MONDAY,    February 27, 2017
Call for Subscription
23291167 / 1168 / 1169
జిల్లా వార్తలు
vijetha Educational Magazine
bhadradri News
1/12/2017 12:44:45 AM
కూతురు కోసం వెళ్తూ..కానరాని లోకాలకు..
దుమ్ముగూడెం/ చర్ల రూరల్, జనవరి 11: ఇంజనీరింగ్ చదువుతున్న కూతురును సెలవులకు తీసుకొద్దామని బయలుదేరిన దంపతులు కానరాని లోకానికి వెళ్లారు. ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఆ దంపతులు తమ కూతురును చూడకుండానే తనువు చాలించారు. నడిరోడ్డుపైనే విగత జీవులుగా మారిన దంపతుల మృతదేహాలను చూసి పలువురి హృదయాలు చలించిపోయాయి. ఈ విషాద ఘటన దుమ్ముగూడెం మండలంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. చర్ల మండలం ఆర్ కొత్తగూడెం గ్రామానికి చెందిన సాగి రంగరాజు (52), భార్య సుగుణ (45) కలిసి ఉదయం ఇంటి వద్ద నుంచి ద్విచక్రవాహనంపై తూర్పుగోదావరి జిల్లా మురిముడిలంక గ్రామానికి బయలుదేరి వెళ్తున్నారు.

ఈ క్రమంలో మండల పరిధిలోని రేగిబల్లి గ్రామ ప్రధాన రహదారిపై ఎదురుగా వస్తున్న ఏపీ 20 టీసీ 2316 అనే నెంబర్ గల ట్రాక్టర్ ఈ ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ఈ ఘటనలో రంగరాజు, సుగుణ అక్కడికక్కడే మృతిచెందారు. వీరి మృతదేహాలను 20 అడుగుల దూరం వరకు ట్రాక్టర్ ఈడ్చుకెళ్లింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక ఎస్‌ఐ బాలకృష్ణ.. మృతుల వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం భద్రాచలం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

వెంకటాపురం సీఐ సాయిరమణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ట్రాక్టర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. మృతిచెందిన రంగరాజు దంపతులకు ఒక పాప ఉంది. ఈమె తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఇంజనీరింగ్ ఫైనలియర్ చదువుతోంది. రంగరాజు కొన్నేళ్లుగా ఆర్ కొత్తగూడెం గ్రామంలో నివాసం ఉంటూ సైకిల్‌షాప్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. సంక్రాంతి పండుగ సందర్భంగా కూతురు రేష్మ వద్దకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వీరి మృతితో ఆర్.కొత్తగూడెం గ్రామస్తులు, కుటుంబసభ్యులు తీవ్ర శోకసముద్రంలో మునిగారు.
21
Advertisement
E-Paper
Advertisement


© 2011 Telangana Publications Pvt.Ltd