Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
Sponsor Namasthe Telangana Telugu Daily From Online
Namasthe telangana Videos
Thursday, June 20, 2013
 


Home>>  Sunday>>  Articles
7/21/2012 11:59:56 PM
ఆచార్య ఎస్. లక్ష్మణమూర్తితో నా స్నేహబంధం

murthiచిన్నతనంలో నాకు ఆవేశం, తొందరపాటు, కోపం, మొండితనం ఎక్కువగా ఉండేవి. వారి స్నేహం కారణంగా, వారి ప్రవర్తన ప్రభావంతో వీటి విషయంలో కొంత అదుపు సాధించాను. ఆదర్శమైన జీవితం ఎలా ఉండాలో వారి మైత్రి నాకు నేర్పింది.

నాకు జీవితంలో లభించిన అదృష్టాల్లో మంచి మిత్రులను పొందడం ఒకటి. అలాంటి మిత్రుల్లో మొదటగా చెప్పుకోదగ్గవారు ఆచార్య ఎస్. లక్ష్మణమూర్తిగారు. వీరు కాకతీయ విశ్వవిద్యాలయంలో ఆంగ్లశాఖలో ఆచార్యులుగా, శాఖాధిపతిగా, ఆర్ట్స్ విభాగం డీన్‌గా పదవీ బాధ్యతలు నిర్వహించి ప్రస్తుతం విశ్రాంత జీవితం గడుపుతున్నారు. సంస్కృతంలో, తెలుగులో, ఆంగ్లంలో (అ)సమాన ప్రతిభా వైదుష్యాలు కలిగిన విద్వాంసులు. సంస్కృతాంవూధాల్లో మంచి కవులు. అన్నింటినీ మించి సౌజన్యవంతులు. సాత్విక స్వభావులు.
లక్ష్మణమూర్తి గారితో నాకు సుమారు యాభై యైదేండ్ల స్నేహం. 1958లో నేను సికిందరాబాద్ రాణిగంజ్ దగ్గర లాలాగుడి ఆవరణలో ఉన్న మున్నాలాల్ సంస్కృత కళాశాలలో ఎంట్రెన్స్ చదివేటప్పుడు లక్ష్మణమూర్తి గారితో పరిచయం ఏర్పడింది. అప్పుడే మరో మిత్రుడు డా॥ బి.రామారావు గారితో కూడా పరిచయం కలిగింది. వీరిద్దరితో ఏర్పడ్డ పరిచయం స్నేహంగా మారి క్రమక్షికమంగా వృద్ధి చెందింది. లక్ష్మణరావుగారితో మొదట పరిచయం ఏర్పడ్డప్పుడు వారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బి.ఎ. చదువుతుండేవారు. ఇక్కడే సంస్కృతంలో డి.ఒ.ఎల్. పరీక్ష పాసైనారు.

లక్ష్మణమూర్తిగారి నాయనగారు శ్రీమాన్ రాఘవాచార్యులు గారు మంచి సంస్కృతాంధ్ర పండితులు. ఇంటి వాతావరణంతో మూర్తి గారికి చిన్నతనంలోనే సంస్కృతాంవూధాల్లో మంచి ప్రవేశం కలిగింది. అప్పటికీ వారికి ఎన్నో శ్లోకాలు, పద్యాలు కంఠస్థంగా వచ్చేవి. మున్నాలాల్ కళాశాలలో ఉన్నప్పుడు రోజూ మేము సాయంకాలం కింగ్స్‌వేలో ఉన్న మునిసిపల్ లైబ్రరీకి వెళ్ళేవాళ్ళం. లైబ్రరీకి వెళ్ళేప్పుడు మూర్తిగారు జాషువా పద్యాలు చదివి వినిపిస్తుండేవారు. ఆ విధంగా రోజూ వింటుండడంతో నాకు ఎన్నో పద్యాలు కంఠస్తమైనాయి. లక్ష్మణమూర్తిగారు ఏకసంథాక్షిగాహి. పద్యాలే కాదు పత్రికల్లోని వార్తా భాగాలను ఒకసారి చదివితే చాలు, వాటిని యధాతథంగా మళ్ళీ చెప్పేవారు. ఒకసారి అప్పటి కేంద్రమంత్రి వి.కె. కృష్ణమీనన్‌గారు హైదరాబాద్‌లో చేసిన ఆంగ్ల ప్రసంగం పత్రికలో ప్రచురితమైంది. ఆ ప్రసంగాన్ని అదే విధంగా మళ్ళీ చెప్పి మమ్మల్ని ఆశ్చర్యపరచినారు. ఈ విధంగా వారి సాన్నిహిత్యంతో నాకు సాహిత్యంపైన మంచి ఆసక్తి కలిగింది. సంప్రదాయ పద్ధతిలో, గురుకుల పద్ధతిలో సంస్కృతం చదువుకుంటున్న నాకు తెలుగు భాషపైనా, ఆంగ్ల భాషపైనా అభిరుచి కలిగించినారు.
లక్ష్మణమూర్తిగారి నాయనగారు మంచి పండితులేకాదు. పూర్వాచార పరాయణులు కూడా. ఐనా వారి సామాజిక దృష్టి విశిష్టమైంది. సమాజంలోని అన్ని వర్గాల వారినీ చేరదీసి అభిమానించే వారు. ఏ వర్గంలోని వారైనా గుణం ఉంటే ప్రశంసించేవారు. తాము పూర్వాచార పరాయణులైనా ఆధునిక కవుల్లో జాషువా కవిని బాగా అభిమానించేవారు. జాషువా పద్యాలు ఎన్నో వారికి కంఠస్థం. లక్ష్మణమూర్తిగారికి కూడా ఈ లక్షణం చిన్ననాటే అబ్బింది. ఏ సామాజిక వర్గానికి చెందినవారైనా వారిలో గుణం ఉంటే మెచ్చుకోవడం, వారిని చేరదీసి సహాయం చేయడం లక్ష్మణమూర్తి గారిలోని విశేషం.

