జర్నలిస్టు సంక్షేమనిధికి రూ.30 కోట్లు : సీఎం కేసీఆర్

Fri,February 17, 2017 04:41 PM

హైదరాబాద్ : తన జన్మదినం సందర్భంగా తెలంగాణ జర్నలిస్టులకు సీఎం కేసీఆర్ వరాలు ప్రకటించారు. సీఎం అధికారిక నివాసం ప్రగతి భవన్‌లో ఇవాళ జరిగిన జనహిత మొట్టమొదటి కార్యక్రమంలో మరణించిన జర్నలిస్టు కుటుంబాలతో సీఎం సమావేశమయ్యారు. వారి బాధలు, దుఃఖాన్ని పంచుకున్నారు. వారి సమస్యలను ఎంతో ఓపికతో విన్నారు. అన్ని సమస్యలను పరిష్కరిస్తానని అదే వేదికపై ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన చనిపోయిన జర్నలిస్టు కుటుంబాలకు రూ. లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందించారు. ఏ ఆధారం లేని జర్నలిస్టు కుటుంబాలను ఆదుకుంటామని చెప్పారు. జర్నలిస్టుల పరిస్థితి పైన పటారం లోన లొటారంలా ఉందని, తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతుందని హామీ ఇచ్చారు.

ప్రతి ఏటా బడ్జెట్ నుంచి జర్నలిస్టు సంక్షేమ నిధికి ఇచ్చే నిధులను ఈ సారి మూడు రెట్లు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే రూ. పదికోట్ల చొప్పున రెండేళ్లు సంక్షేనిధికి జమ చేశారు. ఈసారి బడ్జెట్‌లో రూ. 30 కోట్లు కేటాయించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాల్లో ఎవరైనా పెళ్లీడుకు వచ్చిన ఆడబిడ్డలుంటే వారి పెళ్లి కోసం రూ. 3లక్షల ఆర్థిక సహాయం సీఎం ప్రకటించారు. అలాగే చనిపోయిన జర్నలిస్టు కటుంబాల్లో ఇండ్లు లేని వారికి వారి సొంత జిల్లాల్లో వెంటనే డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు మంజూరు చేయమని ఆధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియను ప్రెస్‌అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణను చూసుకోవాల్సిందిగా కోరారు. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 20 వేల మంది జర్నలిస్టులకు ఎక్కడికక్కడే ఇళ్లస్థలాలను కూడా ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు. జర్నలిస్టులకు ఏవైనా ఆర్థిక భారమైన ఆరోగ్య సమస్యలుంటే ప్రెస్ అకాడమీని సంప్రదించి వారిద్వారా తన దృష్టికి తేవాలని సూచించారు. దేశం కోసం పారాడుతున్న సైనికుల బాగోగులు చూస్తన్నట్లే సమాజం కోసం, సమాజ చైతన్యం కోసం కృషి చేస్తున్న జర్నలిస్టులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం భరోసా ఇచ్చారు. ప్రగతి భవన్ లో జరిగిన జనహిత కార్యక్రమానికి ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ, హోం, కార్మిక శాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి, ఎంపీ మల్లారెడ్డి, సమచార కమిషనరు నవీన్ మిట్టల్, నమస్తె తెలంగాణ ఎడిటర్ కట్టా శేఖర్ రెడ్డి, తెలంగాణ టుడే ఎడిటర్ శ్రీనివాస్ రెడ్డి, టంకశాల అశోక్ తో పాటు జర్నలిస్టులు, మీడియా మిత్రులు హాజరయ్యారు.

1742

More News

మరిన్ని వార్తలు...