|
|
మెకానికల్ సివిల్ కోర్ కంపెనీల్లో అవకాశాలు మోర్
నాలుగేళ్ళ ఇంజనీరింగ్‌లో సాధించిన నైపుణ్యాలను ఉపయోగించుకుంటూ ఉన్నత స్థానాలను చేరుకోవడానికి కోర్ కంపెనీలు మంచి అవకాశం కల్పిస్తాయి. కంప్యూటర్స్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్... ఇలా కోర్ సంస్థల్లో నేడు అధికంగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. కోర్ కంపెనీలు అభ్యర్థులను ఎంపిక చేసుకునేముందు ఏ అంశాలు పరిశీలిస్తాయి, ఎలాంటి ప్రశ్నలు సంధిస్తారు అన్నది కీలకం. సాధారణంగా సంస్థలు థియరీపైన కాకుండా ‘‘అనువర్తనం’’ (Application)ను పరిశీలిస్తాయి. పని చేసే ప్రదేశంలో (Workplace) ఎంత చురుకుగా వ్యవహరిస్తారు అనే కోణంలో నైపుణ్యాలు పరిశీలిస్తారు. ప్రస్తుతం ‘కోర్ కంపెనీ’ల్లో విస్తృత అవకాశాలు ఉన్న మెకానికల్ విభాగం విద్యార్థులు ‘‘బేసిక్స్’’పైన పూర్థి స్థాయిలో పట్టు సాధించాల్సి ఉంటుంది. రెండో సంవత్సరం ఉండే బేసిక్స్‌పైన మెరుగైన అవగాహన అవసరం. ఆ పాఠ్యాంశాలు అనువర్తింపచేసే మెకానికల్ అంశాలను అధ్యయనం చేయాలి. మూడో సంవత్సరంలోని డైనమిక్స్, డిజైన్స్ ఆఫ్ మెటిరాలజీ, ఇన్‌స్ట్రుమెంటేషన్ తదితర విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. అలాగే మెకానికల్‌లో కీలక అంశాలు అయిన థర్మల్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్ ట్రాన్స్‌ఫర్, డైనమిక్స్ ఆఫ్ మెషినరీ, డిజైన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ తదితర అధ్యాయాలు చాలా కీలకం. థర్మల్ ఇంజనీరింగ్ విభాగం తీసుకుంటే ఇందులో మౌలిక అంశాలపైనే దృష్టి సారించాలి. అంటే బేసిక్‌లాస్ (Thermodynamics laws) ముఖ్యంగా జీరోయిథ్ లా అంశంపైన ఏ మేరకు అనువర్తన సామర్థ్యం ఉన్నదో విద్యార్థులను అడిగి తెలుసుకుంటున్నారు. అలాగే కాన్సెప్ట్ ఆఫ్ ఎన్‌ట్రోఫి పైనా ప్రశ్నలు ఉంటాయి. స్టీమ్ బేస్‌డ్, గ్యాసెస్, ఇంజిన్స్ అందులో పెట్రోల్, డీజిల్ ఇంజిన్స్ తదితర అంశాల్లో ‘‘ఇంజినీరింగ్’’ నైపుణ్యాన్ని పరిశీలిస్తారు. కోర్ కంపెనీల్లో అభ్యర్థులు ‘గ్రాడ్యుయేట్ ఇంజనీర్లుగా’’ చేరతారు. రెండు సంవత్సరాల అనుభవం తర్వాత ఐఐఎం లేదా ‘శాప్’ మాడ్యూల్ చేయడం ద్వారా ఉజ్వల భవిత ఉంటుంది. ఐఐఎంలలో చదివిన విద్యార్థులు కోర్ కంపెనీల్లో నిర్వహణ రంగంలో (Management) దూసుకు వెళ్లొచ్చు. అదే ‘శాప్’ చేసిన విద్యార్థులు ఆయా సంస్థలు సాంకేతిక అంశాలు ముడిపడి ఉన్న స్థానాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ‘బి.టెక్’తోనే కొనసాగే విద్యార్థుల ఎదుగుదల ఉన్నా కొంచెం నెమ్మదిగా ఉంటుంది.
