Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
Sponsor Namasthe Telangana Telugu Daily From Online
Namasthe telangana Videos
Sunday, May 19, 2013
 


Home >> Current Affairs
జనరల్ ఎస్సే

సంకీర్ణ ప్రభుత్వాల యుగంలో రాష్ట్రపతి కీలుబొమ్మా? క్రియాశీలమా?
Current_Clipరాష్ర్టపతి ఎన్నిక పూర్తయింది. మొన్నటి వరకూ ఆర్థిక మంత్రిగా ఉన్న ప్రణబ్ ముఖర్జీ నేడు రాజ్యాంగాధినేత. ఎన్.డి.ఏ కూటమిలో భాగస్వాములైన పార్టీలు కొన్ని ప్రణబ్‌కు అనుకూలంగా ఓటు వేయగా కొందరు యుపిఏ సభ్యులు ఆయన ప్రత్యర్థి సంగ్మాను సమర్థించారు. ఆ చర్యల వెనుక అనేక రాజకీయ సమీకరణాలు ఉన్న మాట వాస్తవం. ఈ ఆసక్తికర పరిణామాల నేపథ్యంలో భారత రాజ్యాంగ రీత్యా రాష్ర్టపతికి ఉన్న అధికారాలు ఏమిటి? రాష్ర్టపతి కేవలం రబ్బరు స్టాంపేనా? సంకీర్ణ ప్రభుత్వాల యుగంలో రాష్ర్టపతి ఏ విధంగా వ్యవహరించే అవకాశం ఉంది? మొదలైన అంశాలను గురించి చర్చించేదే ఈ వ్యాసం.

భారత రాజ్యాంగాన్ని అనుసరించి రాష్ర్టపతి రాజ్యాంగా ధినేత, ప్రథమపౌరుడు. కాని వాస్తవ కార్యనిర్వహణాధికారి ప్రధానమంత్రి. రాజ్యాంగంలో రాష్ర్టపతికి సలహా, సహకారం అందించడానికి ప్రధానమంత్రి నేతృత్వంలోని మంత్రి మండలి ఉంటుందని పేర్కొన్నా, రాష్ర్టపతి చాలా సందర్భాలలో మంత్రి మండలి నిర్ణయాలకు ఆవెూదం తెలిపే వ్యక్తిగానే కొనసాగు తున్నాడు. అది పార్లమెంటరీ సాంప్రదాయం దృష్ట్యా సమంజసమే కాని రాజ్యాంగాధినేత రాష్ర్టపతి. అప్రజాస్వామిక, అహేతుక చర్యలను అడ్డుకోవడానికీ, రాజ్యాంగ రీత్యా అతనికి కొన్ని అధికారాలు ఉన్నాయి. వాటిని రాష్ర్టపతి ఎలా వినియోగిస్తాడు అన్న అంశంపైనే రాష్ర్టపతి పదవి ప్రాముఖ్యత ఆధారపడి వుంటుంది. ఇప్పటివరకు రాష్ర్టపతి పదవి చేపట్టిన వ్యక్తులు ప్రశంసించబడినా, విమర్శించబడినా దాని వెనుక వారికి రాజ్యాంగం ప్రసాదించిన అధికారాలతోపాటు వారి వ్యక్తిత్వం, విజ్ఞత మొదలైన అంశాలన్నీ ప్రముఖ పాత్ర వహించాయి.

ఇందిరాగాంధీ అంతర్గత అత్యవసర పరిస్థితి విధింప చేసినప్పుడు అధికార పార్టీకి ఉన్న బలం దృష్ట్యా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే ఒక చర్యకు భారత రాజకీయ చరిత్రలో అవకాశం ఏర్పడింది. కాని రాష్ర్టపతి స్థానంలో వున్న వ్యక్తి విజ్ఞతను ప్రదర్శిస్తే అలాంటి ప్రజాస్వామిక చర్యలను కొంతమేరకైనా నివారించవచ్చు.

