
రైతుల ఆత్మహత్య లాంటి సీరియస్ వ్యవహారాన్ని మీడియా రేటింగ్ పెంచుకోవడానికి ఎలా ఉపయోగించుకుంటుందో అనుభవమైంది ఓ జర్నలిస్ట్‌కు. రైతు ఆత్మహత్య, మీడియా వ్యవహారానికి వ్యంగ్యమైన టచ్‌తో స్టోరీ లైన్ రాసుకుంది. డెవలప్ చేసి సినిమా స్క్రిప్ట్‌గా మలచుకుంది. ఎక్కడో ప్రెస్‌మీట్‌లో ఆమీర్‌ఖాన్ కలిశాడు. తనను పరిచయం చేసుకుంది. ఆయన ఇచ్చిన రెండు నిమిషాల టైమ్‌లో గబగబా ఆ స్టోరీ లైన్ చెప్పింది. హడావిడిలోవిన్నా ఆ స్టోరీ నచ్చింది ఆమీర్‌కు. తన మెయిల్ ఐడీ ఇచ్చి వివరాలను మెయిల్ చేయమన్నాడు. తను రాసుకున్న కథను ఆమిర్‌కు మెయిల్ చేసింది. జర్నలిస్ట్ స్టోరీని ఆమిర్ చదివాడు. నచ్చింది. వెంటనే రిప్లయ్ చేశాడు ఇంకొంచెం డెవలప్ చేయమని. ఆ మెయిల్ చూసుకున్న జర్నలిస్ట్ ఉత్సాహపడింది. బాగా డెవలప్ చేసి మళ్లీ మెయిల్ చేసింది. ఆమీర్‌కు ఆ స్టోరీ బాగా నచ్చింది. వెంటనే ఆ జర్నలిస్ట్ నంబర్ కనుక్కొని ఫోన్ చేశాడు. ఆ కథతో తను సినిమా తీయడానికి రెడీ అని. ఎగిరి గంతేసింది విలేఖరి.‘పీప్లీ లైవ్’గా తెరకెక్కింది. ప్రేక్షకుల్లో ఎలైవ్‌గా ఉండిపోయింది! ఆ జర్నలిస్ట్ డైరెక్టరే అనూష రిజ్వి! ముప్పయ్ నిండని ముదిత. రైతుల ఆత్మహత్యలు లాంటి సీరియస్ సబ్జెక్ట్‌కు హద్దులు దాటని వ్యంగ్యంతో మీడియా వ్యవహారాన్ని జోడించింది. ఆ హాస్యంతో ఓ వైపు గిలిగింతలు పెడుతూనే ఇంకోవైపు మనసును ఆర్ద్రం చేసి కంటనీరు పెట్టించింది అనూష. ఏమాత్రం శృతి మించినా అభాసు పాలయ్యే వ్యవహారం. కానీ సున్నితంగా డీల్ చేసి శభాష్ అనిపించుకుంది. ఇక్కడ ఒక పీప్లిలైవ్, ఒక్క అనూష రిజ్వే గురించే కాదు....అలాంటి లేడీ ఇంకెంతమందో డైరెక్టర్స్, వాళ్లు తీసిన సినిమాల గురించిన వివరం ఇది!
