మా ఊరు సదాశివ నగరం. పక్కా తెలంగాణా గ్రామం. ఇది 56 సంవత్సరాల క్రితం మా ఊరు పరిస్థితి. నేను అప్పుడు 4వ తరగతి చదువుతున్నాను. ఆ కాలంలో ప్రతి గ్రామంలో ప్రతీ ఇల్లు ఉమ్మడి కుటుంబాలతో కలకలలాడుతూ ఉండేది. మాది ఉమ్మడి కుటుంబమే. అప్పటి ఉమ్మడి కుటుంబాలలో ఉన్న ప్రేమ, అప్యాయతా ఇప్పుటికీ మరవలేం. మాది సుమారు 30మందితో కూడుకున్న కుటుంబం. ప్రతి పండగా పెద్ద సంబురమే. ముఖ్యంగా ఉగాది పండగ రోజు.. అందరం కలిసి కొత్త బట్టలు వేసుకొని ఎంతో సంతోషంతో ఊరిలో ఉన్న హన్మాండ్ల గుడికి వెళ్లేవాళ్లం. రోడ్డు మీద కనిపించిన వాళ్లందరికీ శుభాకాంక్షలు చెబుతూ వెళ్లేవాళ్లం. పంచాంగ శ్రవణం వినేవాళ్లం. బడి ముందర కోలాటం వేసేవాళ్లు. ఎంతో ఆనందంగా ఉండేది. ఇక తెలంగాణలో ప్రత్యేకమైన పండగ బతుకమ్మ. మా ఊరి మధ్య రాజావారి గడి ఉంది. గడి ముందర పెట్టి బతుకమ్మ ఆడేవారు. తీరు.. తీరు బతుకమ్మలు కొలువుదీరేవి. పాటలు, నృత్యాలతో రాత్రి వరకు ఎంతో సంబరంగా జరిపుకునేవాళ్లు. దసరా రోజు కూడా ముందు రాజావారి గడికి పోయి ‘శమీ పూజ’ చేసి కేశపెరమాండ్ల గుడిలో ప్రదక్షిణలు చేసేవాళ్లం. అంతేకాదు, పీర్లపండగనాడు పీర్లు మోసేవాళ్లం. వారి వెనకాల కేరింతలు కొడుతూ మేమూ వెళ్లేవాళ్లం. అప్పటి ప్రేమలు ఇప్పుడు ఉన్నాయా అని పిస్తుంటుంది ఒక్కో రోజు.
ఆ సంబరాలు కనుమరుగయ్యాయి. మా ఊరి గురించి ఆలోచన వచ్చినప్పుడల్లా నాకు తోచిన సహాయం చేయాలని మనస్సు ఊవిళ్లురుతున్నది. కానీ నా పరిస్థితి నాకు సహకరించడం లేదు. అయినా ఉడతా భక్తిగా మా ఊర్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైన విద్యార్థికి నేను, మా తమ్ముడు కలిసి ప్రోత్సహకం ఇస్తున్నాం. ఇలా 30 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఇక ముందు కూడా చేయాలనుకుంటున్నాం.
- బి. లక్ష్మీపతి, కామాడ్డి