Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
Sponsor Namasthe Telangana Telugu Daily From Online
Namasthe telangana Videos
Thursday, June 20, 2013
 


Home>>  Sunday>>  Articles
6/24/2012 12:11:27 AM
రాఘవ మళ్లీ కన్పించలేదు!

dkm-b talangana patrika telangana culture telangana politics telangana cinema
‘సోపతి’ గురించి ఆలోచిస్తుంటే కండ్ల ముందున్నోళ్లు కొందరు మెదులుతున్నరు. కాలం చేసిన వాళ్లు ఇంకొందరు యాది కొస్తున్నరు. కానీ, రాఘవ గురించి చెప్పాల్నా వద్దా అన్న సంగతి తేల్చుకోలేక పోతున్నాను. ఎక్కువ ఆలోచించి ‘ఏం ఫాయిద’ అనుకుంటూ మొదలు వెడుతున్న...

{ దేవులపల్లి కృష్ణమూర్తి



‘ఏందిరా రాఘవా ఇట్లయితి’వం మీలాగా డబ్బు సంపాదించ లేదనేనా నువ్వంటున్నది. మనం మన కోసం బతికే బతుకు ఒక బతుకేనా? అందుకే నేను నమ్మిన సిద్ధాంతాల కోసం నా మార్గం ఎంచుకున్న. అది నాకు తృప్తినిచ్చింది... అందుకే, నా బాటలో నేను పోతున్న’అని అనుకొచ్చిండు.

ఎప్పటి సంగతి, సరిగ్గా నలభై ఏండ్లవుతుంది గదా. నేను రిటైర్ అయ్యే పదేండ్లు దాటింది. పని లేకుండా వున్నా. ఎప్పటెప్పటోల్లో జ్ఞాపక మొస్తుండ్రు. నేను అప్పట్లో పేటలోనే నౌకరి చేస్తుంటి.
రాఘవ 196 ప్రాంతంలో మా వూరికి టీచరుగా బదిలి అయి వచ్చిండు. ఒంటరివాడు. మా ఇంట్లోనే వుంటుండేది. మా అమ్మ చేతనయి చేతగాక ఇంటి పనులు చేసుకుంటూ వుండేది. దానికి తోడు ఓ బర్రె. దాన్ని కట్టెయ్యబోతె మా నాన్నను వెనుక కాళ్ళతో తన్నింది. దాంతో నడుము బొక్క విరిగి మంచంలో వుండి పోయిండు. బర్రెకు, మా నాన్నకు చాకిరి చేయడంతోనే సరిపోయేది మా అమ్మకు. రాఘవ ఇంట్లో వుండటం మూలంగా చదువుకోవడానికి వచ్చే పిల్లలు వూకి చల్లడంలో సహాయ పడుతుండేది.
బడి వదిలి పెట్టడంతోనే ఐదారుగురు పిల్లలు రాఘవ వెంట వచ్చి చదువుకుని హోం వర్కు చేసుకుంటూ వుండేది.

గూడెంలోని చాలామంది యువకులు నెలసరి జీతాలకు వ్యవసాయ పనులకు పోతుండేది. చిన్న పిల్లలేమో బర్ల కాయటానికి పోతుండేది. ఎంత మొత్తుకున్నా బడికి వచ్చేవాళ్లు కాదు వారు. వీల్లకు ఎట్లన్నజేసి విద్యాబుద్ధులు చెప్పాలని రాఘవ రాత్రి కాగానే గూడెంకు పోయి జీతాలకు, కూల్లకుపోయి వచ్చేవాల్లకు చదువు చెప్తుండేవాడు. ఏడాది అయ్యేవరకు చిన్న పిల్లలు జీతాలు మాని ఉదయం పూట బడికి రాబట్టిండ్రు.

నేను మా అమ్మానాన్నల మంచి చెడు చూడడానికి నెలలో ఒకటి, రెండు సార్లు మా వూరికి వచ్చి పోతుంటి. వచ్చినప్పుడు అతనితోటే కాలక్షేపం. గదినిండా పుస్తకాలుండేవి. ‘ఆ పుస్తకాలేందిరా’ అని చూస్తే-కమ్యూనిస్టు మానిఫెస్టో, ఏంగెల్స్ కుటుంబం, పెట్టుబడి, సోషలిజం అంటే ఏమిటి, ఇంకా మాస్కో ప్రచురణలు అట్లే మావో, లెనిన్ రచనలు. తెలుగులో గురజాడ, శ్రీశ్రీ, కుటుంబరావు, రావిశాస్త్రి రచనలు, ఇంకా కవితా సంకలనాలు, ఆర్థిక, సామాజిక శాస్త్రాలకు సంబంధించిన పుస్తకాలు తెలుగు, ఇంగ్లీష్‌లో వుండేవి. వాటిని నేను తిరగేసి చూస్తుండేది. కాని, చదవాలని లేకుండె. అయినాగని రాఘవ ఆ పుస్తకాలను చూపిస్తూ ‘ఇది చదవండి, అది చదవండి’ అంటూ ముందు పడేసేవాడు. నేను తప్పనట్లుందని పైపైన తిరగేసి అక్కడే పెడ్తుండేవాణ్ని. ఒక్కోసారి ‘ఇవి కొత్తగా వచ్చిన కవితా సంకలనాలు’ అంటూ దిగంబర కవుల కవితా సంపుటాలను రెండింటిని చూపించాడు. ‘ఎంత బాగా చెప్పిండ్రో చూడండి’ అంటూ తను చదివి వినిపిస్తుండేది. ఆయన స్నేహ పూర్వకమైన చిరునవ్వు గట్టి కరస్పర్శ ఎప్పుడూ మర్చిపోలేను.

