ఫైనల్ ప్రిపరేషన్ ప్లాన్
ఈ నెల 20వ తేదీతో పదోతరగతి ప్రీ-ఫైనల్ పరీక్షలు పూర్తయ్యాయి. ఇక ఇప్పుడు మిగిలిన సమయం ప్రతి విద్యార్థికీ చాలా కీలకమైనది. ఇంతకు ముందు తెలియ చేసినట్లుగా విద్యార్థులంతా ప్రీ-ఫైనల్ పరీక్షలలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకోవడానికి ఈ సమయాన్ని వినియో గించుకోవాలి. ఈ క్రమంలో కింది అంశాలపై విద్యార్థులు ప్రధానంగా దృష్టి సారించాలి.
- ప్రీ-ఫైనల్ సమాధాన పత్రాలను విశ్లేషించుకోవాలి.
- సరిగ్గా జవాబులు రాయని అంశాలను గమనించి వాటిని ఉపాధ్యాయులతో మరోసారి చెప్పించుకోవాలి.
- టాప్-10 ప్రశ్నలకు సమాధానాలు మళ్లీ రాసి చూసుకోవాలి.
- లాంగ్వేజస్‌లో వ్యాకరణ అంశాలు, మిగిలిన సబ్జెక్టులలో ఆబ్జెక్టివ్ ప్రశ్నలు, పటాలు, మ్యాపులు, గ్రాఫ్‌లు మొదలైన అంశాలలో బాగా ప్రిపేర్ కావాలి.
- పబ్లిక్ పరీక్షల రోజులలో అనుసరిం చాల్సిన టైంటేబుల్‌ను తయారు చేసుకుని దానిని ముందునుండే పాటించడం అలవాటు చేసు కోవాలి.
- పాజిటివ్ థింకింగ్‌ను పెంపొందించుకోవాలి.
ఈ అంశాలను ఇప్పుడు వివరంగా చర్చిద్దాం.
ప్రీఫైనల్ సమాధాన పత్రాల విశ్లేషణ
ఫైనల్ పరీక్షలుగా భావించి సమాధానాలు రాసిన ప్రీఫైనల్ పరీక్షలలో విద్యార్థులు అనుకున్న మార్కులు సాధించారా లేదా అని పరిశీలించుకుని, ఎక్కడ మార్కులు ఎందుకు తగ్గాయో ఉపాధ్యాయుడిని అడిగి తెలుసుకోవాలి. ఏయే అంశాలలో మంచి మార్కులు వచ్చాయి. ఏయే అంశాలలో మార్కులు తగ్గాయో తెలుసుకుంటే విద్యార్థులకు చాలా ఉపయోగం.
అవసరమైన అంశాలను మరోసారి చెప్పించుకోవాలి
సంవత్సరం మొత్తం చెప్పిన అంశాలను ఈ వారం రోజులలో చెప్పించుకోవడం అసాధ్యమే. అయితే విద్యార్థులకు కష్టమైనవి, ముఖ్యమైన అంశాలను మాత్రం తప్పనిసరిగా ఉపాధ్యాయుడితో చెప్పించుకోవాలి. ఏవైనా సందేహాలు ఉన్నాయా ..అంటే విద్యార్థులు ఏమీ చెప్పక పోవచ్చు. కానీ ఉపాధ్యాయుడు ఆయా పాఠాలలోని ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానాలు క్లుప్తంగా వివరిస్తూ వాల్యూపాయింట్లను అండర్‌లైన్ చేయిస్తూ రివిజన్ చేస్తే మంచిది.
టాప్ 10 ప్రశ్నలకు సమాధానాలు ప్రాక్టీస్ చేయాలి
ప్రతి సబ్జెక్టులో కూడా రిపీటెడ్‌గా వస్తున్న ప్రశ్నలు ఉన్నాయి. ఈసారి పబ్లిక్ పరీక్షలలో వస్తాయి అనుకుంటే ప్రశ్నలను ప్రతి సబ్జెక్టులో టాప్ 10గా గుర్తించి వాటిని రాయడం ప్రాక్టీస్ చేస్తే మంచిది. ఇప్పుడు రాయడానికి సమయం లేదు కదా అని ఆలోచిస్తే లాభం ఉండదు. చదివినప్పుడు ఏకాగ్రత కుదరనప్పుడల్లా రాస్తూ ఉండాలి. ఒక సబ్జెక్టులో 10 ప్రశ్నలు అంటే సుమారు రోజూ ఉదయం ఒక గంట, సాయంత్రం ఒక గంట పాటు అంటే 2 గంటలు రైటింగ్ ప్రాక్టీసు చేస్తే 3 రోజులలో టాప్ 10 ప్రశ్నలు నేర్చుకోవడం, రాయడం పూర్తవుతుంది. సుమారుగా అవే ప్రశ్నలు పరీక్షల్లో రావడానికి అవకాశం ఉంది. (ఉపాధ్యాయుడి సహకారంతో టాప్ 10 ప్రశ్నలను గుర్తించండి) అప్పుడు విద్యార్థులకు మంచి మార్కులు రావడం జరుగుతుంది.
