిదండ్రులు తెలుసుకుని ముందే పిల్లలతో ఆ విషయాలన్నీ ముచ్చటిస్తే, స్కూలుకి వెళ్ళిన పిల్లలకు అమ్మానాన్న చెప్పిన విషయాలు అక్కడ కనిపిస్తుండటంతో ‘మా అమ్మానాన్నకి అంతా తెలుసు’ అనే ధైర్యం వస్తుంది. స్కూల్‌లో పిల్లలకి తోటి పిల్లలు మంచి ఫ్రెండ్స్ అయ్యే బాధ్యత కూడా తల్లిదండ్రులదే. అప్పుడప్పుడు వాళ్ళని ఇళ్ళకి పిలిచి మంచి మంచి తినే పదార్థాలు పెడుతుండండి. ఆ పిల్లల తల్లిదండ్రులతో కూడా మీరు మాట్లాడుతుండండి.
పిల్లలకు తగినంత ఆత్మ విశ్వాసం ఉంటే ఈ కొత్త తరగతులలో వారు అంతగా ఇబ్బంది పడరు. నిత్య జీవితంలో ఆత్మ విశ్వాసం ప్రదర్శించే పిల్లలు ఈ కొత్త సవాళ్ళను చాలా తేలికగా ఎదుర్కొంటారు. కాబట్టి పిల్లలలో ఆత్మవిశ్వాసం పెంచేలా తల్లిదండ్రుల పెంపకం ఉండాలి.
కొత్త తరగతులు - కొత్త పాఠాలు - కొత్త క్లాసులో కొత్త అంశాలేమిటో తెలుసుకొని వాటికి తగ్గట్టుగా పిల్లలు ప్రవర్తించేలా తల్లిదండ్రులు సహాయపడాలి. - పాత పాఠాల కంటే, పాత టీచర్ల కంటే కొత్త పాఠాలు క్లిష్టంగా, కొత్త టీచర్లు స్టిక్ట్‌గా ఉంటే విద్యార్థులు అందుకోలేక పోవచ్చు. కాబట్టి ఆ కొత్తపాఠాలను పిల్లలతో పాటు కొన్నాళ్ళపాటు తల్లిదండ్రులు కూడా చదవాలి. - హైస్కూల్లో అడుగుపెట్టే పిల్లలకు కొత్త తరహా బోధనా ప్రక్రియ పట్ల సరైన అవగాహన కలిగించడంలో తల్లిదండ్రులు తోడ్పడాలి. - కొత్త క్లాసు, కొత్త స్కూలు వాతావరణం, పద్ధతుల గురించి తల్లిదండ్రులు ముందే తెలుసుకోవాలి. - స్కూలు యజమాన్యంతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ, టీచర్లను కలుస్తూ పిల్లల గురించి తెలుసుకోవాలి. - కొత్త క్లాసు పిల్లలకి ఎలా ఉందో అడిగి తెలుసుకోవాలి. బాలేదంటే ‘నోర్మూసుకో’ అని తిట్టేసి పిల్లల నోరు మూసేయకూడదు. ఎందుకు బాలేదో అడిగి తెలుసుకుని నచ్చజెప్పండి. - ముఖ్యంగా పిల్లల ఇబ్బందికర పరిస్థితి కొత్త క్లాసులో చేరిన మూడు నాలుగు నెలలపాటు ఉంటుంది. ఈ దశలోనే పిల్లలకు తల్లిదండ్రుల అండ చాలా అవసరం. -పిల్లల క్లాస్‌మేట్స్‌తో, వారి తల్లిదండ్రులతో సంబంధాలు మెరుగుపరచుకోవడం చాలా అవసరం.
Other News
|
|