Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
Sponsor Namasthe Telangana Telugu Daily From Online
Namasthe telangana Videos
Saturday, May 25, 2013
 


Home >> Studies Exams
నేటి ఇంజనీర్ సగం ఉడికిన అన్నమే!

thata
- ఏటా అవసరానికి మించి ఇంజనీర్లు
- ఎక్కువ మంది ఆఫ్ బేక్డ్ ఫుడ్
- విద్యార్థులు అధికం - అధ్యాపకులు స్వల్పం
- ఆచితూచి మంచి కాలేజి ఎంపిక
- ఏ బ్రాంచ్ అయినా బెంగలేదు
- నాలుగేళ్ళు స్టూడెంట్ - కోర్సు చుట్టూ తిరగాలి
- తల్లిదండ్రులు ఏం జరుగుతుందో
ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి!

ఒకప్పుడు ఇంజనీర్ అంటే జాతి సంపద. అందుకే ఎంతటి గౌరవం? ఎంతటి ప్రతిష్ట? జవహర్‌లాల్ నెహ్రూ వంటి వారు కూడా ప్రముఖ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ముందు చేతులు కట్టుకొని విద్యార్థిలా కూర్చునే వారు. అప్పటి ఇంజనీరింగ్ ఒక ప్రోగ్రామ్. నేడు అది ఒక ఉపాధి కోర్సుగా మిగిలిపోయింది. ఇంజనీరింగ్ విద్య పట్ల అభిరుచి ఉన్నవారే అప్పుడు బిటెక్ చేసేందుకు సాహసించేవారు. మరి నేడు ‘రోడ్లన్నీ రోమ్ నగరానికే’ అన్నట్లు అందరి దృష్టీ ఇంజనీరింగ్ వైపే. అందుకే నాలుగేళ్ళ కోర్సులో నేర్చుకోవాల్సిన నైపుణ్యాల మాట అలా పక్కన ఉంచి ఇప్పుడు ఆందోళన ఆ కోర్సు గట్టెక్కడమెలా అన్నదే. అందుకే ‘నేటి ఇంజనీర్లు సగం ఉడికిన అన్నమేనని’ అంటున్నారు ప్రముఖ ఇంజనీరింగ్ నిపుణులు డాక్టర్ పి.జి.శాస్త్రి. ఇంజనీరింగ్ రంగంలో పరిచయం అక్కరలేని ప్రముఖులు డాక్టర్ శాస్త్రి. వరంగల్ ఎన్.ఐ.టి సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్ ప్రొఫెసర్, డిపార్ట్‌మెంట్ హెడ్, ఎన్.ఐ.టి డైరెక్టర్‌గా దశాబ్దాల తరబడి సేవలందించారు. త్వరలో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో నేటి ఇంజనీరింగ్ స్థితిగతులు వివరిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులకు మార్గ నిర్దేశనం చేశారు.ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్ విద్య పట్ల విపరీతంగా పెరిగిన క్రేజ్, ఇప్పుడు అనేక సమస్యలను తెచ్చి పెట్టింది. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చింది. పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన కాలేజీలు మౌలిక వసతులు, తగిన అధ్యాపకులు లేక నాణ్యతలేని లక్షల కొద్దీ ఇంజనీర్లను మార్కెట్‌కి పంపిస్తున్నాయి. ప్రస్తుతం ఇంజనీరింగ్ కాలేజీలలో మార్కెట్ అవసరాలకి మించి ఇంజనీర్లు ఉత్పత్తి అవడం ఒక సమస్య అయితే, అందులో పనికొచ్చేవారు 15 శాతం మందే కావడం మరో సమస్య, దీనికితోడు ఫీజు రీయంబర్స్‌మెంట్, కౌన్సిలింగ్‌లో ఆలస్యం తదితర అనేక ఇబ్బందులతో అగమ్యగోచరంగా మారింది. ఈ సందర్భంగా లక్షలాది విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఇంజనీరింగ్ పట్ల సరైన అవగాహన కల్పిస్తూ, వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకుని, సరైన నిర్ణయం తీసుకునే విధంగా దిశానిర్దేశం చేసేందుకు డాక్టర్ పి.జి. శాస్త్రి టర్నింగ్ పాయింట్ ప్రతినిధితో జరిపిన సంభాషణను ఆయన మాటల్లోనే ఇస్తున్నాం.

