Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
Sponsor Namasthe Telangana Telugu Daily From Online
Namasthe telangana Videos
Wednesday, June 19, 2013
 


Home >> jobs Admissions
ఎంసెట్ 2012 ప్రత్యేకం

ramaish-photoఉత్త ఇంజనీర్లా ఉత్పత్తి ఇంజనీర్లా?
గూగుల్, మైక్రోసాఫ్ట్, యాహూ.. కాగ్జిజెంట్, డెల్లాయిట్ ... మల్టీనేషనల్ కంపెనీలు. ప్రపంచమంతటా శాఖలు. ప్రతి ఏడాది మనదేశంలో, రాష్ర్టంలో వేలాది ఇంజనీర్లను తీసుకుంటున్నాయి. కాస్త ప్రతిభ చూపితే జీతాలు లక్షల్లోనే. టి.సి.ఎస్, ఇన్ఫోసిస్, విప్రో, సత్యం మహీంద్రా, హెచ్.సి.ఎల్, దేశీయ ఐటి కంపెనీలు. దేశదేశాల కస్టమర్లతో వేల కోట్ల టర్నోవర్లతో సిబ్బందికోసం అన్వేషణ. మన ఇంజనీరింగ్ క్యాంపస్‌ల్లోనే సెలక్షన్స్. వారి ప్రాంగణాల్లో శిక్షణ. ఆర్నెల్లు గడిస్తే చాలు బరువైన శాలరీ ప్యాకేజీలు. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, యుకె దేశాలకు ఉద్యోగ రీత్యా వెళ్ళే అవకాశం.

సమీప భవిష్యత్తులోనే డాలర్లలో ఆదాయం. రూపాయల్లోకి మార్చుకుంటే యాభైరెట్లు. ఆహా! ఏమి భవిష్యత్తు. మిరుమిట్లుగొలిపే ఫ్యూచర్. మన తరం జీవితకాలంలో అందుకోలేని సుందర హర్మ ్యం. మూడు, నాలుగు దశాబ్దాలు గానుగెద్దుల్లా పనిచేసిన తర్వాత ఐదంకెల జీతాన్ని ఇప్పుడిప్పుడే అందుకుంటున్న ప్రతి తండ్రి కళ్ళల్లో ఆశాజ్యోతి. కొడుకో, కూతురో నాలుగైదేళ్ళల్లో అందుకోబోయే స్వప్నం అమ్మ, నాన్నలను పరవశుల్ని చేస్తుంది. ఆలస్యం ఎందుకు? ఆ అవకాశాన్ని మరెవరో తన్నుకుపోక ముందే పరుగెత్తాలి. శక్తి కొద్దీ పరుగో పరుగు... ఇంజనీరింగ్ ర్యాంకు అదెంత పెద్దదయినా చిన్నదయినా ఇంజనీరింగ్ కాలేజీ సీటు కోసం పరుగు. ‘ఇదిగో మంచి టాప్ కాలేజీ. టీచింగ్ టాప్. ప్లేస్‌మెంట్స్ టాప్.

ఇక్కడ సీటు కన్‌ఫర్మ్ చేసుకుంటే ఇక అమెరికా రూటే’ ఇది ప్రచార హోరు, కాస్త తెలిసిన వారిని అడగడం. వారు చెప్పిన దాంట్లో తమకు కావలసిన దానిని తీసుకోవడం. అరకొర అవగాహనతో నిర్ణయాలు తీసుకోవడం. నాలుగేళ్ళ తర్వాత స్వప్నం చెదిరిపోగా... ఇలా ఎందుకు జరిగిందో అర్ధం కాక తండ్రి బేలగా చూస్తుంటే కొడుకు ‘మరేం ఫర్వాలేదంటూ’... అవకాశం వచ్చిన ఏ కాల్ సెంటర్‌లోనో పది పన్నెండువేలకో చేరిపోవడం. ఇదీ నేటి వ్యధ. ఇంజనీరింగ్ విద్యార్ధుల సక్సెస్ స్టోరీల హోరులో ఇలాంటి వేలాది బడుగుల కలలు పీడకలలా మిగిలిపోతున్నాయి.

