సుశీల్ రజతం నెగ్గాడిలా..
లండన్ ఒలింపిక్స్‌లో ఖాయంగా పతకం సాధించగలడని తనపై ఉన్న అంచనాలను సుశీల్‌కుమార్ నెరవేర్చాడు. సుశీల్ విన్యాసాల కోసం విశ్వక్షికీడల చివరిరోజు దాకా ఎదురుచూడాల్సి వచ్చినా, రజత పతకం సాధించి సుశీల్ ఆ నిరీక్షణకు సరైన ముగింపునిచ్చాడు. ఒకేరోజు నాలుగు బౌట్లతో రజతం దాకా సుశీల్ సాగించిన ప్రస్థానం..
ప్రీ క్వార్టర్ పైనల్ (3-1తో గెలుపు) ప్రత్యర్థి: సాహిన్ రమజాన్ (టర్కీ)
క్వాలిఫికేషన్‌లో బై లభించడంతో సుశీల్‌కుమార్ ప్రీ క్వార్టర్స్‌లో నేరుగా డిఫెండింగ్ చాంపియన్ సాహిన్‌తో తలపడ్డాడు. బీజింగ్ స్వర్ణ పతక విజేత సాహిన్‌తో 2 నిమిషాల తొలి పీరియడ్‌లో సుశీల్ రెండు టెక్నికల్ పాయింట్లు కోల్పోయి 0-2తో ఆ పీరియడ్‌ను కోల్పోయాడు. ఇక రెండో పీరియడ్‌లో ఇద్దరూ స్కోర్లేమీ నమోదు చేయలేకపోయారు. అయితే టాస్ నెగ్గిన సుశీల్ క్లించ్‌లో సాహిన్‌ను రింగ్ బయటకు నెట్టి పీరియడ్‌ను గెలుచుకున్నాడు. పాయింట్లు సమమైన నేపథ్యంలో మూడో పీరియడ్‌లో హోరాహోరీ పోరు సాగింది. చివరకు పైచేయి సాధించిన సుశీల్ ఆ పీరియడ్‌తోపాటు 3-1తో బౌట్‌నూ గెలిచాడు.
క్వార్టర్ ఫైనల్ (3-1తో గెలుపు)
ప్రత్యర్థి: ఇక్తియార్ (ఉజ్బెకిస్తాన్)
ఏకంగా 3 పాయింట్లు సాధించి తొలి పీరియడ్‌ను గెలిచాడు. రెండో పీరియడ్‌ను సైతం తన అదుపులోనే ఉంచుకున్న సుశీల్ చివరి 6 సెకన్లలో ఇక్తియార్‌కు పాయింట్ ఇవ్వడంతో బౌట్ మరో పీరియడ్ దాకా వెళ్లింది. అయితే తుది పీరియడ్‌లో సుశీల్ మరోసారి 2-0తో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించాడు. దీంతో 3-1తో బౌట్‌ను సొంతం చేసుకుని సెమీస్‌లో అడుగు పెట్టాడు.
సెమీఫైనల్ (3-1తో గెలుపు) ప్రత్యర్థి: అక్జురుక్ టాంటరోవ్ (కజకిస్తాన్)
సెమీస్‌లో సుశీల్ తన కెరీర్‌లోనే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. తొలి పీరియడ్‌లో ఇరానీ టెక్నిక్‌తో రెండుసార్లు టాంటనోవ్‌ను మ్యాట్‌పై దొర్లించిన సుశీల్ 2 పాయింట్లు సాధించగా, టాంటనోవ్ పెనాల్టీ రూపంలో మరో పాయింట్‌ను ఇచ్చాడు. దీంతో 3-0తో తొలి పీరియడ్ సుశీల్ వశమైంది. అయితే రెండో పీరియడ్‌లో టాంటనోవ్ పూర్తి ఆధిపత్యం చలాయిస్తూ ఏకంగా 3 పాయింట్లు పొందాడు. ఇక మూడో పీరియడ్ ఆరంభంలో సుశీల్ అలసిపోయినట్లుగా కనిపించాడు. దీంతో కొద్ది సెకన్ల వ్యవధిలోనే టాంటనోవ్ 3-0 ఆధిక్యం సంపాదించాడు. కానీ, అవకాశం కోసం వేచిచూసిన సుశీల్.. టాంటనోవ్ రెండు కాళ్లను దొరకబుచ్చుకొని లొంగదీసుకోవడం ద్వారా స్కోరును 3-3గా మార్చాడు. ఇక చివరి దశలో ఒక్కసారిగా విజృంభించిన సుశీల్ ఏకంగా టాంటనోవ్‌ను భుజాలపైకి ఎత్తి కిందపడేశాడు. దీంతో 6-3తో పీరియడ్‌ను, 3-1తో బౌట్‌ను కైవసం చేసుకున్నాడు.
ఫైనల్ (0-3తో ఓటమి) ప్రత్యర్థి: తత్సుహిరో యోనెమిత్సు (జపాన్)
తీవ్రంగా అలసిపోయినా సెమీస్‌లో వీరోచితంగా పోరాడిన సుశీల్ ఫైనల్లో ఆ పోరాటం కనబరచలేకపోయాడు. టాంటరోవ్‌తో పోరులో మెడ నొప్పి కలగడం, బౌట్ తర్వాత రక్తం వాంతికి చేసుకోవడం సుశీల్‌కు ప్రతికూలంగా మారాయి. ఫలితంగా తొలి పీరియడ్‌లో 30 సెకన్లలోపే తత్సుహిరోకు పాయింట్ ఇచ్చుకున్న సుశీల్ తిరిగి కోలుకోలేకపోయాడు. ఆ తరువాత రెండో పీరియడ్‌లో ఇరానీ టెక్నిక్‌ను మరోసారి ప్రయోగించేందుకు ప్రయత్నించినా సక్సెస్ కాలేకపోయాడు. దీంతో ఈ పీరియడ్‌లో మూడు పాయింట్లు పొందిన తత్సుహిరో మరో పీరియడ్ అవసరం లేకుండానే బౌట్‌ను, స్వర్ణాన్ని దక్కించుకున్నాడు.
Other News