హ హ్హా..కీ పాయింట్ పట్టేశాం!

- పూర్తి ఫిట్‌నెస్‌తో ఆటగాళ్ల కదనోత్సాహం
- ఛలో లండన్.. చక్‌దే ఇండియా
న్యూఢిల్లీ: మరికొద్ది రోజుల్లో లండన్ ఒలింపిక్స్ ప్రారంభం కానున్న నేపథ్యంలో భారత హాకీ జట్టు గత కొన్నేళ్లలో ఎన్నడూ లేనంత ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. ఒలింపిక్స్‌లో ఎనిమిదిసార్లు చాం పియన్‌గా నిలిచిన చరిత్ర ఉన్నా బీజింగ్‌లో జరిగిన గత ఒలింపిక్స్‌కు కనీసం అర్హ త కూడా సాధించలేక ప్రతిష్టను మసకబార్చుకున్న సంగతి తెలిసిందే. అయితే గడచిన ఏడాదిన్నర కాలంగా ఆటగాళ్ల దృక్పథంలోనూ, జట్టు ప్రదర్శనలోనూ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది.
కోచ్‌గా మైకేల్ నాబ్స్ రాకతో జట్టు స్వరూపమే పూర్తిగా మారిపోయింది. నాబ్స్ వస్తూనే జట్టులోని వెటరన్ ఆటగాళ్లను బయటికి పంపించి యువరక్తాన్ని నింపాడు. నాబ్స్‌కు తోడు ఏడాది క్రితం ఫిజియోగా బాధ్యతలు స్వీకరించిన డేవిడ్ జాన్ ప్రధానంగా ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పైనే దృష్టిపెట్టాడు. అంతకుముందు రగ్బీ, క్రికెట్ జట్లకు ఫిజియోగా పనిచేసిన ఆస్ట్రేలియా జాతీయుడైన జాన్..తన ప్రణాళికను అమలు చేసేందుకు కఠినంగానే వ్యవహరించాడు. అయితే జట్టులో కొందరు ఆటగాళ్లు శాఖాహారులుండడంతో వారి ఫిట్‌నెస్‌ను తీర్చిదిద్దేందుకు జాన్‌కు పెద్ద కసరత్తే చేయాల్సి వచ్చిందట. వారు తీసుకునే ఆహారం కారణంగా తొందరగా గాయాల బారిన పడే అవకాశం ఉండడంతో ఆటగాళ్ల ఆహారం విషయంలో జాన్ ప్రత్యేక నిబంధనలు విధించాడు. మొదట్లో అలవాటు పడేందుకు ఆటగాళ్లు ఇబ్బందిపడినా, తరువాత ఫిట్‌నెస్ ఆవశ్యకతను వారంతా అర్థం చేసుకున్నారని, ఇప్పుడు జట్టులో ప్రతి ఒక్కరూ సిక్స్‌ప్యాక్ కోసం పోటీ పడుతున్నారని జాన్ చెప్పాడు. ప్రస్తుత భారత జట్టు ఫిట్‌నెస్ పరంగా ప్రపంచంలోని అన్ని జట్లకన్నా ముందే ఉంటుందన్నాడు. అయితే ఫిట్‌నెస్‌ను అత్యున్నత స్థాయికి తీసుకురావడం రాత్రికి రాత్రే సాధ్యమయ్యే పని కాదని, ఇందుకు దీర్ఘకాలంపాటు శ్రమించాల్సి ఉంటుందన్నాడు.
ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ పూర్తయ్యాక లభించిన నాలుగు వారాల సమయంలో ఎంతో సాధించగలిగామని జాన్ పేర్కొన్నాడు. కాగా, గత 32 ఏళ్లుగా ఒలింపిక్స్‌లో పతకం తేలేని భారత్.. ఈసారి ఆ లోటును కచ్చితంగా పూడ్చుకోగలుగుతుందని ధీమా వ్యక్తం చేశాడు. అయితే ఒలింపిక్స్‌లో తొలి గేమ్‌లో ఓడిన ప్రతిసారి భారత్‌కు చేదు అనుభవమే ఎదురైంది. దీంతో ఈసారి కూడా తొలిమ్యాచ్ కీలకంగా మారింది. లండన్ క్రీడల్లో భారత్ పటిష్టమైన జట్లున్న గ్రూప్ ‘బి’లో ఆడనుంది. ఈ గ్రూప్‌లో 1996, 2000 ఒలింపిక్స్‌లో స్వర్ణపతక విజేత హాలెండ్, 1992 విజేత జర్మనీ, 2008 చాంపియన్ దక్షిణ కొరియాలతోపాటు బెల్జియం, న్యూజిలాండ్ జట్లున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ తమ ఆత్మవిశ్వాసాన్ని ఏ మేరకు ప్రదర్శిస్తుందో చూడాల్సి ఉంది. కాగా, ఒలింపిక్స్‌కు ముందు ఫ్రాన్స్, స్పెయిన్‌లలో జరగనున్న ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో ఆడేందుకు భారత ఆటగాళ్లు గురువారం బయలుదేరి వెళ్లారు.
Other News