eng-headingఆశల పేకమేడలు కూలిపోతున్నాయి. దీనిని ఎలా అర్ధం చేసుకోవాలి? ఈ ‘విధ్వంస దృశ్యం’ మారాలంటే ఏం చేయాలి? ఇటు విద్యార్ధులు, తల్లిదండ్రులు, అటు ప్రభుత్వాలు ఏం చేయాలి? ఈ ప్రశ్నలకు సమాధానం - ‘నమస్తే తెలంగాణా టర్నింగ్ పాయింట్’ నిర్వహించిన ఎడ్యుకేషన్ ఫెయిర్‌లో ప్రముఖ విద్యావేత్త చుక్కారామయ్య ప్రసంగంలో లభించింది. రెండు రోజులపాటు జరిగిన ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ చివరిరోజున ముగింపు వేడుకలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ఇంజనీరింగ్ కోర్సులో చేరబోతున్న విద్యార్ధులు, వారి తల్లిదండ్రులను ఉద్దేశించి ఉద్వేగపూరితంగా మాట్లాడారు. ఇంజనీరింగ్ విద్య గత అవసరాలు, ప్రస్తుత స్థితి, భవిష్యత్ చిత్రాన్ని ఆవిష్కరించారు. దిశా నిర్దేశం చేశారు.

ఇంజనీరింగ్ చదువు ఒకప్పుడు మంచి ఉపాధి అవ కాశం. ఇంజనీర్లకు ప్రభు త్వమే ఉపాధి కల్పించేది మౌలిక నిర్మాణాలు, ఫ్యాక్టరీలు, ఆనకట్టలు వంటి భారీ ప్రాజెక్టుల్లో ఇంజనీర్ల అవసరం ఉండేది. ప్రభుత్వ వ్యవస్థలో పనిచేస్తూ ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం పనిచేసేవారు. ప్రభుత్వ నిర్మాణం చేపట్టాలంటే అనేకమంది ఇంజనీర్ల సమూహం పనిచేసేది. ప్రభుత్వం ఆవెూదించిన ప్రణాళికే తప్ప సొంత ఆలోచనలకు, సృజనాత్మకతకు అవకాశం లేదు. ఇక్కడ ఇంజనీర్ సేవ చేయవలసింది ప్రభుత్వానికే. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, ఉన్నతాధికారుల అభీష్టం మేరకు పనిచేస్తే చాలు. ప్రభుత్వ అవసరాలు పెద్దగా మారవు. ఒక ఆనకట్ట నిర్మాణంలోనో, రోడ్ల నిర్మాణంలోనో మార్పులు రావడం అనేది దశాబ్దానికో, రెండు దశాబ్దాలకో.. అందుకే ఇంజనీరింగ్ విద్య తటస్థంగా ఉండేది. ఇంజనీరింగ్ కోర్సులో చదువుకున్న పాఠాలను యువ ఇంజనీర్లు, తమ సీనియర్ల మార్గదర్శకత్వం కింద పరీక్షించుకునేవారు. అంతే తప్ప వారు స్వతంత్రంగా పనిచేసే అవకాశం రెండు, మూడు దశాబ్దాల తర్వాతనే వచ్చేది. అప్పుడు కూడా ఎన్నో పరిమితులు, పరిశీలనలు ఉండేవి. అందుకే ఇంజనీరింగ్ చదువు, ఇంజనీరింగ్ వృత్తి నిశ్చల తటాకంలా ఉండేది. ఎందులోనూ కదలికలకు అవకాశం లేదు.

