Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
Sponsor Namasthe Telangana Telugu Daily From Online
Namasthe telangana Videos
Tuesday, May 21, 2013
 


Home>>  Sunday>>  Articles
8/4/2012 11:24:37 PM
ఉశిల్లు

ushellu
రోడ్ల ఒక మనిషి పడిపోతే వొంద మంది ఉర్కత్తరు. గిట్ల కోట్లాది ఉశిల్లు వాటి శవాలగుట్టలు. ఆగి సూశి ‘అరె ఏంటియి’ అనె తీరికలేని గజిబిజి బతుకులు. రోణిక్తాల రోల్లు పలిగె ఎండలు. చెట్టు, పుట్ట, పిట్ట మలమల మాడిపాయెంత ఎండలు. నీల్ల సుక్క కరువై జీవరాసులు విలవిల లాడె. శెరువులు, కుంటలు, కయ్యలు, ఒర్రెలు అడుగంటి పాయె. ఎన్నడు ఇర్రువనని తాటి కమ్మలు ఎండిపోయి పల్లపల్ల రాలవట్టె. డాబ మీద చచ్చిపడిన కాకిని జూశి పాణం కలుక్కుమనె. గిన్నెలల్ల పెట్టిన నీల్లు పిట్టలకోసం మాపటీలికె ఆవిరి కావట్టె. గ్యాలన్ల కొద్ది నీల్లు ఆవిరి ఐతాంటె గిన్నెడు నీల్ల నెవడు కానిండు. జర్ర సల్లవడ్డది. శివాంట శినుకు వడ్డది. అబ్బ! కమ్మటి మట్టివాసన న్యాలమీద ఇరవారింది. గుండెల్ల నిండవట్టె. గోడలమీద, న్యాలమీద వడ్డ వాన సుక్కల్ను న్యాలతల్లి ఆబగ మింగవట్టె. కొండ మీదికి సూడల్నంటె బుగులు పుట్టించె ఎండలు. గిపుడు ఆకాసంల అన్ని నీల్ల మబ్బులు, నల్ల మబ్బులు. పల్కల సంచులేస్కొని బడికురికె పొల్లగాండ్లోలె బిరబిరా ఒకటే ఉర్కబట్టె. అరె ఇటు అటు ఉర్కుడే కానీ నిల్కడగ సుక్క ఇడ్వవాయె. గిట్ల నాల్రోజులు మురిపిచ్చి వానతల్లి న్యాల తల్లిని పురిట్ల తల్లోలె కావలిచ్చుకుని కాంక్షతోటి కడుపునింపె. జీవరాసుల ఉగ్గబట్టిన పాణాలు దిగ్గున లేచె. ఇన్ని దినాలు బిర్రుగా ఎర్రిమొగం ఏస్కున్న మర్రిశెట్టు సంబురంగ జెడలూపె.

ఇన్నాల్లు దుమ్ముకొట్టుక పోయిన ప్రకృతి తల్లి సల్లటి నీల్లతోటి తానవాడె. రంగెల్సిన పచ్చటి శీరెల కలకలలాడవట్టె. పగటిపూటె ఎల్గులు మింగిన మబ్బులు, ముశిముశి శీకట్లు ముస్రవట్టె. బజారు లైట్లు, వాకిట్ల లైట్లు శీకట్లను శిన్న బుచ్చె. ఎల్గుల జిల్గులు ఇరవారె. తీరొక్కలైటు పురుగులు, ఐలోని జాతర్ల శివసత్తులోలె కిందకి మీదికి ఎగురవట్టె. రెక్కలిర్గి రాలవట్టె. బల్లులకు ఇగ బోనాల పండగే. అటీటు సూసుడు లటుక్కున బట్టి గుట్టుక్కున మింగుడు. గోడమీదికి ఉర్కుడు. పట్టు తప్పి జర్రున జారి తప్పున కిందబడుడు. తోకలు తెగంగనే సర్రున ఉర్కి జాక్కునుడు. బలె పసందు వానకాలంల. రాత్రి బల్లులకు, పగటీలి తొండలకు పురుగుల పలారం. తెల్లారి తలుపు తియ్యంగనె వాకిట్ల అంగుళం మందంతోటి పురుగుల రెక్కలు, అడుగేత్తే మెత్తటి మఖుమలు లెక్క, ‘అరె ఏందిరా?’ అనుకుంటె ఉశిల్ల బంగాపూరంగు రెక్కల కుప్పలు. వాటి కింద రెక్కలు తెగిన ఉశిల్ల కుప్పలు. పాణం జల్లుమన్నది. ఇన్ని ఉశిల్లా ఎన్నాల్లకు జూశిన. అడవుల పొన్న పుట్టలల్ల ఉండె ఉశిల్లు అడవులు పోయి ఊల్ల మీదవడె. శీపురుతో ఊడిత్తే పైకి లేశిన రెక్కల మంద ఎగరలేక జిబజిబలాడె. ఉశిల్లు ఊడ్చి మోర్ల పోస్న.