స్నేహితునికి సంస్కృతంలో ‘సుహృత్’ అనే ఒక పర్యాయ పదం ఉంది. ‘దీనికి మంచి హృదయం కలవాడని’ అర్థం. స్నేహితుని లక్షణాల్లో మంచి హృదయం-దయార్ద్ర నిర్మలమైన హృదయం కలిగి ఉండడం ప్రధానమైన లక్షణం. 1961లో అనుకుంటా సంప్రదాయ పద్ధతిలో సంస్కృత విద్యనభ్యసిస్తున్న నాలో ఆంగ్ల విద్యాభ్యాసంపై ఆసక్తి కలిగించి నన్ను ‘ఆంధ్రా మెట్రిక్యులేషన్’ పరీక్ష రాయడానికి ప్రోత్సహించారు. ఆ సందర్భంలో లక్ష్మణమూర్తిగారు మైత్రీ భావంతో చేసిన సహాయం మరువరానిది. మెట్రిక్యులేషన్ ఆంగ్ల పాఠ్యక్షిగంథాన్ని వారు నాకు బోధించినారు. అప్పుడు నేను అల్వాల్‌లో వేదాంతవర్ధినీ సంస్కృత కళాశాలలో బి.ఓ.ఎల్. చదువుతుండేవాణ్ణి. రోజూ ఆర్ట్స్ కళాశాల హాస్టల్‌కు వెళ్లి వారి వద్ద ఆంగ్లం నేర్చుకునేవాణ్ణి. వారు నాకు ఆంగ్లం బోధించకుంటే మెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణుడనయ్యేవాణ్ణి కాదు. ఆంగ్లంలో 55 శాతం మార్కులు సాధించినానంటే వారి సహాయమే కారణం. ఇంగ్లీషు వ్యాకరణాన్ని సంస్కృత వ్యాకరణ మర్యాదలతో పోలుస్తూ చెప్పడం వల్ల నాకు సులభంగా అర్థమయ్యేది.

లక్ష్మణమూర్తిగారు ఎంతో సౌజన్యమూర్తులు. ఒక్క ఉదాహరణ చెపుతాను. నేను మెట్రిక్యులేషన్ పరీక్ష రాయడానికి గుంటూరుకు వెళ్ళే రోజున వారు సికిందరాబాద్ స్టేషన్‌కు వచ్చి నాకు కొన్ని పండ్లు, కొంత డబ్బు కూడా ఇచ్చి నన్ను సాగనంపడం వారి అర్వ్యాజ మైత్రీ భావాన్ని తెలియజేస్తుంది. వారు ఆనాడు చూపిన ఆప్యాయతల్ని నేను ఎన్నడూ మరువలేను. ‘‘తత్తస్య కిమపి ద్రవ్యం యోహి యస్య ప్రియో జనః’’ అని భవభూతి చెప్పినట్లుగా తన కిష్టుడైన మిత్రుడు ఒక అనిర్వచీయమైన ద్రవ్యంతో సమానుడే.
సంస్కృత కళాశాలలో చదువుకున్నందువల్ల నాకు ఆంగ్ల విద్యాలయాల్లో ఉండే విద్యార్థులతో కానీ, ఆచార్యులతో కానీ పరిచయముండే అవకాశం లేదు. విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న లక్ష్మణమూర్తిగారి దగ్గరకు తరచుగా పోతూ ఉండటం వల్ల ఎమ్.ఎ. విద్యార్థులతోనూ, విశ్వవిద్యాలయ అధ్యాపకులతోనూ పరిచయం ఏర్పడింది. ఆచార్య బి.రామరాజుగారు, ఆచార్య దివాకర్ల వెంకటావధానిగారు, శ్రీ చెలమచర్ల రంగాచార్యులు గారు మొదలైన ఆచార్యులతోనూ, డా॥ వే.నరసింహాడ్డి, డా॥ వరవరరావు, డా॥ ముదిగొండ వీరభవూదయ్య మొదలైన ఎమ్.ఎ. విద్యార్థులతోనూ మూర్తిగారి వల్లే పరిచయం ఏర్పడింది. ఈ పరిచయాలు తరువాతి కాలంలో నా సాహితీ కృషికి ఎంతో దోహదం చేసినాయి.