నేటి శతాబ్ద ‘విస్ఫోటనం’ !
ఇరవై ఒకటవ శతాబ్దం అన్ని రంగాల కంటే సాంకేతిక పరిజ్ఞాన (టెక్నాలజీ) రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన విషయం మనం అందరం అంగీకరిస్తున్నాం, ఒకప్పటి లాండ్‌లైన్ టెలిఫోన్, ట్రంక్ కాల్ ఎక్కడ? నేటి మొబైల్ ఫోన్ వ్యాప్తి ఎక్కడ? నేటి పరిమితులు లేని విశ్వవ్యాప్త ఇంటర్నెట్ విస్ఫోటనం ఎక్కడ? టెక్నాలజీ ప్రఛండవేగ తుఫానులా విస్తరిస్తోంది. మరో పక్క వ్యవసాయం, పారిశ్రామిక రంగాల వృద్ధి మందగించింది. స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) రేటు పడిపోయి ఆర్థిక వ్యవస్థ చేష్టలు డిగే దశకు చేరింది. ఇప్పుడిక సేవారంగమే దిక్కయ్యింది. మొదటి నుంచి మన విద్యకు సమాజానికి సంబంధం లేదు. శ్రమకు, మన చదువుకు అనుసంధానం లేదు. బ్రిటీష్ ప్రభుత్వ విద్యా విధానం కావడం వల్ల మన చదువులన్నీ పై వర్గాల వారికే. అందుకే మన చదువుల్లో కాయకష్టం ప్రతిఫలించదు. మన శ్రమలో విద్యకు స్థానం లేదు.

అందుకే మన విద్య ఇప్పటికీ ఉత్పత్తికి అవకాశం కల్పించడం లేదు. చదువుకున్నవారిలో ఎక్కువ మంది పరిశ్రమలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఇక వ్యవసాయం చదువుకున్న వారికి అంటరానిదయ్యింది. అయితే ఈ సంక్షిష్ట దశను మన పక్కన ఉండి, మనలాగే అధిక జనాభాతో కునారిల్లుతున్న చైనా అధిగమించింది. శ్రమకు చదువులో హారతి పట్టారు. చదువులో శ్రమైకజీవన సౌందర్యాన్ని ప్రోత్సహిం చారు. దానిలో చదువుకు శ్రమకు మధ్య బంధం ఏర్పడింది. అందుకే నేడు ప్రతి ఇల్లు ఒక కుటీరపరిశ్రమ. ప్రతి గృహం ఉత్పత్తి కేంద్రమే. ఎవరెంత చదువుకున్నా చేతికి పనిచెప్పడం గౌరవం. పనిముట్లు వాడటం గర్వకారణం. సాధనాల వినియోగం సకుటుంబ సొత్తు. దీనితో చైనా స్థూల జాతీయోత్పత్తిలో వ్యవసాయ పారిశ్రామిక రంగం వాటా బలపడింది. మనదేశంలో బలహీనపడి, సేవా రంగంపైనే భారమంతా పడింది. దీనితో సేవారంగంలో ఆదాయం తెచ్చేందుకు సాంకేతిక పరిజ్ఞానమే మార్గమైంది.

ప్రపంచీకరణ తెచ్చిన మలుపు !
ప్రపంచీకరణ దేశానికి ప్రమాదాలతోపాటు అవకాశాలను తెచ్చిపెట్టింది. విశాల ప్రపంచ పరిధి కుంచించుకుపోయి ఒక చోట వస్తువు మరో చోటుకి, ఒక ప్రాంత పరిజ్ఞానం, మరొక ప్రాంతానికి విస్తరించే అవకాశాలేర్ప డ్డాయి. సహజ వనరు లు ప్రియమై పో యాయి. ఒక ప్పుడు సహజ వన రులు అపారం. కాని ఇప్పుడు పరిమితం. భూమి, సముద్రంలో, వాతావరణంలోని సహజ వనరులను పట్టి వినియోగంలోకి తీసుకురాగల మానవ వనరుల అవసరం ఏర్పడింది. మరో పక్క భారీ పెట్టుబడులు అవసరమయ్యాయి. సహజ వనరులను వినియోగించుకోలేకపోతే ఆర్థిక పరిస్థితి చిక్కుల్లో పడే పరిస్థితి ఉండడంతో ప్రభుత్వాలు చాల రంగాలను ప్రైవేట్ రంగం వశం చేసేశాయి. ప్రైవేట్ రంగంలో కార్పొరేట్ సంస్థలకు ఊతం ఇచ్చి పెట్టుబడులను ప్రవహింప జేశాయి. మరో పక్క భారీ ఎత్తున సాంకేతిక విద్య చదివిన యువతరం కోసం వేట ప్రారంభించాయి.

