THURSDAY,    January 19, 2017
Call for Subscription
23291167 / 1168 / 1169
జిల్లా వార్తలు
vijetha Educational Magazine
jayashankar News
1/12/2017 1:32:53 AM
ఉపాధి కల్పనలో కొత్త ట్రెండ్ సృష్టించాలి
-ఉపాధి హామీ పథకంలో ప్రజలను భాగస్వాములు చేయాలి
-మార్చిలోగా కనీసం 60 శాతం పనులు పూర్తి చేయాలి
-రాజకీయ జోక్యం ఉండకూడదు
-కేంద్ర ప్రభుత్వ స్కీంను ఉపయోగించుకోవాలి
-పంచాయతీరాజ్ , గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

మంజూర్‌నగర్, జనవరి 11 : ఉపాధి హామీ పనుల్లో కొత్త ట్రెండ్ సృష్టించాలని గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులకు సూచించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కలెక్టరేట్‌లో ఉపాధి హామీ పథకం అమలుపై ఆయా శాఖల అధికారులతో బుధవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉపాధి హామీ పనులలో ప్రజలను భాగస్వాములను చేయాలన్నారు. ఉపాధి హామీ పనుల అమలు జిల్లాలో ఆశాజనకంగా లేదని అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. పని విషయంలో పక్క జిల్లాతో పోల్చుకొని చూడవద్దని, పనుల అమలులో మెరుగైన ఫలితాలను సాధించేందుకు అహర్నిశలు కృషి చేయాలని సూచించారు. పనుల అమలు, కల్పనలో కనీసం 50 శాతం కూడా సక్సెస్ కాలేదని, ఇది అధికారుల పనితీరును తెలియ జేస్తుందని మండిపడ్డారు. ఉపాధి హామీ పనులపై ఆధారపడకుండా ప్రజలు ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి జిల్లాలో ఆశించిన స్థాయిలో పరిశ్రమలు కానీ, వ్యవసాయానికి సాగునీటి సదుపాయం కానీ లేవన్నారు. జిల్లాలో మొత్తం 274 గ్రామాలుంటే కేవలం ఐదారు గ్రామాలు మాత్రమే సింగరేణిపై ఆధారపడి జీవిస్తున్నాయని, మిగితా గ్రామాల ప్రజల పరిస్థితి ఏమిటని అధికారులను ప్రశ్నించారు. అలాంటి గ్రామాలకు ఉపాధి కల్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.

జిల్లాలో ఉపాధి హామీ పనుల కోసం 1.80 లక్షల జాబ్ కార్డులు కలిగిన కుటుంబాలు ఉండగా ఇంకా 5 లక్షల మంది పనులకు వెళ్లాల్సి ఉందన్నారు. ఇందులో భాగంగానే ఉపాధి హామీ పథకం కింద జిల్లాలోని పేద ప్రజలందరికీ 100 రోజుల పని కల్పించాలని సూచించారు. జాబ్ కార్డులున్న వాళ్లకు మాత్రమే కాకుండా కొత్త వారికి కూడా అవకాశం ఇవ్వాలన్నారు. వచ్చే మార్చి 31 లోపు 100 రోజులు పని కల్పించి కనీసం 60 శాతం పనులు పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. పనులు పూర్తి చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠినమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో పనులను సంబంధిత అధికారులు పర్యవేక్షించాలన్నారు. రాబోయే ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.3000 కోట్లు ఉపాధి హామీ పనులపై ఖర్చు చేయాలని సూచించారు.

పనుల్లో రాజకీయ జోక్యం ఉండరాదని, పనుల నిర్వహణలో ఏపీవోలకు పూర్తి అధికారాలు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రోజుకు ఒక గంట కింది స్థాయి అధికారుల నుంచి పైస్థాయి అధికారుల వరకు గ్రామాల్లో ఉపాధి పనులను పర్యవేక్షించాలన్నారు. అధికారులు సమర్పించిన నివేదిక ప్రకారం మహాముత్తారం మండలంలో కేవలం 10 శాతం మాత్రమే పనులు పూర్తయినట్లు కనిపిస్తోందని, దీనికి కారణం ఏమిటని ఎంపీడీవోను ప్రశ్నించగా కూలీలు దొరకడం లేదని, మండలం ఎక్కువగా అటవీ ప్రాంతంతో కూడుకొని ఉందని సమాధానం ఇచ్చారు. దీనికి మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉపాధి పనుల కోసం ప్రతి గ్రామానికి రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్లు మంజూరు చేశారని, పనులు అనుకున్న ప్రకారం చేయించకపోతే ఆ మొత్తాన్ని ఆయా గ్రామాలు నష్టపోయే అవకాశం ఉందన్నారు. పనుల విషయంలో అధికారులకు పూర్తి అధికారాలు ఇస్తున్నామని, వారు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఏదైనా సమస్య ఉంటే నేరుగా తన దృష్టికి కానీ, కలెక్టర్ దృష్టికి కానీ తీసుకరావాలని సూచించారు.

ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం ఇవ్వొద్దు :ఎంపీ సీతారాంనాయక్


రాష్ట్ర ప్రజలకు బంగారు భవిష్యత్‌ను కల్పించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పని చేస్తున్నారని, సీఎం ఆధ్వర్యంలో మంత్రులు, అధికారులు 100 శాతం తమ బాధ్యతను నెరవేర్చాలని మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్ అన్నారు. ఉపాధి హామీ పనులు పూర్తి చేయించడంలో అధి కారులు విఫలం కావొద్దని, తద్వారా ప్రతి పక్షాలకు మాట్లాడే అవకాశం ఇవ్వద్దని సూచించారు. తప్పు చేసిన అధికారులను వెంటనే శిక్షించాలని కలెక్టర్‌కు సూచించారు. అధికారులు కూడా జవాబుదారీతనం అలవర్చుకోవాలని సూచించారు.

ప్రజాప్రతినిధులను భాగస్వాములు చేయాలి: మంథని ఎమ్మెల్యే పుట్ట మధు


ఉపాధి హామీ పథకం అమలులో ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేసినపుడే పథకం పూర్తి స్థాయిలో అమలవుతుందని మంథని ఎమ్మెల్యే పుట్ట మధు అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసినప్పుడే ఆశించిన ఫలితాలు సాధ్యమవుతాయని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు.

వంద శాతం పనులు పూర్తి చేస్తాం : కలెక్టర్ మురళి


ఉపాది హామీ పనులు పూర్తి చేయడానికి కూలీలు అందుబాటులో ఉండడం లేదని మహాముత్తారం ఎంపీడీవో చెప్పిన సమాధానానికి కలెక్టర్ ఆగ్రహించారు. జిల్లాలో పేదరికాన్ని తగ్గించడానికి అందరం పని చేయాలన్నారు. జిల్లాలో వచ్చే ఆరు నెలల్లో 100 శాతం పనులు పూర్తి చేస్తామని కలెక్టర్ మురళి మంత్రికి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డీఆర్‌డీవో డాక్టర్ మనోహర్‌తోపాటు అన్ని మండలాల ఎంపీడీవోలు, ఏపీవోలు, పంచాయతీ రాజ్ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
23
Advertisement
E-Paper
Advertisement


© 2011 Telangana Publications Pvt.Ltd