-ఓడిన చోట్ల సైతం రెండో స్థానంలో
-తెలంగాణలో తెరుచుకోని ఖాతా
హైదరాబాద్, జూన్ 15 (టీ మీడియా) : యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత మూడుసార్లు జరిగిన ఉప ఎన్నికలలోను సత్తా చాటింది. వైఎస్ మరణం తర్వాత కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చిన ఆయన కుమారుడు జగన్.. తన తండ్రి పేరులోని మూడు అక్షరాలను ప్రతిఫలించేలా కొత్త పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. వైఎస్ మరణం అనంతరం ఆయన భార్య విజయమ్మ పులి నుంచి గెలిచారు. అయితే, జగన్ కాంగ్రెస్‌ను వీడిన తర్వాత విజయమ్మ పులి స్థానానికి, జగన్ కడప లోక్‌సభ స్థానానికి రాజీనామా చేసి, తిరిగి విజయం సాధించారు. ఆ తర్వాత టీడీపీ నుంచి నెల్లూరు అసెంబ్లీ స్థానం లో నుంచి గెలుపొంది, అనర్హత వేటుకు గురైన ప్రసన్నకుమార్ రెడ్డి.. ఆ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో విజయం సాధించారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి చెందిన 17మంది జగన్ వర్గ ఎమ్మెల్యేలుగా ముద్రపడ్డ వారు అనర్హత వేటు కారణంగా సభ్యత్వాన్ని కోల్పోయారు. దీంతో ఖాళీ అయిన 17 స్థానాలతో పాటు.. చిరంజీవి రాజీనామా చేసిన తిరుపతి నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరుగగా.. 15 స్థానాల్లో జగన్ పార్టీ అభ్యర్థులు గెలిచారు. అంతేకాకుండా ఓడిన మూడు చోట్ల రెండో స్థానంలో నిలవడం విశేషం. కొత్తగా ఏర్పడిన రాజకీయ పార్టీ తాను ఎదుర్కొన్న మూడు ఉప ఎన్నికలలోనూ అధిక స్థానాలను దక్కించుకోవడం రాష్ట్రంలో మారనున్న రాజకీయ సమీకరణలకు నిదర్శనమని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు.
తెలంగాణలో ఖాతా తెరవని వైఎస్‌ఆర్సీ
వైఎస్‌ఆర్సీ ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో రెండు సార్లు ఉప ఎన్నికలు జరిగాయి. కానీ.. వాటిలో జగన్ పార్టీ పోటీ చేయలేదు. 2012 మార్చిలో తెలంగాణలో ఆరు, సీమాంవూధలో ఒక స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కేవలం సీమాంవూధలో ఖాళీ అయిన నెల్లూరు స్థానంలో మాత్రమే పోటీ చేసింది. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న క్రమంలో ఇక్కడ పోటీ చేసి ఓటమి చెందితే పార్టీ మనుగడకే ముప్పు వాటిల్లుతుందనే ఉద్దేశంతో తెలంగాణ ప్రాంతంలో జగన్ పార్టీ పోటీ చేయలేదు. మూడో విడత జరిగిన ఉప ఎన్నికల్లో పరకాల నియోజవకర్గం నుంచి ఆ పార్టీ తరపున కొండా సురేఖ పోటీ చేశారు. పరకాలలో విజయం సాధించడం ద్వారా తెలంగాణ ప్రాంతంలో పార్టీకి పునాదులు వేయవచ్చని భావించిన ఆ పార్టీ ఈ స్థానాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకొంది. అందుకోసం సర్వశక్తులు ఒడ్డి పోరాడింది. అయినప్పటికీ ఫలితం నెరవేరలేదు. తెలంగాణపై స్పష్టత ఇవ్వకుండా ఏ పార్టీ మనుగడ సాధించలేదనే అభివూపాయాన్ని పరకాల ఓటర్లు తేల్చిచెప్పారు