అది 1986వ సంవత్సరం, నవంబర్‌నెల. నేను వరంగల్‌లోని శ్రీ విశ్వేశ్వర సంస్కృతాంధ్ర కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాను. ఆ రోజుల్లో మా సొంతూరు అయిన ‘అంబాల శ్రీరాముల పల్లె’కు లోకల్ బస్సులు నడిచేవి కావు. మాకు ఐదు కిలోమీటర్ల దూరంలోని ముచ్చర్ల నాగారంకు బస్సు వచ్చేది. అది కూడా టైమింగ్స్. నేను నాగారం దాకా సైకిల్ మీద వెళ్లి అక్కడ నుంచి బస్సులో కాలేజ్‌కి వెళ్లేవాడిని. సాయంత్రం 5.30నిమిషాల వరకు ఊరు చేరుకునేవాడిని. ఇదీ ఆ రోజుల్లో నా ప్రయాణ దినచర్య. రోజులాగే ఓ రోజు కూడా కాలేజ్‌కి బయలుదేరుతుండగా.. మా నాయిన 200రూపాయలు ఇచ్చి ఒక రేడియో కొనుక్కరమ్మన్నాడు. సరేనని.. కాలేజ్ అయ్యాక హన్మకొండ చౌరస్తాకు మిత్రుడితో కలిసి వెళ్లి రేడియో కొన్నాను. బస్టాండ్‌కు వెళ్లేసరికి.. బస్సుపోయి 10నిమిషాలు అయిందని అక్కడున్నవాళ్లు చెప్పారు. ఇక చివరి బస్సు రాత్రి 7గంటలకు. రాత్రి బస్సు దిగి ఒంటరిగా 5కి.మీ ఎలా వెళ్లడమా? అని భయపడుతూ, ఆలోచిస్తూ ఉన్నాను. ఇంతలో 7గంటలు కావడం, మా బస్సు రావడం నేను ఎక్కి కూర్చోవడం జరిగింది. రాత్రి 8గంటలకు నాగారం చేరుకున్నాను. బస్సు దిగి, సైకిల్ తీసుకొని ఊరు బయలు దేరాను. ఒకటే భయం. ఆ గ్రామంలో స్తంభాలకున్న లైట్లు, ఇళ్లలోని దీపాల వెలుగు వల్ల చకచకా సైకిల్ తొక్కుతూ ముందుకు కదిలాను. ఊరుదాటినాక అసలు కథ మొదలయ్యింది.
నాగారంకు మా ఊరుకు మధ్య 5కి.మీల దూరమే కానీ, అన్నీ గుంతలే. దాన్ని మేము బర్రెలు అంటాం. రోజూ వచ్చేదారే కాబట్టి ఎక్కడ గుంతలున్నాయో బాగా తెలుసు. చుట్టూ అమావాస్య చీకటి. అన్నీ ఈత చెట్ల గుంపులు. పక్కనే శ్మశానం. చెట్లు, మనుషులు నిలబడ్డట్లే కనిపిస్తున్నాయి. స్పీడు పెంచి తొక్కుతూ మొదటి బర్రె దాటేశాను. తర్వాత లోతైన ‘బపూ’రాబోతున్నది. సంవత్సరంలో 325రోజులు ఆ బర్రె బురదగానే ఉండేది. దాన్ని సమీపిస్తున్నాను. నేను తొక్కుతున్న సైకిల్ చైన్ చప్పుడు, పంట పొలాల్లోని చిమ్మట్లు చప్పుడు తప్ప వేరే అలజడి లేదు. స్పీడు పెంచాను. ఇంతలో రోడ్డు పక్కనే ఉన్న వేప చెట్టుపై నుంచి భళ్లున నిప్పులు రాలాయి. అది చూడగానే నా సైకిలు నా చేతిలో నుంచి దూరంగా జారిపోయింది. భూజాన ఉన్న రోడ్డుపై దభీమని పడిపోయింది. వేప చెట్టుపై నుంచి మళ్లీ మళ్లీ నిప్పులు కింద పడుతూనే ఉన్నాయి. వెంటనే అది దయ్యమని నిర్ధారించుకొని పడిపోయిన సైకిల్‌ను లేపి తొందరగా తొక్కుతూ ఇల్లు చేరుకున్నాను. రాత్రి ఇంట్లో వాళ్లకు ఆ విషయం చెప్పాను. వాళ్లూ భయపడ్డారు. ఆ తర్వాత రోజు దారి వెంటే వెళ్తున్నాను. ఆ వేపచెట్టు రానే వచ్చింది. అది ఒంటరిగా లేదు. దానికింద ఇద్దరు గొల్లవాళ్లు ఏదో వెతుకుతున్నారు. వెంటనే సైకిల్ స్టాండేసి.. వాళ్ల దగ్గరికి వెళ్లి రాత్రి జరిగిన విషయం అంతా చెప్పాను. దానికి వాళ్లు.. ‘రాత్రి వేపచెట్టు పైనున్న తేనెతెట్టెను ఈత కొమ్మలు కాల్చి మేమే కొట్టాము. తేనేటీగలు కుట్టకుండా గొంగళ్లు కప్పుకున్నాం. అందుకే నీకు కనిపించి ఉండము’అని అసలు విషయం చెప్పారు. వారి మాటలు వినగానే.. ఓ మిస్టరీని ఛేదించినంత ఆనందం కలిగింది. ఆ రోజు వాళ్లు కలవకుండా ఉంటే ఇప్పటికీ నేను అది దయ్యమనే అనుకునేవాడిని. ఇప్పటికీ ఆ దయ్యం వేపచెట్టు మా ఊరికి పోయివస్తుంటే నన్ను పలకరిస్తూనే ఉంటది. నాటి సంఘటనను గుర్తుకు తెస్తూనే ఉంటది. నవ్విస్తూనే ఉంటది.
- వల్స పైడి, వరంగల్, 9849459667