స్త్రీ,పురుష నిష్పత్తిలో అగాథం
మానవ సమాజం స్త్రీ, పురుషులు ఇద్దరితోనూ ఏర్పడిన ఒక సర్వోన్నత వ్యవస్థా విధానం. సృష్టిలో జీవజాలం అన్నింటిలో ఉన్నతుడిగా పరిగణిస్తున్న మానవుడు తన అనైతిక ఆలోచనలతో చేజేతులా తన జాతి మనుగడను తానే ప్రమాదంలో పడేలా వ్యవహరిస్తున్నాడు. జాతి మనుగడకు స్త్రీ, పురుషులు ఇద్దరూ అవసరమే అనే ప్రాథమిక సూత్రాన్ని విస్మరించి వివిధ కారణాలతో కేవలం పురుష సంతతి వైపే మొగ్గు చూపడంతో ప్రస్తుత సమాజంలో బాల, బాలికల లింగ నిష్పత్తి తగ్గిపోయింది. అంటే భవిష్యత్తులో సమాజంలో మహిళలు ఉండవలసిన సంఖ్యలో ఉండే అవకాశం లేదు. దీని వలన ఏర్పడే ప్రతికూల పరిస్థితులు మానవ సమాజాన్ని అస్థిర పరుస్తాయి. ఆ పరిస్థితులు రాకుండా ఇప్పటి నుండే తగిన జాగ్రత్తలు తీసుకోవడం మనిషి మనుగడకు చాలా అవసరం.
భారతదేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం ఆరేళ్ల లోపు బాల బాలికల నిష్పత్తి పరిశీలిస్తే ప్రతి వేయి మంది బాలురకు కేవలం 914 మంది బాలికలు మాత్రమే ఉండటం విషాదం. అంతకు ముందు ఇది 927గా ఉండేది.
భారత్‌లో సంప్రదాయంగా చేపట్టే జనాభా లెక్కల సేకరణ, మానవ జనాభాకు సంబంధించిన, ప్రాథమిక మానవ అమరికను వివరిస్తుంది. ఇది అనేక ప్రధాన విశ్లేషణలతో కూడి ఉంటుంది. ఒక సమాజంలోని స్త్రీ, పురుషుల సంఖ్య, అక్కడి స్త్రీ పురుషుల సమానత్వానికి సంబంధించిన స్పష్టమైన అవగాహన కలిగిస్తుంది. లైంగిక సమతుల్యతను గణించడానికి, లింగనిష్పత్తి అద్భుతమైన ఉపకరణం. ప్రపంచంలోని చాలా దేశాల్లో మాదిరిగానే భారత దేశంలో కూడా స్త్రీ, పరుష నిష్పత్తిలో చాలా తేడా ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం, దేశం మొత్తం జనాభా 1,21,01,93,422 కాగా, అందులో పురుషుల సంఖ్య 62,37,24,248 కాగా, స్త్రీల సంఖ్య 58,64,69,174. 2001 జనాభా లెక్కలతో పోలిస్తే చాలా కొద్దిగా స్త్రీల జనాభా పెరిగింది. 2001 లింగనిష్పత్తి రీత్యా ప్రతి వేయి మందికి 932.91 మంది మహిళలుండగా, 2011నాటికి అది 940.27కి పెరిగింది. అదే 0-6 ఏళ్ల మధ్య వయసున్న పిల్లల విషయానికి వస్తే 927 నుంచి 914కు పడిపోవడం ఆందోళన కలిగించే విషయం. ఇక 2012 ప్రపంచ బ్యాంకు నివేదికను పరిశీలిస్తే మనం సిగ్గుతో తలవంచుకోవాల్సి వస్తుంది.
