|
|
రిక్రూట్‌మెంట్స్
- 370 ల్యాబ్ అటెండెంట్స్ ః ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లోని ప్రయోగశాలల్లో 370 ల్యాబ్ అటెండెంట్ పోస్టులను భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ తెలిపింది. రాష్ట్ర స్థాయిలో నెలకొన్న 115 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలలో అవసరమైన చోట 370 ల్యాబ్ అటెండెంట్లను భర్తీ చేయనున్నారు. శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయనున్న 370 ల్యాబ్ అటెండెంట్ల ఉద్యోగాలకు కనీస అర్హత ఐ.టి.ఐ. (సంబంధిత ట్రేడు) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. నేడో రేపో సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ కార్యాలయానికి ల్యాబ్ అటెండెంట్ల పోస్టుల భర్తీ ఇండెంట్లు అందను న్నట్లు సమాచారం. పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్స్ పోస్టుల భర్తీ ఎపిపిఎస్‌సి చేపట్టిన సంగతి తెలిసిందే. ఇక రాబోయే 370 ఖాళీలు గల ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగాల భర్తీ బాధ్యతను ఎపిపిఎస్‌సి చేపట్టనుందని సమాచారం.
-మూడో వారంలో ప్రిలిమ్స్ రిజల్ట్స్ ః పది రోజుల్లో గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు వెల్లడించే ప్రక్రియలో ఎపిపిఎస్‌సి నిమగ్నమైంది. ఇప్పటికే వేల్యుయేషన్ ప్రక్రియ శరవేగంగా జరుగుతున్న నేపధ్యంలో ఈ నెలాఖరు కంటే వారం రోజుల ముందుగానే గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు అభ్యర్థుల ముందుకు రానున్నాయి. ఇక గ్రూప్-1 రిక్రూట్ మెంట్‌లో అదనపు పోస్టులు ఇప్పటి వరకు ఏమీ చేరకపోవటంతో చేతిలో ఉన్న 314 ఖాళీల మేరకు 1ః50 నిష్పత్తిలో అభ్యర్థులను మెయిన్స్‌కు ఎంపిక చేయనున్నారు. 1.73 లక్షల మంది హాజరైన ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కు ఎంపిక చేయనున్న అభ్య ర్థుల సంఖ్య 15 వేల పై చిలుకు ఉంటుంది. ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కు ఎంపిక చేయటంలో ప్రిలిమ్స్ పరీక్ష మార్కులనే ప్రాతిపదికగా తీసుకుంటారు.
- గ్రూప్-2 తాజా ఉద్యోగాలకు బంపర్ పోటీ ః గత నెల 27తో గ్రూప్-2 పోస్టులకు దరఖాస్తు చేయడానికి గడువు తేదీ ముగిసిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు గ్రూప్-2 రిక్రూట్‌మెంటులో ఎగ్జిక్యూ టివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ కేటగిరిలో 700 వరకు ఖాళీలు కమిషన్ చేతిలో ఉన్నాయి. ఫలితాలు వెలువడే నాటికి మరిన్ని ఖాళీలు ఏర్పడితే రిక్రూట్ మెంట్‌కు జత చేస్తారని సమాచారం. అవి ఇవి అన్నీ కలుపుకుని గ్రూప్-2కు దాదాపు 1200 ఖాళీల వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా గతంలో గ్రూప్-2 రిక్రూట్‌మెంటులో రికార్డ్ సంఖ్యలో 6.14 లక్షల మంది దరఖాస్తు చేసిన సంగతి తెలిసిందే. తాజా గ్రూప్-2 ఉద్యోగాల రాత పరీక్ష జూలై 21, 22 తేదీలలో జరుగనున్న సంగతి తెలిసిందే. గ్రూప్-2 అభ్యర్థుల హాల్ టికెట్లు జూలై రెండో వారంలోనే అభ్యర్థులకు అందుబాటులోకి తీసుకురావాలనే దిశగా కమిషన్ అధికారులు కసరత్తు చేస్తున్నారు.
-ఆర్టీసీ పోస్టులకు ఫిటెనెస్ టెస్టులు ః అర్హత సాధించిన ఆర్టీసీ సెక్యూరిటీ కానిస్టేబుల్ అభ్యర్థులకు శరీర సామర్ధ్య పరీక్షలు ఈ నెలాఖరులో నిర్వహించ డానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఆర్టీసీ జోనల్ కేంద్రాలైన విజయవాడ, కడప, నెల్లూరు, కరీంనగర్, హైదరా బాద్ ప్రాంతా లలో అభ్యర్థులకు శరీర సామర్ధ్య పరీక్షలు నిర్వహించ నున్నారు. 1.20 నిష్పత్తిలో 517 సెక్యూరిటీ కానిస్టేబుల్ పోస్టులకు 6870 మంది అభ్యర్థులను శరీర సామర్ధ్య పరీక్షలకు పిలిచామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఇందులో 391 మంది మహిళా అభ్యర్థులున్నారు. శరీర సామర్ధ్య పరీక్షలో ప్రతిభ చాటిన తర్వాత 1ః2 నిష్పత్తిలో సెక్యూరిటీ కానిస్టేబుల్ అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామ న్నారు. శరీర సామర్ధ్య పరీక్షలు, ఇంటర్వ్యూలకు నిర్దేశిత మార్కులు ఉంటాయన్నారు. మొత్తం మీద మరో రెండు నెలల్లో సెక్యూరిటీ కానిస్టేబుల్ రిక్రూట్ మెంట్ ప్రక్రియ మొత్తం పూర్తి కానుందన్నారు. 517 సెక్యూరిటీ కానిస్టేబుల్ పోస్టులకు 65 వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, ఇందులో దాదాపు 46 వేల మంది అభ్యర్థులు రాత పరీక్షకు హాజర య్యారని అధికారులు వివరించారు. ఇదిలా ఉండగా ఈ నెల 24న రాత పరీక్ష జరుగనున్న మెకానికల్ సూపర్‌వైజర్ అభ్యర్థులకు వారం రోజుల ముందు హాల్ టికెట్లు ఆర్టీసీ వెబ్‌సైటులో పెడతామన్నారు. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి నాలుగు పట్టణాలలో జరుగనున్న మెకానికల్ సూపర్‌వైజర్ రాత పరీక్షకు 4 వేల మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ రిక్రూట్‌మెంటులో 210 మెకానికల్ సూపర్‌వైజర్ పోస్టులు భర్తీ జరుగనున్న సంగతి తెలిసిందే.
ఇక 25 వేల మంది అభ్యర్థులు పోటీ పడుతున్న ట్రాఫిక్ సూపర్‌వైజర్ పోస్టుల రాత పరీక్ష జూలై 8న నిర్వహించనున్నారు. 104 పోస్టుల భర్తీ చేయనున్న ట్రాఫిక్ సూపర్‌వైజర్ ఉద్యోగాల రాత పరీక్ష 18 కేంద్రాల్లో జరుగనుంది. అర్హత గల అభ్యర్థులు జూలై తొలి వారంలో ట్రాఫిక్ సూపర్‌వైజర్ పరీక్ష హాల్‌టికెట్లు ఆర్టీసీ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
- మద్దోజు శ్రీనివాస్
Other News
|
|