Rashtrapathi_Heading అదే విధంగా సంకీర్ణ ప్రభుత్వాల యుగం ప్రారంభమైన తర్వాత ఏ రాజకీయ పార్టీకి పూర్తి మెజారిటీ లేకపోవడంతో నామమాత్రపు అధికారి అయిన రాష్ర్టపతి క్రియాశీలకంగా వ్యవహరించడానికి కూడా అవకాశం ఉంది.

ఉత్తరప్రదేశ్‌లో రాష్ర్టపతి పాలన విధించమని చేసిన సూచనలను పునఃపరిశీలనకు పంపడం ద్వారా వెంకట్రామన్, పాకెట్ విటో అధికారాన్ని ఉపయోగించి జైల్‌సింగ్, లాభదాయక పదవుల బిల్లుపై సస్పెన్స్ వీటో చేసి అబ్దుల్ కలాం తమ అధికారాలు చాటుకున్నారు.

ఏదైనా బిల్లు రాష్ర్టపతి ఆవెూదానికి పంపినపడు ప్రతి పక్షాలు ఆ విధానాన్ని తీవ్రంగా విమర్శిస్తుంటే సంకీర్ణ ప్రభుత్వాల్లో రాష్ర్టపతి ఆ బిల్లును పునఃపరిశీలనకు పంపే అవకాశం ఉంటుంది.
ఉదా : లాభదాయక పదవుల బిల్లు

తొలి తరం రాష్ర్టపతులయిన రాజేంద్రప్రసాద్, రాధాకృష్ణన్ లాంటి వ్యక్తులు వారి అసాధారణ వ్యక్తిత్వం కారణంగా ప్రభుత్వానికి పెద్ద తరహా సలహాదారులుగా ఉంటూ ప్రధానమంత్రి, మంత్రిమండలి నిర్ణయాల వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలు, పరిణామాలను ముందే విజ్ఞతతో ఊహించి ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేశారు.

అయితే రాష్ర్టపతులు రాజ్యాంగ బద్దంగా లభించే అధికారాలను ఉపయోగించుకోవడమే కాకుండా నిర్మాణాత్మక సూచనల ద్వారా ఆ పదవి అసలు లక్ష్యాన్ని సంతృప్తిపరిస్తే ప్రజాస్వామ్యం పరిపుష్టమవుతుంది.
ఉదాహరణ : లాభదాయక పదవుల వివాదాన్నే పరిశీలిద్దాం. భారత రాజ్యాంగం ప్రకారం లాభదాయకమైన పదవి ఉన్నవారు పార్లమెంటు సభ్యత్వానికి అనర్హులవుతారు. అయితే రాజ్యాంగంలో లాభదాయకమైన పదవిని నిర్వచించలేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఏ పదవులు లాభదాయక పదవుల కిందికి రావో నిర్ణయించే అధికారం పార్లమెంటుకు ఉంది. ఈ కారణం చేత పార్లమెంటు సభ్యులు అనర్హులు కాకుండా మినహాయించే అధికారం పార్లమెంటుకుంది. 1959 సం॥ చేసిన చట్టం ద్వారా లాభదాయక పదవులు కాని పదవులను పార్లమెంటు నిర్వచించింది. ఆ తరువాత 1959 సం॥ చేసిన చట్టానికి సవరణలు చేస్తూ అనర్హత నిబంధనలు వర్తించని పదవుల జాబితాను సవరించాల్సింది, కానీ అనేక సంవత్సరాలుగా ఇది జరుగలేదు.