సేవా రంగ విశ్వరూపం !
ఇదే కాలంలో సేవారంగం తన బాహువులను చాచింది. ప్రపంచంలో ఒక చోట కంపెనీ ప్రారంభించి దాని కార్యకలాపాలను ప్రపంచం నలుమూలలా యాజమాన్యం లేకుండా వేలాదిమందితో కార్యకలాపాలు నిర్వహించే విధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధారంగా సాధ్యమయింది. ఫలితంగా మనదేశంలో ఒక్కసారిగా ఇంజనీర్లకు ఉద్యోగావకాశాలు వెల్లువలా వచ్చాయి. పెట్టుబడుల ప్రవాహంతోపాటు జ్ఞాన (నాలెడ్జ్) ప్రవాహం విశ్వాన్ని చుట్టిముట్టింది. వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు కుదేలయి జిడిపి నానాటికీ సన్నబడుతున్న ఆందోళనకర సమయంలో సేవారంగం రూపంలో వచ్చిన ఈ డాలర్ల అవకాశాన్ని ప్రభుత్వాలు ఒడిసి పట్టుకోవాలనుకున్నాయి. అయితే అది కేవలం పరిమిత సంఖ్యలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలతో అయ్యే పనికాదని త్వరలోనే గుర్తించాయి. అందుకే ఉన్నత విద్యారం గంలోకి ప్రైవేట్ భాగస్వామ్యాన్ని స్వాగతిం చాయి. కొద్ది సంవత్సరాలు బాగానే ఉంది. అవసరానికి తగ్గ ఇంజనీర్ల సృష్టి జరిగింది. కానీ డిమాండ్ పెరగ డంతో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు తామర తుంపరగా పెరిగాయి. మంది పెరగడంతో మజ్జిగ పలచనయింది. ఇంజనీరింగ్ విద్యలో నాణ్యత క్షీణించింది. ముఖ్యంగా మార్కెట్ అవసరాలకు తగ్గ ఇంజనీర్లను అందివ్వడంలో ప్రస్తుతం మనం ఘోరంగా విఫలమవు తున్నాం. ఎందువల్ల?

నైపుణ్యాల సవాళ్ళు!
ఒకప్పుడు ఇంజనీరు కళ్ళెదుట యజమాని ఉండేవాడు. యజమాని ఆదేశానుసారం ఇంజనీరు పనిచేసేవాడు. ఇప్పుడు అలా కాదు. ఎక్కడో అమెరికాలో మేనేజ్‌మెంట్ ఉంటుంది. సిబ్బంది భారత్‌తోసహా వివిధ దేశాలలో ఉంటుంది. అలాగే కంపెనీ కస్టమర్లు ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉంటారు. ఇప్పుడు ఇంజనీరుకి సారధ్యం వహించేది మేనేజ్‌మెంట్ కాదు కస్టమరు. అంటే భారత్‌లో హైదరాబాద్‌లో ఒక ఐటి కంపెనీలో పనిచేసే ఉద్యోగికి యూరప్‌లో ఒక కస్టమరు ప్రత్యక్షంగా వీడియో కాన్పరెన్స్ ద్వారా ఎదురుగ్గా నిలబడి తన అవసరాలు చెబుతా డు. తన వ్యాపార సమస్యలను చెప్పి హైదరాబాద్ ఇంజనీర్ యువకుడిని పరిష్కరించమంటారు. ఇప్పుడు మన యువ ఇంజనీరుకి రెండు రకాల నైపుణ్యాలు అవసరం. ఒకటి తాను నేర్చుకున్న ఇంజనీరింగ్ విద్య ఆధారంగా సమస్యా పరిష్కారం సూచించాలి. ఇదొక నైపుణ్యం. దానిని సమర్ధవంతంగా శక్తివంతంగా స్పష్టంగా యూరప్ కస్టమర్‌కి వివరించగలగాలి. ఇదొక భావ వ్యక్తీకరణ నైపుణ్యం. ఈ రెండూ లేకపోతే ఆ యువ ఇంజనీరుని ఐటి కంపెనీ త్వరలోనే ఇంటికి సాగనంపుతుంది. లేదా ‘బెంచ్’పై విశ్రాంతి తీసుకోమంటుంది. అంటే ఇందుకు అనుగుణంగా మన ఇంజనీరింగ్ కాలేజీలో బోధన జరగాలి. ఇక్కడే మనం వెనుకబడుతున్నాం.