కానీ, నేనుండేది ఒక్కరోజు గదా. ఇంటి పనులు చక్కబెట్టుకుని మళ్ళీ వెళ్లి పోతుండేది. చదవడం నా నుండి కాలేదు. మాటల సందర్భంగా తనది తిర్మలగిరి అని, ముగ్గురన్నదమ్ములమని, పెద్దన్న తెలంగాణ సాయుధ పోరాట కాలంలో నర్సింహులుతో పాటు పనిచేసిండని, పోరాట విరమణ తర్వాత గ్రామ సర్పంచ్‌గా పనిచేస్తుండని, రెండో అన్న ఏదో డిపార్టుమెంటులో పనిచేస్తుండని చెప్పిండు.

తన తల్లి దొరల గడిలో ఆడబాప అని, తనకు తండ్రెవరో తెలియదని నవ్వుతూ చెప్పేవాడు. ‘మా అమ్మ దొరసాని పెండ్లిలో అరణంగా తిర్మలగిరికి వచ్చిందట. మా అమ్మమ్మ కూడా దొరల గడిలో ఆడబాపేనట’ అంటూ, ‘ఈ దోపిడి వ్యవస్థలో, అప్పట్లో అది మామూలు విషయమే. అందుకు తనకు నామోషి లేదని, అన్ని అవమానాలూ భరిస్తూ ఆ తల్లి తమను చదివించింది. అందువల్లనే ఈ స్థితికి రాగలిగినం. అయిదారేండ్ల కిందనే ఆమె చనిపోయింది. తను ఆడబాప కొడుకునని చెప్పుకోవడానికి సిగ్గేమి లేదనే వాడు. ఈ బూర్జువా వ్యవస్థలో ఇట్లానే జర్గుతుంది, సోషలిస్టు సమాజంలోనే ఈ అసమానతలు పోతయి’ అని అంటూ వుండేవాడు. అప్పట్లో రెడ్లు, కరణాలు, యలమలు తమ కులం పేరు గర్వంగా చెప్పుకుంటూ పేరు చివర తమ కులం పేరొచ్చేట్లుగా చూసుకునేది. అణగారిన వర్గాలకు చెందిన కులాల వారు తమ కులం పేరు చెప్పుకోవడానికి సిగ్గు పడ్తుండేది. అట్లాటిది తనకు తండ్రెవరో తెలియదు. ఆడబాపకు పుట్టిన వాణ్ణని చెప్పుకోవడం గొప్పేనని అనిపించింది.

గూడెంలో రాత్రిపూట చదువుకున్న వాళ్ళు తెలివిన బడ్డరు. సమ్మెలు చేసి జీతాలు పెంపు చేసుకుండ్రు. కూలి రేట్లు కూడా పెరిగినయి. ఇంతకు ముందు కోలాటాలు, భజనలు చేసిన వాళ్లు పాటలు పాడటం మొదలుపెట్టిండ్రు. ఇది మా వూరి పటేండ్లకు గిట్టక రాఘవ ఈ బడికి వచ్చిన దగ్గరి నుంచే జనం తెలివి మీరింవూడని, లేని పోని షికాయతులు పై అధికారులకు చేసిండ్రు. తనకు బదిలి వేటు తప్పదని తెల్సిపోయింది. ఇప్పుడు రాఘవ ప్రమేయం లేకుండానే గూడెంలో రాత్రిబడి నడుస్తుంది. వాళ్ళలో వాళ్లే చదువుకోవటం, దినపవూతిక తెప్పించుకోవటం మొదలైంది.

ఈసారి నేను మా వూరికి పోవడం రెండు నెల్లు ఆలస్యం అయ్యింది. రాఘవ తాను ఎప్పుడో రాసిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష ఎలాటుమెంటు వచ్చి కోఆపరేటివ్ డిపార్ట్‌మెంటులో జాబు వచ్చిందని వెళ్లిపోయిండని తెల్సింది. ‘అరె! పోయెటప్పుడు కల్సుకోలేక పోతినే’ అని శానా బాధపడ్డ.

