తారాగణం:
విజయ్, శ్రీరామ్, జీవా, సత్యరాజ్, ఇలియానా, సంతానం, ఎస్.జె.సూర్య తదితరులు...
సంగీతం: హారీస్ జైరాజ్ దర్శకత్వం: శంకర్
నిర్మాత: జెమిని ఫిల్మ్ సర్కూట్స్
‘కథను మాత్రమే నమ్మి ఈ సినిమా చేశాను. నా గత చిత్రాలని మరిచిపోయి ఈ చిత్రం చూడండి’ అని స్నేహితుడు ఆడియో విడుదల సందర్భంగా శంకర్ చేసిన ప్రకటన ఇది. ‘జెంటిల్‌మేన్’ నుంచి ‘రోబో’ వరకు దాదాపు అన్ని స్ట్రెయిట్ చిత్రాలే అయినా .. ఆయన తొలిసారి రీమేక్ చేసిన చిత్రం స్నేహితుడు. బాలీవుడ్ సూపర్‌హిట్ మూవీ ‘త్రీ ఇడియట్స్’కు రీమేక్ అయిన ‘స్నేహితుడు’ ఆ స్థాయిలోనే వుందా? ఒకసారి పరిశీలిద్దాం.
పంచబట్ల సారంగపాణి(విజయ్), వెంకట్ రామకృష్ణ(శ్రీరామ్), శనక్కాయల నిఖిల్( జీవా) ఐడియల్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్. ఈ ముగ్గురిది భిన్నమైన నేపథ్యం. కాలేజ్‌లో ఈ ముగ్గురూ మంచి మిత్రులు. ఈ ముగ్గురిలో సారంగపాణి చాలా తెలివిగలవాడు. కాలేజ్ బోధనా విధానం సరళంగా, అర్థవంతంగా వుండాలని, స్టూడెంట్స్‌ని యంత్రాల్లా తయారు చేయకూడదని వాదిస్తుంటాడు. ఇక వెంకట్‌కు ఇంజనీరింగ్ చదవడం కన్నా వైల్డ్ లైఫ్ ఫోటోక్షిగఫీ అంటే ఇష్టం కానీ అది అతని తండ్రికి ఇష్టముండదు. ఇక మూడోవాడు శనక్కాయల నిఖిల్ గోల్ ఒక్కటే. ఆర్థిక ఇబ్బందుల్లో వున్న తన కుటుంబానికి బాసటగా నిలవడం. ఇద్దరు స్నేహితులని మీరు కోరుకున్న లక్ష్యాలు నెరవేర్చుకోవడం కోసం ప్రయత్నించండి అంటూ పాణి ప్రోత్సహిస్తుంటాడు. ఈ క్రమంలో కాలేజ్ డీన్ విరూపాక్షసుందరానికి (సత్యరాజ్)- ఈ ముగ్గురి మధ్య కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆ ప్రయాణంలోనే విరూపాక్షసుందరం కూతురు రియా(ఇలియానా)తో పాణికి పరిచయం ఏర్పడుతుంది. ఈ ముగ్గురు స్నేహితులు తాము కోరుకున్న విధంగానే తమ లక్ష్యాలను నెరవేర్చుకున్నారా? పాణి, రియల ప్రేమకథ ఎలా సుఖాంతమైందో తెరపై చూడాల్సిన కథ.
నటీనటుల గురించి చెప్పాలంటే పాణి పాత్రలో విజయ్ మంచి నటన ప్రదర్శించాడు. శ్రీరామ్, జీవా తమ పాత్రలకు పరిపూర్ణంగా న్యాయం చేశారని చెప్చొచ్చు. ఇలియానా ఎప్పటి లాగే గ్లామర్ డాళ్‌గానే మిగిలిపోయింది. సత్యరాజ్ హుందాగా నటించాడు. టెక్నికల్ టీమ్ అంతా తమ తమ బాద్యతలని చక్కగా నిర్వర్తించింది. ఈ చిత్రానికి మాతృక అయిన ‘త్రీ ఇడియట్స్’ కథని యధాతథంగా తీసుకుని రెండు పాటలు అదనంగా జోడించి అర్థవంతంగా శంకర్ ‘స్నేహితుడు’ని తెరకెక్కించిన తీరు అభినందనీయం. కానీ ‘త్రీ ఇడియట్స్’ అందించిన ఫీల్‌ని మాత్రం సగటు ప్రేక్షకుడికి కలిగించలేక పోయాడు.
| |
|
![]() |
|