సమ్మర్ కోర్సులు నేర్చుకుందాం... ఛలో ఛలో!
కళాశాలలు, పాఠశాలలకు వేసవి సెలవులు. అమ్మమ్మ, నాయనమ్మల ఊళ్ళకు వెళ్లి సంతోషంగా బంధువులతో గడిపే రోజులు. అయితే వేసవి సెలవుల్లో లభించే 45-60 రోజులలో, భవితకు ఉపయోగపడే కోర్సులు చేయడం ద్వారా లభించిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. సెలవులొచ్చాయి కదా అని.. కనిపించే కోర్సుల్లో లేదా స్నేహితులు చేరారనో, ఏదో ఒక దానిలో చేరితే ప్రయోజనం ఉండదు. ఒక లక్ష్యం నిర్దేశించుకొని సమ్మర్‌లో చేస్తున్న కోర్సు ఆ లక్ష్యం సాధించడానికి ఎంత వరకు సహాయపడగలదో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అసలు ఎలాంటి కోర్సులు అందుబా టులో ఉన్నాయి, ఏ కోర్సులు ఎవరికి ప్రయోజనకరమైనవి తదితర అంశాలు...
కోర్సులు ః 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు డ్రాయింగ్, అబాకస్, వేదిక్ మ్యాథ్స్, మెమొరీ ఇంప్రూవ్‌మెంట్, హ్యాండ్ రైటింగ్ తదితర కోర్సులు ప్రయోజనకరంగా ఉంటాయి.
డ్రాయింగ్ ః చిన్న పిల్లల్లో సృజనాత్మకతను పెంచేందుకు డ్రాయింగ్ తోడ్పడుతుంది. అందులోను అకడమిక్ కెరియర్‌లో విద్యార్థులు బయాలజీ, తదితర అంశాలతో పాటు ఇతర అంశాలలోనూ డ్రాయింగ్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
ఏ రంగంలోనైనా మూసధోరణిలో కాకుండా ఆలోచన లలో సృజన మేళవించాల్సి ఉంటుంది. అది చిన్న వయస్సులో అలవడితే జీవితం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఇందుకు డ్రాయింగ్ కోర్సు సరైనది.
డ్రాయింగ్ నిష్టాతులుగా మారితే జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ఎన్నో సంస్థలు పోటీలు నిర్వహిస్తూ ఉంటాయి. అందులో పాల్గొనడం ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం కూడా ద్విగుణీకృతం అవుతుంది.
ఫీజు ః ‘‘సమ్మర్ క్యాంప్’’లో రూ. 500-1000 వరకు సంస్థలను, విద్యార్థి దశలను బట్టి వసూలు చేస్తున్నారు. కోర్సు కాలవ్యవధి 15-25 రోజుల వరకు ఉంటుంది. ‘‘లైఫ్‌సైన్సెస్’’ కోర్సులు చేయాలని లక్ష్యం ఉన్న విద్యార్థులు ఈ కోర్సు తప్పని సరిగా చేస్తే మంచిది.
హ్యాండ్ రైటింగ్ ః ‘‘గ్రాఫాలజీ’’ నిపుణులు ‘‘హ్యాండ్ రైటింగ్’’ను ‘‘బ్రెయిన్’’ రైటింగ్‌గా అభివర్ణిస్తారు. చేతిరాతను మార్చుకోవడం ద్వారా జీవిత నడవడికనే మార్చుకోవచ్చని ఎన్నో ఉదాహరణలు కూడా ఉటంకిస్తున్నారు. హ్యాండ్ రైటింగ్ ‘‘చూసి వ్యక్తి మనస్తత్వాన్ని అంచనా వేసే నిపుణులే గ్రాఫాలజిస్టులు. ఈ విషయాలు పక్కన పెడితే చక్కని చేతిరాత నేటి విద్యార్థులకు ఎంతో అవసరం. హ్యాండ్ రైటింగ్ కోర్సుల్లో భాగంగా అక్షరాల ‘సైజ్’, ఫాంట్, వర్డ్ స్పేసింగ్, లైన్ స్పేసింగ్ తదితర అంశాలను బోధిస్తారు. ఇందుకు అవసరమైన మెటీరియల్‌ను కూడా ఆయా శిక్షణ సంస్థలే అందిస్తున్నాయి. కొన్ని శిక్షణ సంస్థలలో పెయింటింగ్, డ్రాయింగ్ అంశాలను కలిపి తరగతులు నిర్వహిస్తున్నారు.