పది, పదిహేనేండ్లు దాటింది. మిర్యాలగూడ ప్రమోషన్‌పై బదిలి అయింది. మా కోవర్కర్ సత్యం గురించి మా స్టాఫంతా గుసగుసలాడుకుంటూ ఉండేవారు. వీడు దొరల ఇంట్లో ఆడబాపలకు పుట్టినోడని. తండ్రెవరో తెలియదని పుకార్లు వుండె. అతను కూడా ఎవ్వరితో స్నేహంగా వుండక పోయేది. నేను కల్పించుకొని అదో ఇదో మాట్లాడుతుండేవాణ్ని. ఒకటి, రెండుసార్లు మా ఇంటికి తీసుకపోయిన. మాట్లాడుతున్నప్పుడు తనది తిర్మలగిరి అని అన్నడు. దాంతో ‘అయితే, ఆ వూరివాడే మా మిత్రుడు రాఘవ అనే వాడుండే. మా వూరిలో కొంతకాలం పాటు టీచరుగా చేసి కోఆపరేటివ్ డిపార్టుమెంట్‌కు ఎలాటు అయ్యి హైద్రాబాదుకు వెళ్లిపోయిండు. మీకు తెలుసా’ అని అంటే...

‘వాడెవడనుకున్నవ్. మా తమ్ముడే బై. మాంచి తెలివి కల్లోడుండే. వాడి తెలివే వాణ్ణి ముంచింది. హైద్రాబాదుకు పోయిండా, ఇంతలోనే తెలంగాణ మూమెంటొచ్చె. దాంట్లో యాక్టివ్‌గా పాల్గొండు. పెండ్లి చేసుకోరా అని మేమెన్ని సంబంధాలు తెచ్చినా ఒప్పుకోలె. ఆ తెలంగాణ పోరాటం, దొరలు దొరలు నడుమంవూతాన ముంచిరి. ఎన్ని ప్రాణాలు పోయినయి. అయినా ఒరిగిందేమిలేదు. మా వాడి మీద లేని పోని కేసులు పెట్టిండ్రు. దానితో నౌకరీ పోయింది. ఇంతలో శ్రీకాకుళంలో పోరాటం పుట్టింది. దానిసెగ తెలంగాణకు తాకింది. మావాడు అండర్‌క్షిగౌండ్‌కు పోయిండు.’

‘అట్లనా’
‘పోలీసులు మా ఇండ్లల్లకు వచ్చి మీ తమ్ముణ్ణి సరెండర్ చేయించమని మమ్ముల ఇబ్బంది పెడ్తుండేది. ఆ బాధలు తట్టుకోలేక ఈ తాలుకా ట్రాన్స్‌ఫర్ చేయించుకుంటి. ఇప్పుడు ప్రాణానికి నిమ్మలంగుంది. పోయిన పోకడే కానీ, మళ్ల వాని జాడ దొరకలేదు.’
‘నాకిదంత తెలియదు బై. హైద్రాబాదులోనే వున్నడనుకుంటున్న.’
అంతటితో రాఘవ విషయం మరచిపోయిన. యమర్జన్సీ వచ్చింది. ఎవ్వరు కిక్కురు మనకుండిరి. సత్యం వేరే తాలూకాకు ట్రాన్స్‌ఫర్ అయిపోయిండు.

మండలాలు యేర్పడ్డయి. ప్రమోషన్ ఇచ్చి నన్ను మండలాధికారిగా బదిలీ చేసిండ్రు. తీరిక లేకుండా వుండిపోయినా. మా అమ్మానాన్నా గతించి పోయిండ్రు. నా పనులలో నేనుండిపోయిన.
చాలా దినాల తర్వాత కలక్టరాఫీసులో సత్యం కన్పించిండు. ‘ఎక్కడుంటున్నవ్ బై’ అంటే -‘నన్ను మహబూబ్‌నగర్‌కు ఎలాట్ చేసిండ్రు, అక్కడే పనిచేస్తున్న. సర్వీస్ బుక్‌లో ఎంట్రీలు మిస్ అయితే సరిచేయించుకుందామని వచ్చినని’ చెప్పిండు. ఆ పని అయిపోయిన తర్వాత సత్యాన్ని మా ఇంటికి తీసుకపోయిన. భోజనాలు అయిన తర్వాత డిపార్ట్‌మెంటు ముచ్చట్లు పెడ్తూ ‘రాఘవ సంగతేమన్న తెల్సిందా బై’ అని అడిగితే ‘ఏం చెప్పమంటవ్. నా జాబులో నేను తీరిక లేకుండా వుంటి. పిల్లగాల్లు పెద్దగైండ్రు. వాల్ల చదువు సంధ్యలు చూసుకోవంటతోనే సరిపోతుంది. వాణ్ణి గురించి ఎవరిని ఏమని అడగను. సర్పంచుగా చేస్తున్న మా అన్న కాలం చేసిండు. ఆయన పిల్లలు హైద్రాబాదులో సెటిలయ్యిండ్రు. వాణ్ణి గురించి ఎవరిని ఏమని అడుగను.

