- ఆర్. త్రివిక్రమ్, కరీంనగర్.
జ ః ఆర్మీలో సోల్జర్ (జనరల్ డ్యూటీ) ఉద్యోగానికి 10వ తరగతి ఉత్తీర్ణులై 17 సంవత్సరాల 6 నెలల నుండి 23 సం॥ మధ్య వయస్సు కలిగి ఉండాలి. 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ మాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ సబ్జెక్టులతో పాసయినవారు సోల్జర్ (టెక్నికల్) ఉద్యోగానికి అర్హులు. వీరి వయస్సు 17 సంవత్సరాల 6 నెలల నుండి 23 సం॥ మధ్య ఉండాలి. మీకు ఇంటర్ ఎంపిసిలో 50% శాతం మార్కులు ఉంటే సోల్జర్ టెక్నికల్ ఉద్యోగానికి అర్హులు.
ఆర్మీలో సోల్జర్ రిక్రూట్‌మెంట్ కోసం ప్రతి నెల చివరి ఆదివారం రోజున రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో పేపర్-I, పేపర్-II రెండు విభాగాలు ఉంటాయి. పేపర్ -I అందరూ తప్పని సరిగా రాయాలి. ఇందులో ఐక్యూ/ న్యూమరికల్ ఎబిలిటీ, జనరల్ నాలెడ్జి, కరెంట్ అఫైర్స్‌పై ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష వ్యవధి 60 నిమిషాలు. మొత్తం మార్కులు 100. పాస్ కావడానికి కావలసిన మార్కులు 32 మాత్రమే.
ఆంధ్రప్రదేశ్‌లోని సికింద్రాబాద్‌లో గల ఆర్మీ బ్రాంచి రిక్రూట్‌మెంట్ ఆఫీసులో నేరుగా సంప్రదించవచ్చు.
- టి. హిమబిందు, ఆదిలాబాద్.
జ ః స్టెనోగ్రాఫర్లను కేంద్ర ప్రభుత్వంలోని మంత్రిత్వ శాఖలు, ఇతర విభాగాలలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా ఎంపిక చేసి నియామకం చేస్తుంటారు. ఇందుకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వారు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఏప్రిల్, మే నెలల్లో నోటిఫికేషన్ జారీ చేసి జులై నెలలో పరీక్ష నిర్వహిస్తారు. ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో నోటిఫికేషన్ విడుదలయింది. దరఖాస్తు చేసేందుకు చివరి తేదీ 25-5-2012, రాత పరీక్ష 27-7-2012న జరుగుతుంది. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి. ఎంపిక రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా జరుగుతుంది. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్.సి, ఎస్.టి అభ్యర్థులకు 5 సం॥ ఓబిసిలకు 3 సం॥ గరిష్ట పరిమితి మినహాయింపు ఉంది.స్కిల్ టెస్ట్ ఇంగ్లీష్ లేదా హిందీ భాషలలో నిర్వహిస్తారు. అభ్యర్థులకు 10 నిముషాల పాటు డిక్టేషన్ ఇస్తారు. నిముషానికి 100 పదాల వేగం కలిగి ఉండాలి. కంప్యూటర్‌పైన మాత్రమే ట్రాన్స్‌క్రిప్షన్ చేయగలగాలి. ట్రాన్స్‌క్రిప్షన్ సమయం ఇంగ్లీషులో 50 నిముషాలు, హిందీలో 65 నిముషాలలో చేయగలగాలి.కోర్టులు, రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు కూడా స్టెనోగ్రాఫర్లను నియామకం చేస్తున్నాయి. ఉద్యోగ ప్రకటనలు ఎంప్లాయిమెంట్ న్యూస్, దిన పత్రికల్లో రెగ్యులర్‌గా వస్తుంటాయి.