50 ఏళ్ల క్రితం ఇంజనీరింగ్...
నేడు వేల సంఖ్యలో కాలేజీలు, లక్షల సంఖ్యలో విద్యార్థులతో ఎంతో విస్తృతమైన ఇంజనీరింగ్ విద్య యాభై ఏళ్ళ క్రితం చూస్తే దేశం మొత్తం మీద పట్టుమని వంద ఇంజనీరింగ్ కాలేజీలు కూడా ఉండేవి కావు. అప్పట్లో ఇంజనీరింగ్ విద్యాబోధన ఎంతో పరిమితంగా ఉండేది. చేరే విద్యార్థులూ అంతే.నేడు 20 వరకు ఐ.ఐ.టి. కాలేజీలుంటే నాడు ఒకటి (ఖరగ్‌పూర్ ఐ.ఐ.టి.) మాత్రమే ఉండేది. నాడు ఇంజనీరింగ్ కాలేజీలలో పాఠాల బోధించే ఇంజనీరింగ్ ఫ్యాకల్టీ విద్యార్థులకు సరిపోయేంతగా ఉండేవారు. అధ్యాపకుల కొరత మచ్చుకైనా ఉండేది కాదు. ఇండస్ట్రీలో ఉద్యోగం చేస్తున్న ఎక్స్‌పర్ట్స్ కూడా కాలేజీలకు విచ్చేసి ఇంజనీరింగ్ పాఠాలు బోధించేవారు. ఒకప్పుడు మన రాష్ట్రంలోని పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంటులో విధులు నిర్వర్తిస్తున్న ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్లు సైతం తమ ప్రాక్టికల్ ఎక్స్‌పీరియెన్స్ జోడించి ఇండస్ట్రీకి ఎటువంటి ఇంజనీర్లు కావాలో వివరిస్తూ కొన్ని ప్రత్యేక క్లాసులను బోధించేవారు. ఇలా వర్కింగ్ ఇంజనీర్లను కాలేజీలకు ఆహ్వానించి వారి పాఠాల ద్వారా విద్యార్థులకు ప్రాక్టికల్ అనుభవాన్ని కలిగించే కాలేజీలే ఎక్కువ. ఎక్కువ మంది విద్యార్థులు అత్యుత్తమ ఫ్యాకల్టీతో నిజమైన ఇంజనీర్‌గా రాణించేలా నాటి ఇంజనీరింగ్ విద్య అలరారేది. నాడు బి.ఇ చదివిన అధ్యాపకులే విద్యార్థులకు ఇంజనీరింగ్ పాఠాలు బోధించినా టీచింగ్ ఉన్నత ప్రమాణాలతో ఉండేది.

నేటి ఇంజనీరింగ్ పరిస్థితి...
దేశంలో నేడు 3500 ఇంజనీరింగ్ కాలేజీలుండగా ఇందులో అత్యధికంగా 1/5 వంతు అంటే 707 కాలేజీలు మన రాష్ట్రంలోనే ఉన్నాయి. దేశంలోని 20 శాతం ఇంజనీరింగ్ విద్య స్థానికంగా మన విద్యార్థులకు అందుబాటులో ఉండటం సంతోషించ తగిన పరిణామమే. అయితే కాలేజీల సంఖ్య మేరకు ఇంజనీరింగ్ అధ్యాపకులు లేక పోవటం వల్ల అసలు సమస్యలు ఉత్పన్నమవు తున్నాయి. బి.ఇ. పట్టభద్రులను రిక్రూట్ చేసుకునే కంపెనీలు ఇస్తున్న ఆకర్షణీయ ప్యాకేజీలను కాలేజీ యాజమాన్యాలు ఇవ్వలేకపోతున్నాయి. దానితో ఇంజనీరింగ్ చదివిన వారిలో బోధనపై ఆసక్తి ఉన్నవారు కూడా ఇంజనీరింగ్ టీచింగ్ వృత్తిని ఎంచుకోవడం లేదు. అలాగే, ఇంజనీరింగ్ చదివి ఏదో ఒక మంచి ఐటి జాబ్ వైపు తమ పిల్లలు వెళతారనే భావన తల్లిదండ్రుల్లో నేడు అధికంగా ఉంది. అంతేగాని కొంతమంది పేరెంట్స్ అయినా తమ పిల్లలు ఇంజనీరింగ్ చదివి లెక్చరర్ కావాలని కోరుకోవడం లేదు. దీనితో ఇంజనీరింగ్ విద్యలో అధ్యాపకుల కొరత తీవ్రంగా ఉంది. ఇదే ఎన్నో సమస్యలకు దారి తీస్తోంది.

