ఇట్స్ నాట్ ఎ లవ్ స్టోరీ
తారాగణం: మహీగిల్, దీపక్ దోబ్రియాల్, అజయ్‌గేగి, జాకీర్‌హుస్సేన్, నీల్ భూపాల్, దర్శన్ జరివాలా, గణేష్ యాదవ్
సంగీతం: సందీప్ చౌతా
దర్శకత్వం: రామ్‌గోపాల్ వర్మ.
‘నా ఇష్టం వచ్చినట్టు సినిమా తీస్తాను చూస్తే చూడండి లేకపోతే లేదు. అది మీ ఇష్టం’ అని రామ్‌గోపాల్ వర్మ అనడం అతనికి అలవాటు. ‘ఏం సినిమాలు తీస్తాడ్రా బాబూ’ అనుకుంటూనే ఆయన సినిమాలు చూడడం ప్రేక్షకులకూ అలవాటైంది. అందుకే ‘ఇట్స్ నాట్ ఎ లవ్‌స్టోరీ’ సినిమా కూడా జనం చూడాల్సి వస్తోంది. సినిమాగా ఆ కథేంటో తెలుసుకోవాలంటే...
అనూష (మహీగిల్) సినిమా ఛాన్స్‌ల కోసం బాలీవుడ్‌లో చక్కర్లు కొడుతుంటుంది. అవకాశాల కోసం తిరిగి తిరిగి అలిసిపోయే సమయానికి ఆమెకు కాస్టింగ్ డైరెక్టర్ ఆశిష్(అజయ్ గేగి) ఆసరాగా ఉంటాడు. ఇద్దరూ మంచి స్నేహితులవుతారు. ఒకరోజు జరిగిన పార్టీ కారణంగా ఇద్దరు అనూష అపార్ట్‌మెంట్‌లోనే ఉండాల్సి వస్తుంది. కట్ చేస్తే తెల్లారేసరికి అనుష బాయ్ ఫ్రెండ్ రాబిన్ (దీపక్ దోబ్రియాల్) ఫ్లాట్‌లో దిగుతాడు. అదే సమయంలో బెడ్‌రూమ్‌లో ఆశిష్, అనూష ఉన్న స్థితిని చూసి షాక్ తింటాడు. ఆవేశంగా ఆశిష్‌ను హతమారుస్తాడు. ఆ శవాన్ని ముక్కలుగా కోసి కవర్లలో పెట్టి ఎక్కడెక్కడో పడేస్తాడు. హత్యోదంతంతో అనూష పాత్ర లేకున్నా హత్యానంతరం ప్రియుడి కోసం సహకరించాల్సి వస్తుంది. ఇక అప్పటినుంచి వాళ్లిద్దర్నీ వెంటాడుతున్న ఆ హత్యా ఫలితమే సెకండాఫ్ సినిమా. పోలీసులు, ఇన్వెస్టిగేషన్.. అరెస్టులు...ఇలా సాగుతుంది. సినిమా సస్పెన్స్‌తో నడుస్తుందనే విషయం చివరిదాకా తెలియకుండా ఉండడం వల్ల క్లయిమాక్స్ హృద్యంగా అనిపిస్తుంది.
ప్రధానపావూతల్లో మొదట చెప్పుకోవాల్సింది మహీగిల్ గురించి. ‘దేవ్ డి’ తో బాలీవుడ్‌కు పరిచయమైన ఈ అమ్మాయి నటిగా మొదటి సినిమాతోనే ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాతో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంటుంది. బాయ్‌వూఫెండ్‌గా దీపక్ దోబ్రియాల్ కూడా ఫరవాలేదు. మిగతా పాత్రలన్నీ రామ్‌గోపాల్ వర్మ స్థాయికి తగినట్టు ప్రవర్తించాయి. నిజానికి ‘ఇట్స్ నాట్ ఎ లవ్‌స్టోరీ’ సినిమా చూసి బయటకొస్తుంటే ‘ఇది ప్రేమకధే’ అనిపిస్తుంది.
ఇది 2008లో ముంబైలో జరిగిన ఒక పాశవిక హత్యా స్ఫూర్తితో తీసిన సినిమా. సెక్సప్పీల్ కోసం చేసిన మూడ్ క్రియేషన్ కాస్త ఎక్కువయిందనే చెప్పాలి. కెమెరా యాంగిల్స్ చాలా చోట్ల ఇబ్బంది కలిగిస్తాయంటే నమ్మకతప్పదు. సినిమా మొత్తం నేచురల్ లైటింగ్‌లో తీశారు. షరామామూలుగానే గొప్ప విషయాలేమీ లేవు ఈ సినిమాలో. రామ్‌గోపాల్ వర్మకు ఇలాంటి సినిమాల మీద మోజు ఎందుకో అర్థం కాదు. ఎవరిని మెప్పించడానికి? కమర్షియల్ హిట్ తప్పక అవసరమైన ఈ సమయంలో రామ్‌గోపాల్ వర్మ ఈ సినిమా తీశాడు.
క్షణికావేశంలో చేసిన తప్పుకు పశ్చాత్తాపం అనుభవిస్తున్న వ్యక్తిని చూస్తే జాలి కలుగుతుంది. అలాగే తప్పు చేయించి పశ్చాత్తాపంలోకి నెట్టివేసే రామ్‌గోపాల్ వర్మ సున్నితమైన క్రూరత్వం చూస్తే అతనిపై వేరే విధమైన జాలి కలుగక మానదు ఎవరికైనా.
బి. మహేందర్
| |
|
![]() |
|