సైట్ ఇంజనీర్లుగా సివిల్ అభ్యర్థులు సివిల్ ఇంజనీరింగ్ అభ్యర్థులకు నిర్మాణ రంగం లేదా నిర్మాణ సామాగ్రి తయారీ సంస్థలలో ఉద్యోగాలు ఉంటాయి. వీరికి సిలబస్‌పైన పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలి. అంశాల అనువర్తనాలు ‘‘ప్రాక్టికల్’’ నాలెడ్జ్ చాలా కీలకం. సివిల్ విద్యార్థులను సైట్ ఇంజనీర్లుగా లేదా మేనేజ్‌మెంట్ ట్రైనీలుగా తీసుకుంటున్నారు. ప్రతి సంస్థ ఏటా 5-6 అభ్యర్థులను ఎంచుకుంటుంది. ముఖ్యంగా స్ట్రక్చర్, స్ట్రెంగ్త్ మెటీరియల్స్, బీమ్స్ డిజైన్స్, స్ట్రక్చరల్ డిజైన్, కాంక్రీట్ స్ట్రక్చర్స్, బిల్లింగ్ మెటీరియల్స్ అంశాల నుంచి ఎక్కువగా ప్రశ్నలు అడుగుతున్నారు.మాక్ ఇంటర్వ్యూలతో మేలు :- ‘కోర్’ కంపెనీ ఇంటర్వ్యూల్లో నెగ్గుకు రావాలంటే మాక్ ఇంటర్వ్యూలు బాగా ఉపయోగం. అయితే ఇంటర్వ్యూ చేసే బోర్డులో వివిధ సబ్జెక్ట్స్ ఎక్స్‌పర్ట్ ఉండాలి. వీటిలో ‘హెచ్.ఆర్’ రౌండ్ ఇంటర్వ్యూల్లో లాగా కాకుండా చేయబోయే పనికి, చదివిన చదువుకు సంబంధించిన అంశాలు ఉంటాయి. కోర్ కంపెనీల్లో ఎంపికైన సివిల అభ్యర్థులకు సైతం ప్రారంభంలో రూ.3.5- 4 లక్షల వేతనం ఉంటుంది.ప్లేస్‌మెంట్స్ చేసే సంస్థలు ః ఎల్ అండ్ టి, జె.పి. సిమెంట్, ఎన్.సి.సి. (నాగార్జున కన్‌స్ట్రక్షన్స్ కం.) స్కై షేడ్... మొదలైనవి.
మెకానికల్ కోర్ సంస్థల నేపథ్యం టాటా :- ఇందులో టాటా ప్రాజెక్ట్స్, టాటా హెలికాప్టర్ డివిజన్లు ఉన్నాయి. ప్రతి సంవత్సరం 8-10 మందిని ‘‘కోర్ కంపెనీల్లో ’’ ఉద్యోగులుగా ఈ సంస్థ ఎంచుకుంటుంది. శిక్షణ కాలం - 2 సంవత్స రాలు. తర్వాత ఫ్లోర్ ఇన్‌ఛార్జిగా బాధ్యతలు అప్పగిస్తారు. శిక్షణ కాలంలో ‘షెడ్యూల్స్’ అమలుకు సంబంధించి వీరికి విధులు ఉంటాయి. ప్రారంభంలో వార్షిక వేతనం ఏడాదికి రూ.3-3.5 లక్షల వరకు ఉంటుంది. ఐటీసీ :- అన్ని రకాల ఉత్పత్తులను తయారు చేసే సంస్థ ఐటిసీ. ఈ సంస్థ ఇంజనీర్లను మేనేజ్‌మెంట్ ట్రైనీగా తీసుకుంటుంది. రెండేళ్ల తర్వాత అసిస్టెంట్ మేనేజర్, ప్రతిభ ఆధారంగా మేనేజర్ స్థాయికీ వెళ్లొచ్చు. మేనేజ్‌మెంట్ ట్రైనీగా ఉన్నప్పుడు షాప్‌ఫ్లోర్ నిర్వహణ తీరు, ఇతరులతో మెలిగే విధానం తదితర అంశాలను పరిశీలిస్తారు. వేతనం రూ.3.5 నుంచి 4 లక్షల వరకు ఉంటుంది. ఎస్‌ఆర్ స్టీల్ :- ఈ సంస్థ కూడా ‘‘గ్రాడ్యుయేట్ ఇంజనీర్లను’’ సంస్థలోకి తీసుకుంటుంది. ప్రాసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ తదితర విభాగాల్లో శిక్షణ ఉంటుంది. వార్షిక వేతనం రూ. 3.5 - 4 లక్షల వరకు ఉంటుంది.
పరిశీలన కీలకం కోర్ కంపెనీలు చేసే ఇంటర్వ్యూల్లో విద్యార్థుల పరిశీలన ఏ మేరకు ఉందన్న అంశాన్ని పరిశీలిస్తారు. అనువర్తన విజ్ఞానం ఎలా ఉందో అంచనా వేస్తారు. ‘సునిశితత్వాన్ని’ పరీక్షించేలా ప్రశ్నలు ఉంటాయి. ఉదాహ రణకు ‘‘Why four stroke engine is more efficient than 2 stroke’ లేదా Difference between 2 stroke and 4 stroke’’ ఇలా వివిధ ప్రశ్నల ద్వారా.. వివిధ సిద్ధాంతాలను అభ్యర్థి ఎలా అవగాహన చేసుకున్నాడన్నది విశ్లేషిస్తారు. వాటిని ఉద్యోగంలో ఎంత వరకు అనువర్తనం చేయగలడు? ఇలా అన్ని కోణాలు వెలికి తీస్తారు. అందుకే ‘బేసిక్స్’పై బాగా అవగాహన పెంచుకొని భిన్న సందర్భాల్లో అనువర్తింపచేసేలా ఆలోచనా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి. - డా. ఎం. శ్రీనివాసరావు (ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ ఆఫీసర్) ప్రొఫెసర్, మెకానికల్ ఇంజనీరింగ్ జెఎన్‌టీయు.
Other News
|
|