ముఖ్యంగా ప్రసూతి సమయంలో బాలికల అదృశ్యం విషయంలో చైనా స్థానం తర్వాతి స్థానం భారత్‌దే. 1990 నుంచి జనన సమయంలో బాలికల అదృశ్యం కేసులు భారత్‌లో క్రమంగా తగ్గుముఖం పట్టడం కారుచీకటిలో కాంతిరేఖ వంటిదే. ‘‘లైంగిక సమానత్వం, అభివృద్ధి’’ పేరిట విడుదలైన ఈ నివేదికలో, ప్రపంచ జనాభాకు మరో 1.2 మిలియన్ల బాలికలు జమకూడాల్సి ఉంది. (ఇందులో పది లక్షల మంది బాలికలు ఒక్క చైనా నుంచే.). భారత్, చైనాల్లో మగ పిల్లవాడికే ప్రాధాన్యత నివ్వడం సంస్కృతిలో భాగంగా వస్తోంది. ఫలితంగా అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని గర్భస్థ శిశువు ఆడ లేక మగ అనే విషయాన్ని తెలుసుకొని, అబార్షన్ల రూపంలో స్త్రీ శిశు భ్రూణహత్యలకు పాల్పడుతున్నారు. దీన్నే నోబెల్ బహుమతి గ్రహీత, ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్యసేన్.. ‘‘ప్రసూతి అసమతౌల్యత’’ అని అభివర్ణించారు. ఈ నేపథ్యంలో ప్రసూతికి ముందు లింగ నిర్ధారిత పరీక్షలను నిషేధిస్తూ, భారతప్రభుత్వం ‘‘ప్రీనాటల్ డయాగ్నస్టిక్ టెక్నిక్స్ చట్టాన్ని రూపొందించినా పెద్దగా ఫలితం ఉండటం లేదు. స్త్రీ భ్రూణ హత్యలు, శిశు హత్యలు, లింగనిర్ధారణ ద్వారా గర్భవిచ్ఛిత్తికి పాల్పడటం వంటివి కూడా బాల, బాలికల నిష్పత్తిలో తగ్గుదలకు కారణమని తెలుస్తోంది.
అయితే ఈ స్త్రీ శిశు భ్రూణహత్యలు, లింగనిర్ధారణ తర్వాత గర్భవిచ్ఛిత్తి, వంటివి సాంస్కృతికంగా బాగా అభివృద్ధి చెందినట్లుగా భావిస్తున్న పంజాబ్, హర్యానాల్లో అధికంగా జరుగుతుండడం విశేషం. ఈ అకృత్యాలు జరగడానికి పేదరికం ఏమాత్రం కారణం కాదు. ఇక ధనిక వర్గాలకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం గురించి బాగా తెలియడం, అందుబాటులో ఉండటం వల్ల కూడా తల్లి గర్భంలోనే శిశు లింగ నిర్ధారణ చేసుకొని అబార్షన్లకు పాల్పడుతున్నారు. భారత్ విషయంలో మనకు కనిపించే మరో ఆసక్తి కలిగించే అంశమేమంటే, పట్టణ ప్రాంతాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లో ఈ లింగ నిష్పత్తి అధికంగా ఉండటం. అయితే తమిళనాడుకు మాత్రమే ఇందుకు మినహాయింపు ఉంది. అక్కడ గ్రామీణ ప్రాంతాల్లో కంటే, పట్టణ ప్రాంతాల్లోనే లింగనిష్పత్తి అధికం. పట్టణీకరణ, పరిణితి చెందిన సమాజాల కారణంగా కూడా శిశువుల్లో లింగ నిష్పత్తి పెరగడానికి దోహదం చేసిందని చెప్పవచ్చు. ఇక దేశవ్యాప్తంగా పరిశీలిస్తే, ఆదాయాలు పెరుగుతున్న కొద్దీ, ఈ లింగ వివక్ష కూడా పెరుగుతూ పోవడం విచారించాల్సిన అంశం. పంజాబ్ వంటి రాష్ట్రాల్లో ఉన్నత సమాజాల్లో ఈ లింగ నిష్పత్తి చాలా దారుణంగా పడిపోవడాన్ని గమనించవచ్చు.