పటాలు, మ్యాపులు ప్రాక్టీస్ చేయాలి
పబ్లిక్ పరీక్షలకు ముందు చాలా తక్కువ సమయం ఉంది. ఈ సమయంలో ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం టాప్ 10 ప్రశ్నలకు సమాధానాలు ప్రాక్టీస్ చేస్తూ మిగిలిన సమయంలో లాంగ్వేజస్‌లో మొత్తం వ్యాకరణ అంశాలు రివిజన్ చేసు కోవాలి. ఇన్ని రోజుల పాటు ప్రిపేర్ అయిన మెటీరి యల్‌ను శ్రద్ధతో మరోసారి చదవాలి. పటాలు, మ్యాపులు చూడకుండా ప్రాక్టీస్ చేసి చెక్ చేసుకోవాలి.
మొత్తం ప్రిపరేషన్ అంతా 23వ తేదీకల్లా పూర్తి చేసుకోవడం మంచిది.
పబ్లిక్ పరీక్షల సమయంలో పాటించాల్సిన టైంటేబుల్
పబ్లిక్ పరీక్షలు ఉదయం 9ః 30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి. కాబట్టి పరీక్షల కు రెండు లేదా మూడు రోజుల ముందు నుండే ఒక టైంటేబుల్‌ను తయారు చేసుకుని (మీకు వీలున్నట్లుగా) దానిని క్రమం తప్పకుండా పాటించడం అవసరం. ఉదాహరణకు కింది టైంటేబుల్‌ను గమనించండి.
ఉదయం : 4ః30కు నిద్ర లేవడం 5 : 00 నుండి 7 : 30 వరకు చదువుకోవడం తర్వాత అల్పాహారం చేసి పరీక్షకు బయలు దేరడం. తిరిగి మధ్యాహ్నం 12 : 30 నుండి 2 : 30 వరకు భోజనం, నిద్ర. 2 : 30 నుండి 5 : 30 వరకు చదువుకోవడం. సాయంత్రం 5 : 30 నుండి 6 : 00 వరకు విశ్రాంతి (ఏవైనా ఆటలు ఆడితే మంచిదని మానసిక శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు) తిరిగి 6 నుండి : 00 వరకు చదువుకోవాలి. రాత్రి నుండి : 30 వరకు భోజనం. : 30 నుంచి 10 గంటల వరకు చదువుకోవాలి.
ప్రతి రోజూ పరీక్ష అయిన తర్వాత కనీసం ఒక గంట ప్రశాంతంగా నిద్రించడం చాలా మంచిది. దీని వలన విద్యార్థుల మెదడుకు విశ్రాంతి లభించి మరునాటి సబ్జెక్టుపై ఎక్కువ ధ్యాస పెట్టడానికి వీలవుతుంది. ఈ రకమైన టైంటేబులును పరీక్షలు ప్రారంభానికి రెండు లేదా మూడు రోజుల ముందే ప్రారంభిస్తే పరీక్షల రోజులలో ఇబ్బంది కలుగకుండా ఉంటుంది.
ఉపాధ్యాయుల సహకారం
విద్యార్థులు చదువుకునేటప్పుడు అతి ముఖ్యమైన సమాధానాలను రివైజ్ చేయాలి. అంటే ఆయా సమాధా నాలలో అంశాలను మరోసారి చెప్పాలి. ఇంతే! ఈ అంశాలు కవర్ అయితే మీకు పూర్తి మార్కులు వస్తాయి..అని చెబుతూ టాప్ 10 ప్రశ్నలు విద్యార్థులు సులభంగా నేర్చుకునేలా తోడ్పడాలి.
24వ తేదీ నుండే తెలుగు ప్రిపరేషన్
ప్రారంభించాలి
మొదటి పరీక్ష బాగా రాస్తే ఆ ప్రభావం మిగిలిన పరీక్షలపై పడుతుంది. కాబట్టి 24వ తేదీన తెలుగు పేపర్-2 ఉపవాచకం ప్రశ్నలు అన్నీ రివైజ్ చేసుకోవడం ప్రారం భించడం మంచిది. 24వ తేదీ సాయంత్రం నుండి 25 వ తేదీ సాయంత్రం వరకు తెలుగు పేపర్ -1ను ప్రిపేర్ కావడం మంచిది. ఇంకా ముందు రోజు నుండే తెలుగు రివిజన్ ప్రారంభించినా నష్టం లేదు.
మేనేజ్‌మెంట్, పేరెంట్స్ సహకరించాలి
ప్రతి రోజూ విద్యార్థులతో మాట్లాడాలి. వారిలో పరీక్షలంటే ఏవైనా భయాలుంటే తీర్చాలి. పరీక్షలు రాసిన తర్వాత విద్యార్థులు ఏవైనా తప్పులు చేస్తే వారిని నిందించ కూడదు. ఎప్పటికప్పుడూ ధైర్యం చెప్పాలి. తల్లిదండ్రులు ముఖ్యంగా విద్యార్థులు వేళకు ఆహారం తీసుకునేటట్లు, వేళకు నిద్రపోయేటట్లు సహకారం అందించాలి. మేనేజ్ మెంట్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ముగ్గురూ ఈ కీలక సమయంలో విద్యార్థులను ప్రోత్సహిస్తే విద్యార్థులు మంచి మార్కులు సాధిస్తారు.
-వ్యాసకర్త ః హైదరాబాద్‌లోని
హైమావతి హైస్కూల్ ప్రిన్సిపాల్
Other News