అడిగితే పోలీసోల్లనే అడగాలి. అడిగా ననుకో, నన్నే ఇరికించి లోపలేసేటట్లుంది. ఆఖరికి బస్తర్ ప్రాంతంలో మిలట్రి వాళ్ళు ఎటాక్ చేస్తే ఆ కాల్పుల్లో రాఘవకు తుపాకి దెబ్బ తగిలి గుత్తికోయల గూడెంలో వుండి పోయిండట. తర్వాత కూంబింగ్‌లో దొరికి పోయిండట. ఈ వార్త పౌరహక్కుల వాళ్ళకు తెలిసి కోర్టులో సరెండర్ చేయాలని ఆందోళన చేస్తే వాణ్ణి కోర్టులో హాజరు పర్చిండ్రు. లేకుంటే కాల్చి వేద్దురు. పాత కేసులన్నీ తోడి జైలు శిక్ష వేసిండ్రు. ఆరునెల్ల తర్వాత బెయిల్ దొరికింది. మా అన్న కొడుకులు హైద్రాబాదులోనే ఇండస్ట్రీ పెట్టుకొని వుండిరి. వాళ్ళే తిరిగి బెయిల్ మంజూరి చేయించిండ్రు. నాల్గు, అయిదు నెల్లు బెయిల్ మీదుండి పోలీస్ స్టేషన్‌కు పోయి హాజరు వేసి వస్తుండేది.’

‘అయితే... నువ్వు కల్వలేదన్నమాట.’
‘ఎందుకు కల్వలేదు, బెయిల్‌పై వచ్చిండని తెల్సి హైద్రాబాద్‌కు పోయి ‘ఏందిరా రాఘవా ఇట్లయితి’వం మీలాగా డబ్బు సంపాదించ లేదనేనా నువ్వంటున్నది. మనం మన కోసం బతికే బతుకు ఒక బతుకేనా? అందుకే, నేను నమ్మిన సిద్ధాంతాల కోసం నా మార్గం ఎంచుకున్న. అది నాకు తృప్తినిచ్చింది... అందుకే నా బాటలో నేను పోతున్న’అని అనుకొచ్చిండు. దానికి నా కాడ జవాబేమున్నది చెప్పు? తర్వాత అండర్‌క్షిగౌండుకు వెళ్లిపోయిండు. అదీ సంగతి’. అంటూ ముగించాడు సత్యం.

ఇది జరిగి పన్నెండేండ్లయ్యింది. రిటైర్ అయినంక పనేముంది. దినపవూతిక తిరగేయటం, టీవి చూడటమే పని. ఆ పేపరును రెండు, మూడుసార్లు తిరగేయటం, ఏదన్నా ఇంటస్టు వార్త వుంటే దాన్ని పూర్తిగా చదవటం, లేదంటే హెడ్డింగ్‌లు చూడడమే.
‘పోలీసులకు, నక్సలైట్లకు జరిగిన ఎన్‌కౌంటర్‌లో గుర్తు తెలియని నక్సలైట్ హతం’
‘చత్తీస్‌ఘడ్‌లో మిలట్రీ కూంబింగ్‌లో ఇరవై మంది మావోయిస్టులు ఖతం’
ఇవి చదువుతుంటే గుండెను పిసికినట్లవుతుంది. ఈ మృతుల్లో రాఘవ లేకుంటే బాగుండుననిపిస్తుంది.
ముక్తాయింపు:
‘‘కొందరితో పరిచయాలు జీవితాంతం వెంటాడుతుంటాయి. కలిసింది, గడిపింది తక్కువే కావచ్చు. కానీ, రాఘవకూ నాకూ మధ్య ఏర్పడిన అనుబంధాన్ని వట్టి పరిచయం అనలేను. అది కేవలం వ్యక్తిగతం అని కూడా అనుకోలేను. అది స్నేహితం కన్నా ఎక్కువే అనుకుంటున్నా.’’

వ్యాసకర్త మొబైల్: 92900 94015


Other News
Most Viewed galleries


Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd
News Photo Galleries Features
Latest News
Telangana News
Seemandhra News
National News
International News
Festivals gallery
Actress gallery
Cinema gallery
Fashion gallery
Political gallery
Sports gallery
Zindagi
Turning Point
Mee Features
Life Style
Sunday magazine