ఇంజనీర్ పట్ల సమాజ దృష్టి
అప్పట్లో ఇంజనీర్ అంటే సమాజంలో మంచి గుర్తింపు, గౌరవం ఉండేవి. ప్రముఖ ఇంజనీర్ అయిన మోక్షగుండ విశ్వేశ్వరయ్య ముందు అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ విద్యార్థిలా కూర్చోని సాంకేతిక విషయాలు తెలుసుకుని నిర్ణయాలు తీసుకునేవారు. అలాంటిది ఇప్పుడు ఇంజనీరింగ్ చదవులో ప్రతిభ లేని వాళ్ళు చాలామంది తయారు కావడంతో అటు ఇంజనీరింగ్ చేసినవారికిగాని, ఇటు ఇంజనీర్ విద్యార్థులకుగాని నేడు ఏ విధమైన ప్రత్యేకత లేదు. అప్పుడు ఇప్పుడు ఇంజనీర్ పదంలో తేడా లేకపోయినా, ఇంజనీర్లలో చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం చాలామటుకు ఇంజనీరింగ్ అఫ్టిట్యూడ్ లేని వారు ఇంజనీరింగ్ కోర్సులో చేరడమే. దీని వలన ‘ఆఫ్ బేక్‌డ్ ప్రొడక్ట్’ మార్కెట్లోకి వస్తోంది. పూర్తిగా ఉడకని ఆహారాన్ని మనం ఎలాగయితే ఇష్టపడమో నేటి ఇంజనీర్ అభ్యర్థులు కూడా సరిగ్గా అటువంటి పరిస్థితే ఎదుర్కొంటున్నారు.

ఇన్ని కాలేజీలు అవసరమా?
దేశంలో 3500 కాలేజీలు, రాష్ట్రంలో 707 కాలేజీలు ఇంజనీరింగ్ విద్యను అందిస్తున్నాయి. ఏటా 6 లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు దేశవ్యాప్తంగా మార్కెట్లోకి బి.ఇ. పట్టా పుచ్చుకుని వస్తున్నారు. ఇందులో రాష్ట్రంలో రెండు లక్షలమంది ఇంజనీరింగ్ పట్టభద్రులు బయటకు వస్తున్నారు. అయితే దేశం మొత్తం మీద లక్ష పై చిలుకు ఉద్యోగాలు మాత్రమే ఇంజనీరింగ్ పట్టభద్రులకు అందుబాటులో ఉంటున్నాయి. సాఫ్ట్‌వేర్ ఇంజనీ రింగ్ ఇండస్ట్రీ వృద్ధి చెందినట్లుగా కోర్ ఇంజనీరింగ్ ఇండస్ట్రీ విస్తరించలేదు. మార్కెట్లోకి వస్తున్న మొత్తం ఇంజనీర్లలో కేవలం 15-20% అభ్యర్థులు మాత్రమే ఇండస్ట్రీకి పనికివస్తున్నారే తప్ప మిగతా అభ్యర్థులు అందరూ అలాగే మిగిలిపోతున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే మార్కెట్లోకి 6 లక్షల బి.ఇ గ్రాడ్యుయేట్లు వస్తున్నా ఈ సంఖ్యకు సమానంగా 6 లక్షల ఉద్యోగాలయితే కొత్తగా రావడం లేదు. కానీ, ఇంజనీరింగ్ కోర్సులు చదివితే ఈ రోజు కాకపోతే రేపటి రోజు అయినా ఉద్యోగం దొరక పోతుందా? ఇక్కడ కాకపోతే విదేశాలలో ఎక్కడైనా ఉపాధి లభించకుండా ఉంటుందా? అనే ఆశతో తల్లిదండ్రులు వారి పిల్లలను ఇంజనీరింగ్ వైపు మళ్ళిస్తున్నారు. అయితే వృత్తి విద్యయైన బిటెక్ మంచిదే అనుకున్నప్పటికీ, ఇదే సమయంలో ఇతర కోర్సులు చదివితే వెంటనే ఉద్యోగాలు లభించే అవకాశాల్ని అధ్యయనం చేయకపోవటం వాటిని దూరం చేసుకోవడమే అవుతుంది. మేనేజ్‌మెంట్ ఫైనాన్స్, సి.ఎ., హోటల్‌మేనేజ్‌మెంట్, ఫ్యాషన్ టెక్నాలజీ, మల్టీమీడియా రంగాల్లో అద్భుతమైన అవకాశాలున్నాయని మరువరాదు.

