భారత్ 16- శ్రీలంక 0
- మన అమ్మాయిల గోల్ గోల
- జూనియర్ ఆసియా కప్ హాకీలో అద్భుత ఆరంభం
బ్యాంకాక్: జూనియర్ ఆసియా కప్ హాకీ టోర్నమెంట్‌లో భారత అమ్మాయిలు ఆరంభంలోనే అదరగొట్టారు. తమ తొలిమ్యాచ్‌లో శ్రీలంకను చెడుగుడు ఆడుకుని గోల్స్ పండగ చేసుకున్నారు. గ్రూప్-ఏలో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత అమ్మాయిలు ఏకంగా 16 గోల్స్‌తో విజృంభించి 16-0తో విజయం సాధించారు. నలుగురు క్రీడాకారిణులు అనూపా బార్లా, వందన కటారియా, పూనమ్ రాణి, రీతూ రాణిలు తలా మూడు గోల్స్‌తో చెలరేగి భారత్ విజయంలో కీలకపాత్ర పోషించారు. ఆద్యంతం అద్భుత ఆటతీరుతో అలరించిన భారత అమ్మాయిలు ప్రత్యర్థికి ఒక్క అవకాశాన్ని కూడా ఇవ్వకుండా పూర్తి ఏకపక్షంగా పైచేయి సాధించారు. గ్రూప్-ఏలోనే మరో మ్యాచ్‌లో మలేసియా 7-0తో సింగపూర్‌పై, గ్రూప్-బిలో జపాన్ 17-0తో పాకిస్తాన్‌పై నెగ్గి ముందంజ వేశాయి. ఈ టోర్నమెంట్‌లో టాప్-3లో నిలిచిన జట్లు వచ్చే ఏడాది జరిగే జూనియర్ మహిళల వరల్డ్ కప్‌కు అర్హత సాధిస్తాయి.
Other News