|
|
ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం కోర్సు ఎక్కడ చేయవచ్చు?
ప్ర ః నేను పల్లెటూరుకు చెందిన విద్యార్థిని. ఇటీవలే డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు రాశాను. సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయాలని అనుకుంటున్నాను. అయితే నేను ఇప్పటి వరకూ తెలుగు మీడియంలోనే చదివాను. ఇంగ్లీష్‌లో అంతగా పట్టులేదు. కోచింగ్ తీసుకునే స్థోమత కూడా లేదు. నేను సివిల్స్‌కు ప్రిపేర్ కావడం సరైన నిర్ణయమేనా? అంతే కాకుండా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయకుండా సివిల్స్ రాయడం మంచిదేనా? సలహా ఇవ్వండి ? - సుజాత, సిరిసిల్ల. జ ః డిగ్రీ పూర్తి చేసిన వారెవరైనా సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయడానికి అర్హులు. సివిల్స్‌లో సబ్జెక్టుల సిలబస్ పి.జి. స్థాయిలో ఉంటుంది. కాబట్టి పి.జి. చేసిన వారికి పరీక్ష రాయడం సులభమవుతుంది. సివిల్స్ పరీక్ష తెలుగు మీడియంలో కూడా రాయవచ్చు. ఇంటర్వ్యూ కూడా కోరుకున్న వారికి తెలుగు మీడియంలో నిర్వహించ బడుతుంది. ఇంగ్లీష్‌లో కావలసిన కనీస పరిజ్ఞానం ఉత్తర ప్రత్యుత్తరాలు రాయగలగడం, డిగ్రీ స్థాయి విద్యార్థికి ఉండవలసిన పరిజ్ఞానం ఉంటే సరిపోతుంది. సివిల్స్‌లో ఎంపికైన చాలా మంది కోచింగ్ తీసుకోకుండా స్వయంగా చదువుకున్న వారే. మీరు గత అయిదు సంవత్సరాల ప్రశ్నపత్రాలు క్షుణ్ణంగా అధ్యయనం చేసి కావలసిన పుస్తకాలు సేకరించుకోవాలి. ప్రణాళికా బద్ధంగా హర్డ్‌వర్క్ చేస్తే తప్పనిసరిగా సివిల్స్ సాధించవచ్చు.
ప్ర ః నాకు జర్నలిజం అంటే చాలా ఇష్టం. అందులో ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అంటే ఇంకా ఇష్టం. జర్నలిజం కోర్సుల్లో ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం కోర్సులు ఏవైనా ఉంటాయా? జర్నలిజానికి సంబంధించిన ఉద్యోగాలలో అంటే ప్రింట్ మీడియా, లేదా ఎలక్ట్రానిక్ మీడియాలలో ఈ తరహా ఉద్యోగాలు ఉండే అవకాశం ఉందా ? - నాగేష్, శంషాబాద్. జ ః మన రాష్ట్రంలో చాలా విశ్వవిద్యాలయాలు, ఉస్మానియా, ఆంధ్రా, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం లాంటి వాటిలో బి.సి.జె, ఎం.సి.జె కోర్సులు ఆఫర్ చేస్తున్నారు. ప్రైవేటు రంగంలో ఈనాడు స్కూల్ ఆఫ్ జర్నలిజం, రచన, ఆంధ్రజ్యోతి లాంటి పత్రికా సంస్థలు కూడా సంవత్సర కాలవ్యవధి గల జర్నలిజం కోర్సును ఆఫర్ చేస్తున్నాయి. డిగ్రీ పూర్తి చేసిన వారికి ప్రవేశ పరీక్ష నిర్వహించి ఈ కోర్సుకు ఎంపిక చేశారు. మీరు డిగ్రీ పూర్తి చేసి ఉంటే ఈ ప్రవేశ పరీక్షలు రాసి అడ్మిషన్ పొందొచ్చు. కోర్సు కాలంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల గురించి పాఠ్యాంశాలు ఉంటాయి. కోర్సు పూర్తి చేసిన వారిని సబ్‌ఎడిటర్లుగా, స్టాఫ్ రిపోర్టర్లుగా ప్రారంభ నియామకం జరుగుతుంది. ఇన్‌వెస్టిగేటివ్ జర్నలిజానికి ప్రత్యేకమైన కోర్సు, శిక్షణ అంటూ విద్యా సంస్థల్లో లేవు. వృత్తిలో చేరిన తర్వాతే ఆయా సంస్థల్లో మీ చురుకుదనం, సమయస్ఫూర్తిని బట్టి ఇన్‌వెస్టిగేటివ్ జర్నలిజంలో శిక్షణ ఇచ్చి అసైన్‌మెంట్స్ అప్పగిస్తారు.
ప్ర ః నాకు పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో జాబ్ చేయాలని ఉంది. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఏయే ఉద్యోగాలను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేస్తారు. వాటికి కావల్సిన అర్హతలు ఏమిటి ? నా ఎత్తు 5 అడుగుల ఆరు అంగుళాలు. నేను పోలీస్ పోస్టులకు అర్హుడినేనా? తెలియజేయండి? - ప్రసాద్, అదిలాబాద్. జ ః ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో కానిస్టేబుళ్ళు, సబ్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాలకు ఎక్కువ సంఖ్యలో నియామకాలు జరుగుతుంటాయి. కానిస్టేబుల్ ఉద్యోగానికి కనీస అర్హత పదవ తరగతి ఉత్తీర్ణత. శరీర దారుఢ్యం కలిగి ఉండాలి. మీ ఎత్తు 5.6 అడుగులు కాబట్టి సరిపోతుంది. రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీసు, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని (సి.ఆర్.పి.ఎఫ్), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, బిఎప్,ఎఫ్ , ఎస్‌ఎస్‌బి, తదితర సంస్థలు కూడా ప్రతి సంవత్సరమూ క్రమం తప్పకుండా నియామకాలకు నోటిఫికేషన్లు జారీ చేస్తుంటాయి. మీరు కానిస్టేబుల్‌గా చేరదలచుకుంటే జిల్లాలోని డిఆర్‌డిఎ యువజన సర్వీసులు, ఎంప్లాయిమెంట్ ఆఫీసులో సంప్రదిస్తే ఉచిత శిక్షణ కూడా ఇస్తారు. ఇక పోలీసు శాఖలో అత్యున్నత ఉద్యోగాలైన డి.యస్.పి.కి గ్రూప్-1పరీక్ష ద్వారా, ఐ.పి.ఎస్. సర్వీస్‌కు సివిల్ సర్వీసెస్ పరీక్షద్వారా నేరుగా నియామకాలు జరుపుతారు.
Other News
|
|