అమ్మకన్న కమ్మని పదమేమున్నది సోదరా..
అమ్మను మించిన దేవత అవనిలోనే లేదురా
కడుపులో నీవున్నప్పుడు కదలికలను చేసినప్పుడు
కష్టమైనా ఇష్టపడి కమ్మని అనుభూతినొంది
ఊపిరినే పణం పెట్టి నీ ఉనికికి ఊపిరిచ్చి
అవనిపైకి నీ రాకకకు అవస్థలు పడు అమ్మ .. అమ్మ
రోతెంతో చేసినా యాతనేమి పడకుండా
లాలపోసి జోలపాడి నిను నిదుర పుచ్చునురా
మమతానురాగాలను ప్రతి ముద్దలో రంగరించి
ప్రేమ అనే అమృతాన్ని పంచి నిన్ను పెంచునురా.. అమ్మ
ఎదిగిన బిడ్డను చూసి ఎన్నెన్నో కలలుగంటూ
క్రమశిక్షణ కట్టుబాట్ల శిక్షణలో తొలి గురువై
ఎత్తుకు నీవెదగాలని సుతిమెత్తగ మందలిస్తూ
సతతం నీ మేలు కోరి పరితపించు మాతృమూర్తి.. అమ్మ
సత్తువ ఉన్నంత వరకు ఇంటి చాకిరంత చేసి
చేతకాని వయసులోన ఊతమడుగు దీనంగా
నీ బిడ్డల పాలనలో సగభాగము తానయ్యి
నీదు వంశవృక్షానికి అమ్మ అంటూ కొమ్మవురా.. అమ్మ
అందరికి తాను అందుబాటులుండడం కుదరదని
అమ్మలోనె చూడమని ఆనతిచ్చె ఆ దేవుడు
అందుకే చెపుతున్నా అమ్మ మనసు నొప్పించకు
మెప్పించి నీవు అమ్మ ఆశీస్సులనందుకొనరా.. అమ్మ
- అల్లి మోహన్‌రాజ్, భుడిమి, నిజామాబాద్