ఇంజనీరింగ్ చదువులో రాణించాలంటే
సరే, ఆసక్తి ఉండో, మంచి భవిష్యత్తు ఉంటుందనో ఇంజనీరింగ్‌లో చేరాలనుకుంటు న్నారు. అయితే దీనిలో రాణించేదెలా? విద్యార్థులు ఎక్కువ సమయం కాలేజీ ప్రాంగణంలో గడిపేందుకు ఇష్టపడాలి. వీలయినన్ని ఎక్కువసార్లు ల్యాబొరేటరీలకు వెళ్ళి ప్రాక్టికల్‌గా సబ్జెక్టు లోటుపాటులను నేర్చుకోవాలి. ఇంకా కాలేజీ లైబ్రరీ లో ఎక్కువ పుస్తకాలు చదవటం అలవాటు చేసుకోవాలి. విషయ అవగాహనను పెంచే సెమినార్లు, వర్క్‌షాపులు ‘మిస్’ కాకుండా పాల్గొనాలి. క్లాసురూంలో పాఠాలు వినేప్పుడు పూర్తిగా నిమగ్నమై ఉండాలి. వీలయినంత సమయం ఇంజనీరింగ్ చదువు చుట్టూ తిరిగేలా విద్యార్థి దైనందిన కార్యకలాపాలు ఉండాలి. అన్ ప్రొడక్టివ్ అక్టివిటీస్‌లో పాల్గొనకుండా ఎంచుకున్న ఇంజనీరింగ్ సబ్జెక్టును సమూలంగా నేర్చుకునే జిజ్ఞాస పెంచుకోవాలి. ఇంటినుంచి త్వరగా చేరుకు నేలా దగ్గరగా కాలేజీ ఉంటే మంచిది. ఉదయం, సాయంత్రం సమయాలు అత్యంత విలువైనవి. ఈ సమయాన్ని ప్రయాణానికి వెచ్చిస్తే ఇంజనీరింగ్ సబ్జెక్టు నేర్చుకునేందుకు విద్యార్థులకు తగిన టైం దొరకదు.

