ఎదురులేని జర్మనీ
- గ్రీస్‌పై ఘనవిజయంతో సెమీస్‌కు
గాంస్క్ (పోపూండ్):యూరోకప్‌లో జర్మనీ జైత్రయాత్ర అప్రతిహతంగా సాగుతోంది. గ్రూప్ దశలో వరుసగా మూడు మ్యాచ్‌ల్లోనూ గెలుపొందిన జర్మనీ శుక్రవారం గ్రీస్‌తో జరిగిన క్వార్టర్‌ఫైనల్లో 4-2 తేడాతో అద్భుతవిజయం సాధించి సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆరంభంలో హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో 39వ నిమిషంలో ఫిలిప్ లామ్ తొలి గోల్ నమోదు చేసి జర్మనీకి ఆధిక్యం అందించాడు. ఆ తరువాత తొలి అర్ధభాగంలో మరో గోల్ నమోదు కాలేదు. అయితే రెండో అర్ధభాగం ప్రారంభమై పది నిమిషాలకు గ్రీస్ స్ట్రయికర్ గైయర్గోస్ సమరాస్ (55వ) గోల్ సాధించి జర్మనీ ఆధిక్యాన్ని సమం చేశాడు. కానీ, వారికి ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. సమీ ఖేదిరా (61వ), వెటరన్ స్ట్రయికర్ మిరోస్లావ్ క్లోజ్ (68వ), మార్కో రూస్ (74వ)లు వరుసగా మూడు గోల్స్ సాధించి జర్మనీని తిరుగులేని ఆధిక్యంలో నిలబెట్టారు. చివర్లో మ్యాచ్ మరో నిమిషంలో ముగుస్తుందనగా గ్రీస్ ఆటగాడు డిమివూతిస్ సాల్పింగిడిస్ (89వ) గోల్ నమోదు చేసినా అది జర్మనీ ఆధిక్యాన్ని తగ్గించడానికి మాత్రమే ఉపయోగపడింది. ఇక ఈ మ్యాచ్‌లో గెలుపుతో టోర్నీలో వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసుకున్న జర్మనీ ఈ నెల 28న జరిగే సెమీఫైనల్లో ఇంగ్లండ్-ఇటలీ మధ్య క్వార్టర్‌ఫైనల్ విజేతతో తలపడనుంది. కాగా, గ్రీస్‌కు యూరోకప్‌లో ఇదే అతిపెద్ద పరాజయం.అంతకుముందు 1980లో జెకోస్లోవేకియా చేతిలో గ్రీస్ 1-3తేడాతో పరాజయాన్ని చవిచూసింది.
Other News