చంద్రునికో నూలు పోగువలె
అమ్మకో అక్షర సుమాలను అర్పిస్తున్నాను
అనంతమైన, అజరామరమైన అలవి కాని
అమృత స్పర్శయే కదా అమ్మంటే..
ఆదర్శమూర్తివి అచంచల ప్రేమమయివి నీవమ్మా
ఈ పుడమిలోని అన్ని విలువైన వాటికన్న మిన్న
అన్ని జన్మల కన్న గొప్పజన్మ
ఈ మానవ జన్మ కదా దీనిని
మా కందించిన సుధా జలధివి నీవమ్మా
స్వాతంత్య్ర రథ సారథియై
పోరులో ప్రాణాలర్పించి మనలను
మరచిన మా నాన్న నెరుగని నన్ను అన్నీ
నీవై పెంచిన దయా సాగరివి నీవమ్మా
మమ్ము రక్షించి, నీ రెక్కల చాటున దాచి
మము మనుషులుగా మలిచావు నీవమ్మా
మొక్కవోని ధైర్యానికి ప్రతి రూపానివమ్మా
నిత్యమై, సత్యమై, నిఖిలమైనావమ్మా
నా ఆత్మ విశ్వాసానివి నీవేనమ్మా
నీ గురించి నేనేమని, ఎన్ని రకాలని రాయనమ్మా
నీకు నేనేమివ్వగలను. ఈ తనువే నీవిచ్చినది కదమ్మా
- విప్లవ కుమారి