ఓ వస్తువు మీద ఐఎస్‌ఐ ముద్ర వుందంటే అది నాణ్యమైన వస్తువుగా మనం పరిగణిస్తాం. అలాగే ఓ సినిమా పోస్టర్‌పై రాజమౌళి ముద్ర వుంటే అది మినిమమ్ గ్యారెంటీ వినోదం అందించే సినిమాగా ప్రేక్షకుల మనసులో బలంగా నాటుకుపోతుంది. రాజమౌళిపై వున్న నమ్మకం అలాంటిది. ఆయన సినిమా అంటే పైసా వసూల్ అనేది ప్రేక్షకుల ప్రగాఢమైన విశ్వాసం. అయితే ఇప్పటి వరకు హీరోలతో సినిమాలు చేసి హిట్‌లు కొట్టిన రాజమౌళి ఈసారి మాత్రం తన సినిమాలో ‘ఈగ’ను హీరోగా ఎంచుకున్నాడు. ‘ఈగ’ పేరుతో ఓ ప్రయోగాన్ని చేశాడు. ఆ ప్రయోగం ఏ మేరకు ఫలించిందో తెలుసుకుందాం. కథ: సుదీప్ (సుదీప్) పెద్ద వ్యాపారవేత్త, నచ్చిన అమ్మాయి తన వశం కావాలనుకునే మనస్తత్వం వుండే యువకుడు. అలాంటి వ్యక్తికి అనుకోకుండా బిందు (సమంత) అనే మైక్రో ఆర్టిస్ట్ పరిచయమవుతుంది. చూడగానే బిందును ఎలాగైనా తన సొంతం చేసుకోవాలనుకుంటాడు సుదీప్. కాని బిందును నాని (నాని) ప్రేమిస్తున్నాడని తెలిసి అతడ్ని చంపేస్తాడు. ఆ తర్వాత నాని ఈగగా పునర్జన్మనెత్తి సుదీప్‌పై పగ ఎలా తీర్చుకున్నాడు? బిందును అతని భారీ నుంచి ఎలా రక్షించాడు..? అనేది మిగతా కథ.కళాకారుల పనితీరు: కన్నడ సూపర్‌స్టార్ సుదీప్ ప్రతి నాయకుడిగా అద్భుతంగా నటించాడు. అతని నటన చిత్రానికి ప్రధాన ఆకర్షణ. సుదీప్ పాత్రకు సుదీప్ తప్ప ప్రత్యామ్నాయం లేదు అనే స్థాయిలో ఆయన నటన ఆకట్టుకుంది. క్రూరత్వం నిండిన విలన్‌గా అతని అభినయానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. నాని, సమంతలు తమ పాత్రలకు న్యాయం చేశారు. తాగుబోతు రమేష్ కనిపించింది కాసేపే అయినా అందరికి గుర్తుండిపోయే పాత్రలో నటించి మంచి మార్కులే సంపాందించాడు.
సాంకేతిక వర్గం పనితీరు: కథకు తగ్గట్టుగా బాణీలను, నేపథ్య సంగీతాన్ని అందించడంలో కీరవాణి ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో కీరవాణి అందించిన పాటలు ఆడియన్స్‌ను మెస్మరైజ్ చేయగా,నేపథ్య సంగీతం సినిమాలో టెంపోని, ఫీల్‌ని క్యారీ చేసింది. ఇక ఇది పక్కా రాజమౌళి సినిమా. సినిమాలో ప్రతి సన్నివేశంలో అతని తపన, కృషి కనిపిస్తుంది. ‘ఈగ’ను ప్రధాన కథావస్తువుగా పెట్టి రెండున్నర గంటలు ఆడియన్స్‌కు బోర్ కొట్టకుండా కథనం నడిపించడం అంటే అంత ఆషామాషీ కాదు. అయితే తన దర్శకత్వ ప్రతిభతో రాజమౌళి ఈ విషయంలో నూటికి నూరుపాళ్లు సక్సెస్ అయ్యాడు. ఎక్కడా ఓవర్‌గా థింక్ చేయకుండా ప్రతి సన్నివేశాన్ని సహజ శైలిలో చిత్రీకరించాడు. తను ఏం చేసినా అది ప్రేక్షకుల వినోదం కోసమే.. అది హీరోతోనైనా ఈగతోనైనా అని బోల్డ్‌గా ప్రకటించిన రాజమౌళి ప్రేక్షకులు తనమీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయలేదు. ఈ సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది గ్రాఫిక్స్ వర్క్ గురించి, ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమాలో ఇలాంటి గ్రాఫిక్స్ ప్రేక్షకులు చూసి వుండరు. కొన్ని కొన్ని సన్నివేశాల్లో నిజమైన ఈగను చూసిన భ్రమను గ్రాఫిక్స్ ద్వారా కలిగించారు. ఒక్క మాటలో చెప్పాలంటే టాలీవుడ్‌కి దొరికినా గొప్ప దర్శకుడు రాజమౌళి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అగ్ర కథానాయకులంతా రాజమౌళితో సినిమా చేయాలని క్యూ కడుతుంటే తను మాత్రం ప్రేక్షకులకు కొత్త తరహా చిత్రాలు అందించాలనే తపనతో ‘ఈగ’లాంటి ప్రయోగాన్ని చేసి అందరితో శభాష్ అనిపించుకుని సినిమా సినిమాకి తనపై గౌరవాన్ని పెంచుకుంటున్నాడు. అయితే గత రెండు సంవత్సరాల నుంచి అందరూ ఎంతో ఈగర్లీ వెయిట్ చేసిన ఈ సినిమాని వేసవిలో విడుదల చేసి వుంటే కలెక్షన్ల పరంగా మరింత ప్లస్ అయ్యేది. అయితే మంచి సినిమా ఎప్పుడొచ్చినా ప్రేక్షకుల ఆదరిస్తారనే నమ్మకంతోనే ‘ఈగ’ను పర్‌ఫెక్ట్‌గా తయారు చేసి థియేటర్లలో వదిలారు. ఇప్పుడు ఇక ‘ఈగ’ల సీజన్ మొదలైంది. ఇక నుంచి జూలైలో సినిమా వస్తే అది ‘ఈగ’ సీజన్‌గా అందరూ అనుకునేలా ఈ సినిమాకు బ్రహ్మాండమైన ప్రారంభ వసూళ్లు వచ్చాయి. రానున్న రోజుల్లో కూడా కలెక్షన్లపరంగా ‘ఈగ’ అగ్రహీరోల సినిమాలకు ధీటుగా దూసుకుపోతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.
| |
|
![]() |
|