నేను డిగ్రీ చదువుతున్న రోజులవి. క్లాసులో ఒక్క అమ్మాయి కూడా లేదు. అమ్మాయి లేని జీవితం బోర్‌గా అనిపించేది. ఇల్లు, కాలేజ్ తప్ప మరో చోటు లేదు. ఒకరోజు మా అక్క వాళ్లింటికి వెళ్లాను. అక్కడ ఒక అమ్మాయి పరిచయం అయ్యింది. ఆమె మా పెద్దబావగారి కూతురు. అప్పుడే బయట ప్రపంచం గురించి తెలుసుకుంటోంది. లోకజ్ఞానం తెలియని అమ్మాయి. ఇంటర్ చదువుతోంది. ఆ అమాయకమైన కళ్లు నన్ను కట్టిపడేశాయి. తొలకరి జల్లులు కురిసినట్లు మా మధ్య ప్రేమ మాధుర్యాలు కురిశాయి. బీరతీగలా ఇద్దరినీ ప్రేమ పెనవేసుకుంది. అమ్మాయి కూడా జీవితాంతం నాతో కలిసి ఉండాలనే నిర్ణయానికి వచ్చేసింది. అమ్మాయి ఇంటర్ పూర్తయ్యింది. నాది డిగ్రీ పూర్తయ్యింది. కానీ ఎంఎస్సీలో సీట్ రాలేదు. ఇంట్లో ఒకటే తిట్లు.
అమ్మాయిల వెంబడి తిరిగి ఇలా చేసుకున్నాడని అక్క నుంచి చివాట్లు. ఏమీ చేయాలో తెలియని పరిస్థితి. ఇంతలోనే ఓ పిడుగులాంటి వార్త. అమ్మాయి ఇంట్లో మా ప్రేమ విషయం తెలిసింది. ఆమెను కట్టడి చేశారు. ఇద్దరం కలుసుకోలేని స్థితి. అలా సంవత్సరం గడిచిపోయింది. ఆ తర్వాత సంవత్సరం బీఎడ్‌లో సీటు వచ్చింది. కొంచెం ధైర్యం వచ్చి అప్పుడప్పుడు వాళ్ల ఇంటికి వెళ్లేవాడిని. ఎంతైనా చుట్టాలమే కాబట్టి ఏమీ అనలేక పోయేవారు. వాళ్ల తల్లిదంవూడులు ఇక లాభం లేదనుకొని ఆమెకు సంబంధాలు వెతకడం ప్రారంభించారు.
నాలో ఏదో తెలియని అలజడి. అమ్మాయి ఒకటే ఫోన్‌లు చేసేది. ఎలాగైనా ఒప్పించమని. తెలిసిన ఒక బాబాయ్‌ని ఇద్దరం వెళ్లి కలిశాం. అతను మేం చెప్పిన విషయం విని షాక్ అయ్యాడు. నాతో గొడవ పెట్టుకున్నాడు. అమ్మాయితో మాట్లాడకని చెప్పాడు. వారం తర్వాత మరోవ్యక్తి అమ్మాయిని తీసుకొని నా దగ్గరకు వచ్చాడు. ఆ రోజు నేను ఒకటే చెప్పాను. మూడు సంవత్సరాలు ఆగితే పెళ్లి చేసుకుంటానని అన్నాను. అమ్మాయి కూడా నాకు మద్దతు పలికింది. అయితే ఆ రోజు నుంచి మా ఇద్దరి మధ్య ఏ కమ్యూనికేషన్ లేదు. ఎప్పటికైనా ఆమెతోనే నా జీవితం అని అనుకుంటున్నాను.
- డి.రవీందర్, మహబూబ్‌నగర్