లక్ష్మణమూర్తిగారు హైదరాబాద్‌లో కొంతకాలం న్యూసైన్స్ కాలేజీలో సంస్కృత శాఖలో ఉపన్యాసకులుగా పనిచేసి ఆ తరువాత వరంగల్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయ కళాశాలకు పస్తుతం కాకతీయ విశ్వవిద్యాలయం) ఆంగ్లోపన్యాసకులుగా వెళ్లారు. అందువల్ల వారిని చూడడానికి అప్పుడప్పుడు వరంగల్ వెళుతుండేవాణ్ణి. అప్పుడు అక్కడి ఆచార్యులకు నన్ను పరిచయం చేస్తూ నాకున్న కొద్ది పాండిత్యాన్ని కొండంతగా చెప్పి ప్రశంసిస్తుండేవారు. అది వారి మిత్రవూపేమ. నాకు పరిచితులైన చాలామంది పెద్దలు లక్ష్మణమూర్తిగారి మైత్రి కారణంగా పరిచితులైనవారే.
ఎదుటి వానిలో పరమాణువంత మంచి గుణమున్నా దాన్ని పర్వతమంత గొప్పగా చేసి చెప్పడం లక్ష్మణమూర్తి గారిలోని సౌజన్యం. విద్యా విషయంగానే కాక వ్యక్తిగతంగా కూడా లక్ష్మణమూర్తిగారి మైత్రి నాకు ఎంతో లాభపడింది. చిన్నతనంలో నాకు ఆవేశం, తొందరపాటు, కోపం, మొండితనం ఎక్కువగా ఉండేవి. వారి స్నేహం కారణంగా, వారి ప్రవర్తన ప్రభావంతో వీటి విషయంలో కొంత అదుపు సాధించాను. ఆదర్శమైన జీవితం ఎలా ఉండాలో వారి మైత్రి నాకు నేర్పింది.

జీవితంలో నాకు ఏ మంచి జరిగినా మూర్తిగారు ఎంతో ఆనందిస్తారు. నాకు ఏ ఇబ్బంది వచ్చినా మంచి సలహాలనిస్తూ సహాయం చేస్తారు. ఒక విధంగా నన్ను సోదరుని కన్నా ఎక్కువ అభిమానిస్తారని చెప్పడం అతిశయోక్తికాదు.
లోకంలో ఇద్దరు వ్యక్తులను ఒక దగ్గరకు చేర్చి చిరకాలం బంధించగలిగేది ఒక్క స్నేహ బంధమే కాని మరేదీ కాదు. అందుకే అధర్వవేదం ‘‘సర్వా ఆశా మమ మిత్రం భవతు’ (అన్ని దిక్కుల్లో నాకు మిత్రులు ఉందురుగాక!) అని చెపుతుంది. అన్ని లాభాల కన్నా మిత్రలాభం గొప్పదని శాస్త్రాలు చెబుతున్నాయి.
రామాయణంలో ‘‘సర్వధా సుకరం మిత్రం దుష్కరం పరిపాలనం’’ అనే శ్లోకం ఉంది. ఒకరితో మైత్రిని సంపాదించుకోవడం సులభమే. కానీ, దాన్ని చిరకాలం రక్షించుకోవడం చాలా కష్టమని దీని భావం. లోకంలో ఎంతోమంది మిత్రులను చూస్తాం. కొంతకాలం వరకు వాళ్లు కలిసి ఉంటారు. తరువాత ఏదో కారణంతో విడిపోతారు. అది ఆదర్శమైన స్నేహం కాదు. లక్ష్మణమూర్తిగారితో నాకు సుమారు యాభై యైదేండ్ల కింద ఏర్పడ్డ స్నేహం ఈనాటికీ కొనసాగుతుండటానికి కారణం ఒక్కటే, మాకేర్పడిన స్నేహం విద్యామూలకంగా ఏర్పడింది కావడమే. మేమెప్పుడు కలిసినా ఏదో ఒక సాహిత్య విషయాన్నో, శాస్త్ర విషయాన్నో చర్చించుకొని పరస్పరం జ్ఞాన వినిమయం చేసుకొని, ఆనందించడమే ప్రధానంగా జరుగుతుంది. అందువల్ల మా స్నేహం ఇంతకాలమైనా స్థిరంగా ఉంది. ఈ స్నేహం ఇలాగే వృద్ధి చెందాలని కోరుకుంటున్నాను.

Other News
Most Viewed galleries


Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd
News Photo Galleries Features
Latest News
Telangana News
Seemandhra News
National News
International News
Festivals gallery
Actress gallery
Cinema gallery
Fashion gallery
Political gallery
Sports gallery
Zindagi
Turning Point
Mee Features
Life Style
Sunday magazine