ఆసీస్‌కు ఘోర పరాభవం
- ఐదో వన్డేలోనూ ఓటమి
- 4-0తో సిరీస్ ఇంగ్లండ్ కైవసం
మాంచెస్టర్: ఆస్ట్రేలియాకు ఘోర పరాభవం ఎదురైంది. వన్డే క్రికెట్‌లో నెంబర్‌వన్‌గా అవతరించిన నాటినుంచి ఇప్పటిదాకా ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా వైట్‌వాష్‌కు గురైంది. ఇంగ్లండ్‌తో ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా బుధవారం జరిగిన చివరిదైన ఐదో వన్డేలో 7 వికెట్ల తేడాతో ఓడడం ద్వారా 4-0తో సిరీస్‌ను కోల్పోయింది. ఎడ్జ్‌బాస్టన్‌లో జరగాల్సిన మూడో వన్డే వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే. కాగా, బుధవారం కూడా వర్షం అంతరాయం కలిగించడంతో తొలుత 32 ఓవర్లకు కుదించిన మ్యాచ్ లో టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ ఏడు వికెట్ల నష్టానికి 145 పరుగులు మాత్ర మే చేయగలిగింది. కాగా, లక్ష్యఛేదనలో మరోసారి వర్షం ఆటంకం కారణంగా ఇంగ్లండ్ లక్ష్యాన్ని 29 ఓవర్లలో 138 పరుగులుగా నిర్ధారించారు. ఈ లక్ష్యాన్ని ఇం గ్లండ్ మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి మరో 11 బంతు లు మిగిలి ఉండగానే సాధించింది. కెప్టెన్ కుక్ (58)కు తోడు ఫామ్‌లో ఉన్న బొపార (52) అర్ధసెంచరీలతో రాణించి ఇంగ్లండ్‌కు అలవోక విజయాన్నందించారు. అంతకుముందు బౌలింగ్‌లోనూ రాణిచిన బొపార (2/8) ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్ పతనంలో కీలకపాత్ర పోషించాడు. ఆసీస్ బ్యాట్స్‌మెన్‌లో వార్నర్ (32), బెయిలీ (46 నాటౌట్)లు మాత్రమే ఓ మోస్తరుగా రాణించగలిగారు. కాగా, బొపారకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, ఇయాన్ బెల్‌కు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు దక్కాయి.
Other News