ఇప్పుడు అనేక మంది పార్లమెంటు సభ్యులు వివిధ పదవుల్లో కొనసాగుతున్నారు. నిజానికి ఏది లాభదాయక పదవి అవుతుందో కూడా పార్లమెంటు సభ్యులకు తెలియక పోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు వీరందరు లాభదాయక పదవుల్లో ఉన్నారని అనర్హులుగా ప్రకటిస్తే వారే తిరిగి పోటీ చేసి గెలుస్తారు (సోనియాగాంధీ రాజీనామా చేసి తిరిగి ఎన్నికయిన విధంగానే) దానివల్ల ప్రజాధనం వృధాకావడం తప్ప మరో ప్రయోజనం ఉండదు. ఈ సమస్య పరిష్కారానికి వెంటనే చేపట్టాల్సిన చర్య ఏమిటంటే పార్లమెంటు సభ్యుల అనర్హతల నుంచి మినహాయింపు చట్టం తీసుకువచ్చి లాభదాయక పదవుల జాబితాను సవరించాలి. నిజానికి పార్లమెంట్ కూడా అదే పని చేసి ఆ బిల్లును రాష్ర్టపతి పరిశీలనకు పంపింది.

Pranabరాష్ర్టపతి ఆ బిల్లును పునఃపరిశీలనకు పంపుతూ ఈ క్రింది ప్రధాన అంశాలను లేవనెత్తారు.
1.అనర్హతల నుంచి మినహాయింపు ముందు తేదీ నుంచి అమలయ్యేలా చట్టం పేర్కొనడం జరిగింది. (అది సరికాదని రాష్ర్టపతి భావించారు).
2.జాతీయ, రాష్ర్టస్థాయిలో లాభదాయక పదవుల విషయంలో ఒకే విధమైన పద్ధతిని అనుసరించాలని సూచించారు.
అయితే 1969లోనే సుప్రీంకోర్టు ఒక తీర్పు వెలువరిస్తూ కొన్ని పదవులకు సంబంధించి అంతకు ముందు తేదీ నుంచే మినహాయించే అధికారం పార్లమెంటుకు ఉందని ధృవీకరించింది.
ఇక జాతీయ, రాష్ర్ట స్థాయిలో లాభదాయక పదవుల విషయంలో ఒకే పద్ధతి అనుసరించడానికి సంబంధించింది. కానీ సమాఖ్య తరహా విధానాన్ని అనుసరిస్తున్న భారతదేశంలో తమ సభ్యులకు సంబంధించిన విషయంలో చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకు, శాసనసభలకు రెండింటికీ ఉంటుంది కాబట్టి ఈ సూచన సమాఖ్య సూత్రాలకు విరుద్ధం.

రాజ్యాంగంలో లాభదాయక పదవికి నిర్వచనం లేదు. కనుక ఇదే పరిస్థితి మళ్ళీ పునరావృతమవుతుంది. కాబట్టి ఏది లాభదాయక పదవి? ఏది లాభదాయక పదవి కిందికి రాదు అనే విషయంలో స్పష్టమైన ప్రాతిపదికను రూపొందించమని రాష్ర్టపతి పార్లమెంటును కోరి వుంటే అది మరింత నిర్మాణాత్మక చర్య అయివుండేది. అయితే ఇక్కడ రాష్ర్టపతి నిజాయితీనిగాని, రాజకీయ వ్యవస్థను మెరుగుపరచాలన్న అతని ఉద్దేశాన్ని గాని శంకించలేము. కాని సదుద్దేశంతో కూడా రాఫ్ట్రపతి రాజ్యాంగ పరిధిని దాటి వ్యవహరించకూడదు.

రాజ్యాంగ రీత్యా రాష్ర్టపతి కేవలం నామమాత్ర అధికారి మాత్రమే అని నెహ్రూ, అంబేద్కర్‌లు భావించగా రాజేంద్రప్రసాద్, కె.ఎం.మున్షీ వంటి ప్రముఖులు కేంద్ర మంత్రిమండలి సలహాతో సంబంధం లేకుండా రాష్ర్టపతికి కొన్ని విచక్షణాధికారాలు ఉంటాయని పేర్కొన్నారు. వీరి ఉద్దేశ్యంలో రాష్ర్టపతి తన పదవీ ప్రమాణ స్వీకార సమయంలో రాజ్యాంగాన్ని, చట్టాన్ని సంరక్షిస్తానని, దేశ ప్రజల శ్రేయస్సుకు, సేవకు అంకితమవుతానని ప్రమాణస్వీకారం చేస్తాడు కాబట్టి ఆ ప్రమాణం ప్రకారం రాష్ర్టపతికి స్వతంత్ర అధికారాలు ఉంటాయని వ్యాఖ్యానించారు. మంత్రి మండలి సమర్ధ వంతంగా పనిచేయలేనప్పుడు, రాజ్యాంగ పరమైన యంత్రాంగం అదుపు తప్పినప్పుడు రాష్ర్టపతి శక్తివంతమైన వ్యక్తిగా రూపొందుతాడు.