నేతి బీరకాయలో నెయ్యి !
మన రాష్ర్టంలో 707 ఇంజనీరింగ్ కాలేజీ లున్నాయి. వీటిలో 3 లక్షల సీట్లు ఉన్నాయి. నిజానికి 2012 ఎంసెట్ ద్వారా ఇంజనీరింగ్ క్వాలిఫై అయిన విద్యార్ధులు ఇంతమంది లేరు. పైగా ఇప్పటికే కొంత మంది విద్యార్ధులు ఇతర రాష్ట్రాలకు తరలిపోయారు. ఫలితంగా కనీసం లక్ష సీట్లు మిగిలి పోతాయి. ఏటా లక్షా 30 వేల మంది విద్యార్ధులు ఉత్తీర్ణులవు తున్నారు. ఐటి, కార్పొరేట్ కంపెనీలు అన్నీ కలిపి లక్షలాది ఇంజనీర్లను రిక్రూట్‌చేస్తున్నందున మరి వీరందరికీ ఉద్యోగాలు వచ్చేయాలి. కానీ ఏటా ఉత్తీర్ణులవుతున్న వారి నుంచి 20 శాతం మందికి మాత్రమే కేంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఉద్యోగాలొస్తున్నా యి. ఒక పక్క ఇంజనీర్ల అవసరం లక్షల్లో ఉంటే ఇంతమంది ఉద్యోగాలు లేకుండా మిగిలిపోవడమేమిటన్నది ప్రశ్న.
కంపెనీలకు కావలసింది ఉత్త ఇంజనీర్లుకాదు. తమ కస్టమర్ల సమస్యలను పరిష్కరించగల ఉత్పత్తి ఇంజనీర్లు (రీప్రొడక్టివ్) కావాలి. తమ కస్టమర్లను మెప్పించగల ఇంజనీర్లు కావాలి. అయితే మన ఇంజనీరింగ్ చదువులో థియరీనే తప్ప ప్రాక్టికల్ నామమాత్రం.

ల్యాబ్స్ ఉన్నా వాటిని వినియోగించు కునేలా ప్రోత్సహించి అవగాహన కలిగించే టీచర్లు లేరు. కొత్తగా ఇంజనీరింగ్‌లో చేరిన విద్యార్ధులకు ఆ ఏడాదే ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారు క్లాసు చెప్పడం వల్ల సబ్జెక్టుపై పట్టు ఎలా ఉంటుంది. సబ్జెక్టు అర్ధంకాక, క్లాసులకు పోక, చివరికి పరీక్షలు తరుముకొస్తుంటే గైడ్స్ ఆశ్రయిస్తారు. సబ్జెక్టును ముక్కున పెట్టుకుని మార్కులు తెచ్చుకుంటారు. కంపెనీలకు కావలసింది ఇది కాదు. వారికి కావలసింది మార్కులు, ర్యాంకులు, గైడ్లు కాదు. కంపెనీలకు కావలసింది పరిస్థితులను, సమస్యలను అర్ధం చేసుకోవడం, వాటిని పరిష్కరించగలిగే ఆలోచనా శక్తి. మన ఇంజనీరింగ్ కాలేజీల్లో ఇది జరుగడం లేదు. అందుకే కొన్ని కంపెనీలు మాకు టాపర్లు వద్దని నిర్మోహమాటంగా చెబుతుంటాయి. ఇంజనీరింగ్‌లో నోట్స్‌లు, గైడ్లు, బట్టీ పట్ట డాలు మార్కులు తీసుకొస్తాయోమేగాని అసలైన ఇంజనీర్లను తయారు చేయలేవు. మార్కెట్ అవసరాలకు తగిన ఇంజనీర్లను రూపొందించలేవు. కంపెనీలు ఈ విషయాన్ని గుర్తించే అలాంటి కాలేజీలకు దూరంగా ఉంటున్నాయి. తగిన అవగాహన, ప్రాక్టికల్ అప్రోచ్‌లేని విద్యార్ధులు ఎంపిక కాని విధంగా తమ సెలక్షన్ విధానాన్ని రూపొందించు కుంటున్నాయి. దీనిని తల్లిదండ్రులు, విద్యార్ధులు ఎంత త్వరగా గుర్తించి మేల్కొంటే అంత మంచిది.