దేశంలో సగటున ప్రతి వెయ్యి మంది బాలురకు 914 మంది బాలికలుండగా, పంజాబ్‌లో మాత్రం 846 మంది బాలికలు మాత్రమే ఉన్నారు. దేశ రాజధానిలోని దక్షిణ ప్రాంతానికి చెందిన ఉన్నత సమాజాల్లో కూడా ఈ లింగ నిష్పత్తి చాలా తక్కువ ఉన్నది. రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో మరింత దయనీయంగా అంటే ప్రతి వెయ్యి మంది బాలురకు 745 లేదా 754 లేదా 779 మంది బాలికలు మాత్రమే కనిపిస్తారు. ఇక ఢిల్లీలో ఏటా జరిగే జననాలను పరిశీలిస్తే, 1000 : 846గా ఉన్నట్లు తెలుస్తోంది. సంపద, విద్య అనేవి పరిణితి చెందిన సమాజానికి ప్రతీకలుగా భావిస్తాం. అయితే ఇవేవీ కూడా లింగ వివక్షను అడ్డుకోకపోగా, దాన్ని మరింత పెంచడానికి కారణమవుతోంది. దేశంలోని వాయువ్య ప్రాంతంలో అత్యధిక తలసరి ఆదాయం నమోదవుతున్నా లింగ నిష్పత్తి దారుణంగా పడిపోవడం ఓ విషాదం. అయితే అభివృద్ధి చెందిన గిరిజన సమాజాల్లో పరిస్థితి కూడా, ఆధునిక సమాజాలకు ఏ మాత్రం భిన్నంగా లేదు. పదేళ్ల క్రితం గిరిజన సమాజాల్లో లింగ నిష్పత్తి అధికంగా నమోదయింది. కానీ వారుకూడా పట్టణ నాగరికత ప్రభావానికి లోనుకావడంతో, అక్కడ కూడా లింగ నిష్పత్తి దారుణంగా పడిపోతున్నది ఈ లింగ వివక్ష అనే రుగ్మతను రూపుమాపాలంటే ప్రజలను చైతన్యం చేసే విధంగా కార్యక్రమాలను రూపొందించి విస్తృతంగా ప్రచారం చేయాలి.
క్షీణించిన శిశు లింగ నిష్పత్తి
భారత్‌లో 0-6 మధ్య వయసు గల పిల్లల లింగ నిష్పత్తి క్షీణిస్తుండగా, హిమాచల్‌ప్రదేశ్‌లోని లాహుల్ జిల్లా మాత్రం అందుకు మినహాయింపుగా కనిపిస్తోంది. ఆ జిల్లాలో దేశంలోనే అత్యధికంగా ప్రతి వెయ్యి మంది బాలురకు 1,013 మంది బాలికలు ఉన్నారు అరుణాచల్‌ప్రదేశ్‌లోనే మరొక జిల్లా అయిన తవాంగ్ 1,005 బాలికలతో దేశంలోనే ద్వితీయ స్థానంలో నిలిచింది. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలోనే ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన ఈ రెండు జిల్లాలు కూడా బౌద్ధమతం అధికంగా ఉన్న ప్రాంతాలు కావడం విశేషం. ఇక హర్యానాలోని ఝజ్జర్, మమేంద్రఘర్ జిల్లాలు దేశంలోనే అత్యల్ప శిశు లింగ నిష్పత్తి గల జిల్లాలుగా నిలిచాయి. అక్కడ 0-6 వయస్సు గల పిల్లల స్త్రీ, పురుష నిష్పత్తి వరుసగా 774, 778 గా నమోదైంది. 2001 నుంచే దేశంలో స్త్రీ, పురుష నిష్పత్తి గణనీయంగా క్షీణించడం మొదలైంది. పరిస్థితి తీవ్రతను గమనించి 2003లో గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ పరీక్షల నియంత్రణ చట్టాన్ని తెచ్చినప్పటికీ దేశంలో 0-6 ఏళ్ల మధ్య వయస్సు గల పిల్లల లింగ నిష్పత్తి 2011 జనాభా లెక్కల ప్రకారం 927 నుంచి 914 పడిపోవడం ఆందోళనకరం.
Other News