ఏ కాలేజీలు మెరుగు
మన దేశంలో ప్రభుత్వ రంగంలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలు కొంత మెరుగ్గా ఉన్నాయని చెప్పాలి. టీచర్లు కొరతను అధిగమించడం, రీసెర్చి అక్టివిటీస్ తరుచు సెమినార్లు జరగడం, నిధుల పరంపర నిరంతరం కొనసాగటం వల్ల ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలు మంచి విద్యను అందిస్తు న్నాయని చెప్పవచ్చు. ఐ.ఐ.టి.లను తీసుకుంటే, అక్కడ అత్యుత్తమ ప్రమాణాలున్నాయి. ఐ.ఐ.టి టీచర్లు ఎక్కువగా రీసెర్చిల్లో పాల్గొంటూ సరికొత్త అంశాలు కనుగొంటూ అక్కడి విద్యార్థులకు ఇంజనీరింగ్ పాఠాలు బోధిస్తుంటారు. ఎక్కువగా పేపర్స్ పబ్లిష్ చేస్తుంటారు. దేశం మొత్తంలో ఉత్తమమైన ఇంజనీరింగ్ విద్యా బోధన ఐ.ఐ.టిలలో ఉంటుంది. ఇండస్ట్రీకి అవసరమైన ప్రాజెక్టులు ఎక్కువగా అక్కడ చేపడ్తుంటారు. విద్యార్థులు ప్రత్యేకంగా, స్వయంగా ప్రాజెక్టులు పూర్తి చేసేలా ప్రోత్సాహక ఇంజనీరింగ్ విద్య ఐ.ఐ.టి.లలో లభిస్తుంది. ఐ.ఐ.టి స్థాయి కాకపోయినా ఎన్.ఐ.టి.లు కూడా వాటి విలువలను కాపాడు కునేలా ఇంజనీరింగ్ విద్యను అందిస్తున్నాయి. ఇంకా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలు వాటి పరిమితులు, సామర్థ్యం మేరకు ఉత్తమ ఇంజనీరింగ్ చదువునే అందిస్తున్నాయి. ప్రయివేటు కాలేజీలలో కొన్ని చాలా ఉన్నతంగా ఇంజనీరింగ్ విద్యను విద్యార్థులకు అందించే ప్రయత్నం చేస్తున్నాయి. అక్కడ అకడమిక్ వాతావరణం ప్రోత్సాహకరంగా ఉంటోంది. ఇండస్ట్రీలతో సన్నిహిత సంబంధాలు నెరపడం ద్వారా విద్యార్థి ఇంజనీరింగ్ చదువు ముగించగానే విద్యార్థులకు ప్లేస్‌మెంట్స్ లభించేలా చొరవ చూపుతున్నాయి.ఇది ప్రజాస్వామ్యం. ప్రజలే ఏది మంచి కాలేజీయో నిర్ణయిస్తారు. మిగతా కాలేజీలు మూతపడతాయి. నాణ్యమైన చదువు అందించే కాలేజీలు ఎప్పుడూ విజయపథంలో నడుస్తూనే ఉంటాయి. విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమ త్తంగా వ్యవహరిస్తూ ఈ తరుణంలో తగిన నిర్ణయం తీసుకోవాలి.

పేరెంట్స్ వాకబు చేయాలి
తల్లిదండ్రులకు పిల్లల అభ్యున్నతికి మించిన సంతృప్తి మరోటి ఉండ దు. కానీ ఇంజనీరింగ్‌పై ప్రాథమిక అవగాహనలేని ఎంతోమంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంజనీరింగ్ చదివించేందుకు ఉత్సా హం కనబరుస్తున్నారు. ఇది తప్పుకాదు. కానీ కాలేజీలో చేరిన విద్యార్థి ఇంజనీరింగ్ సబ్జెక్టులు ఏం చదువుతున్నాడు? ఎలా చదువుతున్నాడు? తెలియని తల్లిదండ్రులు పిల్లల చదువుని పర్యవేక్షించలేరు. అందుకని ముఖ్యంగా తండ్రి ఎంత బిజీగా ఉన్నా పిల్లల ఇంజనీరింగ్ చదువు ఎలా కొనసాగుతుందో రోజూ తెలుసుకునే ప్రయత్నం చేయాలి. రాత్రి పూట అందరూ కలిసి భోజనం చేసే సమయంలో స్నేహితుడిగా మారి తమ పిల్లల ఇంజనీరింగ్ ప్రోగ్రెస్ విధిగా తెలుసుకోవాలి. సెలవు రోజుల్లో తండ్రి ఎక్కువ సమయం పిల్లలతో గడిపే ప్రయత్నం చేయాలి కానీ ఈ రోజుల్లో ఇలా జరగటం లేదు. దానికి ఎన్నో కారణాలున్నాయి. మొదట్లోనే విద్యార్థిని ‘చెక్’ చేయకపోతే తల్లిదండ్రుల పరిస్థితి ‘చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుగా’ అయిపోతుంది. విద్యార్థి ఇంజనీరింగ్ కోర్సు చేసే సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. వాటిని ఎప్పటికప్పుడు పేరెంట్స్ గుర్తించి చేయూత నివ్వాలి.