ఫీజుల వివరాలు ః వేసవి సెలవుల్లో అందిస్తున్న కోర్సులలో అధిక వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. ఈ కోర్సుల్లో తర్ఫీదు పొందిన వారు కూడా తరగతులు నిర్వహిస్తున్నారు. వీరు రూ. 500-1000 వరకు ఈ కోర్సుకు వసూలు చేస్తుండగా బ్రాండ్ నేమ్ ఉన్న సంస్థలు రూ.3000 నుంచి 5,000 వరకు ఫీజు వసూలు చేస్తున్నారు.
తరగతులలో చేరే ముందు శిక్షకుడి చేతిరాత నైపుణ్యం పరిశీలించి చేరడం మంచిది.
ఆన్‌లైన్‌లోనూ తరగతులు ః ఈకోర్సుకు సంబంధించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోనూ ‘‘ఆన్‌లైన్’’ శిక్షణనూ నిర్వహిస్తున్నాయి.
* Handwriting institute.com
* free handwriting course.com
* truthstar.com
తదితర వెబ్‌సైట్లలో చేతిరాతనే కాకుండా రాత విశ్లేషణ ఎలా చేయాలి, మనస్తత్వాన్ని ఎలా అంచనా వేయాలి తదితర అంశాలను చర్చించారు.
సాఫ్ట్ స్కిల్స్ ః ప్రస్తుతం ‘‘హార్డ్ వర్క్’’ స్థానే సాఫ్ట్ వర్క్’’ వాడుతున్నారు. తక్కువ సమయంలో సమర్థవంతంగా పనిచేయడమే సాఫ్ట్‌వర్క్..ఈ నైపుణ్యాన్నే పెంపొందించేవే సాఫ్ట్‌స్కిల్స్. ఒక వ్యక్తి సమర్థవంతమైన ఉద్యోగిగా లేదా విద్యార్థిగా నైపుణ్యాలను పెంపొందించడమే సాఫ్ట్‌స్కిల్స్ ప్రధాన లక్ష్యం. అయితే ఈ కోర్సులో అంశాలు అన్ని ఒకేలా ఉండవు. చేయాల్సిన ఉద్యోగాన్ని బట్టి ఉంటాయి. ఉదాహరణకు ‘‘సేల్స్ విభాగంలో’’ వెళ్ళాలనుకునేవారికి ‘‘మార్కెటింగ్ నైపుణ్యం మేనేజ్‌మెంట్ ఉద్యోగాలకు, మేనేజ్‌మెంట్ స్కిల్స్..తదితర అంశాలను బోధిస్తారు. అయితే విద్యార్థులకు అవసరమైన సాఫ్ట్‌స్కిల్స్ వివరాలు
1.కమ్యూనికేషన్ స్కిల్స్ 2. టైమ్ మేనేజ్‌మెంట్
3. ప్లానింగ్ 4. పాజిటివ్ థింకింగ్
5. కాన్సన్‌ట్రేషన్
కమ్యూనికేషన్ స్కిల్స్ ః కమ్యూనికేషన్ స్కిల్స్‌లో స్పోకెన్ ఇంగ్లీష్ అనేవి రెండూ వేర్వేరు కోర్సులు. కమ్యూనికేషన్ స్కిల్స్‌లో గ్రూప్ డిస్కషన్స్‌లో రాణించే విధానం, ఇంటర్వ్యూలు ఎలా ఎదుర్కోవాలి, ప్రజంటేషన్ స్కిల్స్, ఇలా విభిన్న అంశాలను నేర్పిస్తారు. స్పోకెన్ ఇంగ్లీష్‌లోలా ఇంగ్లీష్ స్ట్రక్చర్స్, గ్రామర్, తదితర అంశాలకు ప్రాధాన్యం ఇవ్వరు.
ప్లానింగ్‌లో భాగంగా టైమ్ మేనేజ్‌మెంట్ స్కిల్స్‌ను సైతం బోధిస్తారు. తక్కువ సమయంలో ఎక్కువ, సమర్థవంతమైన ఫలితాలు రాబట్టే నైపుణ్యాలు ఇందులో కీలకంగా నిలుస్తాయి.
ప్లానింగ్, టైం మేనేజ్‌మెంట్ నైపుణ్యాలు విద్యార్థులకు ఎంతో అవసరం. చదవాల్సిన అంశాలన్నింటికి అందుబాటులో ఉన్న సమయాన్ని ఏవిధంగా ఉపయోగించుకోవాలో టైం మేనేజ్‌మెంట్ నేర్పిస్తుంది. ఇంకా కెరియర్ ప్లానింగ్ ఎలా ఉండాలి, అందుకు డిగ్రీ చదువుకునే సమయంలోనే ఎలాంటి నైపుణ్యాలు పెంచుకోవాలి తదితర అంశాలను నేర్చుకోవచ్చు.
- వి. రాజేంద్రశర్మ
(మరికొన్ని కోర్సులు వచ్చేవారం)
Other News