ఉశిల్ల కన్న ముందు నా పాణం ఉసురుమన్నది, ఎన్కటికి వాటికున్న ఇల్వ యాదికొచ్చి. ఇప్పుడు రైలు ఫ్లాటుఫారాల నిండ ఉశిల్లు తెల్లటి పొట్టలేస్కొని రెక్కల్లేక మంది కాల్లకింద అప్పలోలె నల్గిపోతూ. వాటిలకూడ ఎగిటందుకు, బతికేటందుకు ఆరాటం. శానా ఉశిల్లు సచ్చిపోయి ప్లాటుఫారం నిండా., వాటి కడుపుల ఉండేటి నూనె మర్కలు సందులేకుంట. నాకనిపిచ్చింది, వేలాది ఉశిల్లు కాల్లకింద బడి నల్గిపోతుంటే వాట్ని ఓ పక్కకు ఊకే నాథుడే లేడు. రోడ్ల ఒక మనిషి పడిపోతే వొంద మంది ఉర్కత్తరు. గిట్ల కోట్లాది ఉశిల్లు వాటి శవాలగుట్టలు ఆగి సూశి ‘అరె ఏంటియి’ అనె తీరికలేని గజిబిజి బతుకులు. మనిషైనా, పురుగైనా పాణం ఆవగింజంతే, బత్కాలనే ఆశ ఒకటె. అడవులల్ల పుట్టి అడవి బిడ్డలకు ఆహారం అయే పుష్ఠినిచ్చె ఉశిల్లు మడుసుల కాల్ల కింద, డ్రైనేజీ నీల్లల్ల కల్సిపోవట్టె.

మనిషికి బాగా బతకాలని ఆశ. జీవరాశుల జాగాలను కాజేశి కాంక్రీటు జంగల్లు, సమాధుల మీద పునాదులు తీశేటి విష సంస్కృతి. మనిశి నాగరికత ముసుగుల ఏశే అనాగరిక ఏశం. ఉశిల్లే కాదు ఏ జీవరాశికీ బతికే జాగలేదు. భారతజాతి సంస్కృతికి పుట్టిండ్లు అడవులు ఇప్పుడేడ? అంతా దిగమింగి ఆకాశం ఎక్కుతనని జూత్తున్న మామూలు జనం, ఎవలో కాదు మనమే.మా శిన్న తనాన వాన బడ్డదంటె జాలు, వూరు వూరంత ఉశిల్ల పండగే. ఊరు ఊరంతా గుప్పువనె ప్యాలాల కమ్మటి వాసన.

అరుక్కింద సావిట్ల రాల్ల పొయ్యి పుల్లల పొగ. దానిమీద నల్లటి మంగళం పెంక (మేం ఆడుకునేటప్పుడు దయ్యం ఏశం కోసం ముఖానికి ఆమశే పూస్కునేది. అది వేరు సంగతి). శాట్ల జొన్నలు పీట మీద అమ్మ. ఎడ్మశేతిల శీపురు కొసలు, కుడి శేత్తోటి జొన్నలు పోస్కుంట ప్యాలాలు ఏంచుడు. టపటపా, శిటపటా కింద బడ్డ ప్యాలాలు మేం ఏరుడు. అడ్డగుల్ల నిండ ఏంచిన ప్యాలాలు. వాటి సోడు ఏయించి ఉశిల్లు కలిపేది అమ్మ. అందరు తినేది, మేమూ తినేది. కమ్మటి రుచి. ఉత్త ప్యాలాలు తినేటోల్లను జూశి ‘ఓ లక్కిడవ్వా! ఉశిల్లులేవా?’ అని ఏడ్పించేటోల్లు. అంత ఖరీదైన ఆహారం అది. మంచి పుష్ఠినిచ్చే బలవర్దకమైన ఆహారం, ప్రోటీను పలారం అది ఆ రోజులల్ల. ఇపుడవి సిటీల న్యాల పాలు. అడవి బిడ్డలకవి కరువు. అవి తినుడు నాగరికుల బరువు- పరువు. ‘ఉశిల్లా, డ్యామిట్! తింటారా? యా...క్’ అంటారు. మన్లో మన మాట, ఇపుడు నాకూ గట్లనే అనిపిత్తాంది తల్సుకుంటె... కని శిన్నప్పుడు ఎగవడి కొట్లాడి తినేటోల్లం. వాటి మజాయే వేరు. ‘ఉశిల్లూ మీకు జోహార్లు.’- రమాదేవి బొజ్జ,
95022 64117

Other News
Most Viewed galleries


Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd
News Photo Galleries Features
Latest News
Telangana News
Seemandhra News
National News
International News
Festivals gallery
Actress gallery
Cinema gallery
Fashion gallery
Political gallery
Sports gallery
Zindagi
Turning Point
Mee Features
Life Style
Sunday magazine