circle పేరెంట్ప్ చేయాల్సిందేమిటి?
ఇంజనీరింగ్ కోర్సును ఒక వెూజుగా చూడవద్దు. చుట్టుపక్కల వారు చేర్పిస్తున్నారన్నది ప్రాతిపదిక కాదు. మీ అమ్మాయి, అబ్బాయికి ఆసక్తి ఉందా? వారి నిజమైన అభిరుచి ఏమిటి? అన్నది గ్రహించండి?

మంచి కాలేజీ, మంచి బ్రాంచ్ ఎంపిక మాత్రమే మంచి ఇంజనీర్‌ను తయారు చేయలేవు. మీ అమ్మాయి లేదా అబ్బాయి నాలుగేళ్ళ పనితీరుపై ఇది ఆధారపడి ఉంటుంది.

ఇంజ నీరింగ్ కాలేజీలు నివాస ప్రాంతాలకు దూరంగా ఉంటున్నాయి. అందుకే మీరు దగ్గరగా ఉండేలా ప్రయత్నం చేయాలి. విద్యార్ధిని ఎకు

్కవ సమయం కాలేజీలో ఉండేలా ప్రోత్సహించాలి.
లేబరేటరీ వర్క్‌ను సంపూర్ణం గా వినియోగించుకునేలా చూడాలి. ఏ ల్యాబ్ వర్క్ ఎందుకు ఉద్దేశించిందో తెలుసుకుంటూ ఆ లక్ష్యాన్ని చేరేలా ప్రోత్సహించాలి.

లైబ్రరీని, డిజిటల్ లైబ్రరీని గరిష్టంగా వినియోగించు కునేలా చూడాలి. క్లాస్‌రూమ్‌లో చెప్పే పాఠాలకు జవాబులు, సందేహాలను లైబ్రరీలో అన్వేషణా దృక్పథంతో చూడాలి. రోజువారి, వారాం తాల్లో లైబ్రరీల్లో గడిపేలా చూడాలి.

రెడీమేడ్ నోట్స్‌లు, గైడ్స్‌పై ఆధారపడకుండా చూడాలి.
క్లాస్‌రూమ్ టీచింగ్‌కి అనుగుణంగా స్వయంగా నోట్స్ తయారుచేసేందుకు ప్రోత్సహించాలి.

సెమినార్లు, వర్క్‌షాప్స్ విద్యార్ధిలో అకడమిక్ స్ఫూర్తిని పెంచు తాయి. సాధారణంగా విద్యార్ధులు వీటిని బోర్‌గా కొట్టి పారేసి హాజరుకారు. ఎప్పటి కప్పుడు కాలేజీ కార్యకలా పాలను తెలుసుకుంటూ వీటిలో పాల్గొనేలా చూడాలి.

ఫైనల్ ఇయర్ ప్రాజెక్టు వర్క్‌ను సీరియస్‌గా తీసుకొని తర్వాతి నెలల్లో జరుగబోయే ప్లేస్‌మెంట్స్‌కు వారధిగా భావించాలి. పాత ప్రాజెక్టులను వినియోగించకుండా సృజనాత్మకతతో కొత్త మార్గంలో ఆలోచించేలా చూడాలి.

మంచి కాలేజీల్లో టెక్నాలజీ ఫెస్టివల్స్, కల్చరల్ ఫెస్టివల్స్ ఏటా జరుగుతుంటాయి. వీటిలో పాల్గొనేలా సహకరిం చాలి. వీటి వల్ల అనవసరంగా క్లాసులు పోతున్నాయన్న భావన రానీయవద్దు.
-యస్.వి.సురేష్

Other News
Most Viewed galleries


Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd
News Photo Galleries Features
Latest News
Telangana News
Seemandhra News
National News
International News
Festivals gallery
Actress gallery
Cinema gallery
Fashion gallery
Political gallery
Sports gallery
Zindagi
Turning Point
Mee Features
Life Style
Sunday magazine