రాష్ర్టపతులుగా వ్యవహరించే వ్యక్తులు సమున్నత వ్యక్తిత్వం గల వారయితేనే రాజ్యాంగ లక్ష్యాలు నెరవేరుతాయి. రాజేంద్రప్రసాద్, రాధాకృష్ణన్‌లవంటి రాష్ర్టపతుల సేవలను అందుకున్న భారతావని కీలుబొమ్మలుగా, వ్యక్తిత్వ రాహిత్యం ద్వారా ఆ పదవి స్థాయిని దిగజార్చిన వ్యక్తుల ద్వారా కడగండ్లను ఎదుర్కొంది.
ఇందిర ఆదేశిస్తే చీపురు పట్టుకొని శుభ్రం చేయడానికైనా సిద్దమని ఒక మాజీ రాష్ర్టపతి ప్రకటిస్తే భారత రాష్ర్టపతి హోదాలో బ్రిటన్ పర్యటనకు వెళ్ళి, నిర్ధిష్ట కాల పరిమితి దాటాక కూడా కుటుంబ సభ్యులతో అక్కడే ఉన్న ఒక రాష్ర్టపతికి ఒక దేశ రాష్ర్టపతికి ఇవ్వాల్సిన అధికారిక మర్యాదలేవీ ఇవ్వకుండానే బ్రిటన్ భారత్‌కు పంపింది. ఇక రాజీవ్‌గాంధీ సర్కార్ కాలంలో రాజీవ్‌కు జైల్‌సింగ్‌కు ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగినంతకాలం జైల్‌సింగ్‌కు విదేశీ పర్యటనలకు అనుమతివ్వకుండా రాజీవ్ సర్కార్ జైల్‌సింగ్‌ని ఇబ్బందిపెట్టింది. జైల్‌సింగ్ రాజీవ్‌తో రాజీ కుదుర్చుకున్నాకే రాష్ర్టపతి హోదాలో యుగోస్లోవియా, గ్రీస్, పోలాండ్ పర్యటనలకు వెళ్ళగలిగారు. రాష్ర్టపతి పదవి చేపట్టే వ్యక్తులు ఇలాంటి వ్యక్తిత్వ రాహిత్య చర్యలకు పాల్పడడం కాని, అధికారిక ప్రభుత్వాలు తమ ప్రయోజనాల కోసం, రాష్ర్టపతులను ఇబ్బందులు పెట్టడం గాని సమంజసం కాదు.

రాష్ర్టపతిగా ఎన్నికయ్యే వ్యక్తికి పాలనాదక్షత, కీలక అంశాలపై అవగాహన ఉండాలి. సంకీర్ణ ప్రభుత్వాలు సహజ పరిణామంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ర్టపదవి నిర్వహించే వ్యక్తి మరింత క్రియాశీలకంగా వ్యవహరించడం తప్పనిసరి. దేశ గౌరవప్రతిష్టలకు సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తూ జాతి ప్రయోజనా లను కాపాడే వ్యక్తిగా రాష్ర్టపతి ఉండాలి.

వ్యాసకర్త ః హైదరాబాద్‌లో పోటీపరీక్షల నిపుణులు

Other News
Most Viewed galleries


Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd
News Photo Galleries Features
Latest News
Telangana News
Seemandhra News
National News
International News
Festivals gallery
Actress gallery
Cinema gallery
Fashion gallery
Political gallery
Sports gallery
Zindagi
Turning Point
Mee Features
Life Style
Sunday magazine