ఏ బ్రాంచ్ అయినా బెంగవద్దు
పట్టుదలతో ఏ బ్రాంచీ సబ్జెక్టులు చదివినా అత్యు త్తమ ఫలితాలు అవకా శాలు ఉన్నాయి. ర్యాంకు తక్కువగా వచ్చినా కూడా ఇంజనీరింగ్ కోర్సును ఎలాగైనా మంచి మార్కులతో పూర్తిచేయగలననే నమ్మకం, ధైర్యం అభ్యర్థిలో ఉంటే చేరిన కోర్సులో మెరుగైన ఫలితాలే వస్తాయి. కోరుకున్న ఉద్యోగాలు తేలికగా లభిస్తాయి. ఎప్పటికప్పుడు విద్యార్థి ‘ఓపెన్ మైండ్’తో అకడమిక్ అక్టివిటీస్ పూర్తి చేసుకుంటూ ముందుకెళ్ళాలి. టాలెంట్ ఉంటే ఎవరి సిఫారసులు అక్కర్లేకుండా మంచి ఇంజనీరింగ్ ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. అయితే విద్యార్థికి ఏ బ్రాంచీ మీద అయితే ఇష్టం ఉందో దానిని మాత్రమే అతడు ఎంపిక చేసుకునేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాల్సి ఉంటుంది. లేదంటే ఇంజనీరింగ్‌లో మొదటి ఏడాది పూర్తి కాకుండానే ‘నేను ఇంజనీరింగ్ చదవలేను. బి.బి.ఎం, బి.కాం కోర్సులు చదివి ఎంబిఎ వైపు లేదా ఇతర కోర్సులవైపు వెళతానని’ ఎదురుతిరిగే ప్రమాదం ఉంది. ఒక బ్రాంచ్‌కి ఆదరణ ఎక్కువగా ఉండదనో, ఎదురింటి పిల్లవాడు ఆ బ్రాంచ్‌లో చేరాడనో, ఇతరుల ప్రభావంతో తన ఇష్టా యిష్టాలు మరచి బ్రాంచీని ఎంపిక చేసుకుంటే బిటెక్ పూర్తి చేయడం కష్టం, అభ్యర్థి అప్టిట్యూడ్ సామర్థ్యాలు బేరీజు వేసుకుంటూ బ్రాంచీని ఎంపిక చేసుకోవాలి. అప్పుడే బిటెక్ కోర్సులో రాణిస్తూ త్వరితగతిన జీవితంలో స్థిరపడే అవకాశాలుంటాయి.

సాంకేతిక విద్యా దిగ్గజం
ఏడున్నర పదుల వయస్సు. ఇంజనీరింగ్ విద్యలో అపార అనుభవం. కంఠంలో, కళ్ళల్లో ఎంతో ఉత్సాహం. చదువు పైన, సమాజంపైన మమకారం. ఐదు దశాబ్దాల నుంచి సాంకేతిక విద్యారంగాన్ని సమీపంగా చూస్తూ.. అందులో చురుకుగా పాల్గొంటూ... నేటి పరిస్థితి పై మనసులో ఆవేదన. నైపుణ్యాలు లేని చదువుల వరదలో మన పిల్లలు కొట్టుకుపోతున్నారనే ఆందోళన. ఇందుకు పరిష్కారాలపైనా స్పష్టమైన అవ గాహన... ఇవన్నీ కలసి డాక్టర్ పి.జి.శాస్త్రి. ఇంజనీరింగ్ విద్యలో వేలాదిమందికి గురుతు ల్యులు డాక్టర్ శాస్త్రిని సృశించని అవార్డులు - రివార్డులు లేవు. ఆయన చేయివేయని ప్రజాహిత ప్రాజెక్టులు లేవు. డాక్టర్ శాస్త్రి నిర్వహించని హోదాలు లేవు. ఇప్పటికీ డాక్టర్ శాస్త్రి 11 కార్పొరేట్ నిర్మాణ సంస్థలు, యూనివర్సిటీలు, ఇతర విద్యా సంస్థల్లో డైరెక్టర్‌గా, సలహాదారుగా వ్యవహరిస్తున్నారు.

Other News
Most Viewed galleries


Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd
News Photo Galleries Features
Latest News
Telangana News
Seemandhra News
National News
International News
Festivals gallery
Actress gallery
Cinema gallery
Fashion gallery
Political gallery
Sports gallery
Zindagi
Turning Point
Mee Features
Life Style
Sunday magazine