కమర్షియల్ సినిమాను డీల్ చేసిన మగధీరులు చాలామందే ఉన్నారు మన ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో! న్యూవేవ్ సినిమాతోనే కెరీర్ ఆరంభించిన అతివలు అతికొద్దిమందే! మెగా ఫోన్ పట్టుకోవడం పట్టుకోవడమే ఆర్ట్ సినిమాతో అంటే అంత ఈజీ కాదు. పగ, ప్రతీకారాలు, ఫైట్లతో అలసిపోయిన హీరోను చెట్లు, పుట్టల వెంట పరుగెత్తిస్తూ అలసట తీర్చే భూమికను హీరోయిన్‌గా చూపిస్తున్న పురుషాధిపత్య సినిమా లోకంలో మహిళలు ఆర్ట్ సినిమా డైరెక్టర్లుగా కెమెరాను డీల్ చేయడం యాక్షన్ అండ్ కట్ చెప్పినంత తేలిక కాదు. అందునా న్యూవేవ్ సినిమాకు ఓ వేను ఏర్పర్చిన సత్యజిత్ రే, రిత్విక్ ఘటక్, మృణాల్ సేన్, బిమల్ రాయ్, వి.శాంతారాం, చేతన్ ఆనంద్, శ్యామ్‌బెనెగల్, ఖ్వాజా అహ్మద్ అబ్బాస్ లాంటి మహామహులను మరిపించేలా ఆడవాళ్లు ఆర్ట్ సినిమాలు తీయడం సాహసమే!
కానీ....
ఆ సాహసాన్ని అవలీలగా చేసి చూపించారు అపర్ణాసేన్, సాయి పరాంజపే, కల్పనాలాజ్మీ, మీరానాయర్, దీపామెహతా, లీనా యాదవ్, గీతాంజలి రావు, మేఘనా గుల్జార్, నిన్నమొన్నటి రేవతి, అనూష రిజ్వి..తాజాగా కిరణ్ రావు! సినిమారంగంలో ఆడవాళ్లకు అపూర్వ గౌరవాన్ని తెచ్చారు వీళ్లు. మహిళల సమస్యలను డీల్ చేయడమంటే కుట్లు అల్లికలతో స్వయం ఉపాధి చూపించడం, ప్లక్కార్డులు పట్టుకుని ధర్నాల్లో బైఠాయించడం కాదు ...ఏ సౌండ్ ఎఫెక్ట్‌లేకుండా ఫ్రేములతో సైలెంట్‌గా మహిళలను చైతన్యవంతులను చేయడమని నిరూపించారు. సతీసహగమనం దురాచారం నుంచి మధ్యతరగతి స్త్రీ వైవాహిక సమస్యలు, వివాహేతర ప్రేమలు, మహిళ మనోవాంఛలు చివరకు లెస్బియనిజం లాంటి సున్నితమైన అంశాల దాకా అన్నిటినీ అతి సుతారంగా తడిమారు. వీళ్ల దృష్టికోణంతో తెరకెక్కిన ప్రతి మూవీ ఇంటపూక్చువల్ చర్చకు తెర తీసింది. ప్రపంచ సినీ వేదికల మీద పండితులను మైమరపించింది.
నిజానికి...
మహిళా డైరెక్టర్ల మూవ్‌మెంట్ అపర్ణాసేన్‌తో ఆరంభం కాలేదు. 1920ల్లో ఫాతిమా బేగంతోనే మొదలైంది. ఫాతిమా ముందు ఉర్దూ రంగస్థలం మీద నటనకు శ్రీకారం చుట్టింది. ‘వీర్ అభిమన్యు’తో సినిమా ప్రవేశం చేసింది. తర్వాత ఫాతిమా ఫిల్మ్స్ పేరుతో నిర్మాణరంగంలోకీ దిగింది. ‘బుల్‌బుల్ - ఎ - పాకిస్థాన్’తో భారతీయ తొలి మహిళా దర్శకురాలిగా కెమెరా లెన్స్ సరిచేసుకుంది. అది ఆర్ట్ సినిమానా, కమర్షియల్ మూవీనా అనే మీమాంస పక్కన పెడితే ఏ సినిమాకైనా మహిళలకు మార్గదర్శకురాలిగా నిలిచింది మాత్రం ఫాతిమానే!
న్యూవేవ్ సినిమాకొస్తే....
ఆద్యురాలిగా అపర్ణాసేన్‌దే నేమ్‌కార్డ్. ‘ఈ బెంగాలీ వనిత సినిమారంగానికే కాదు ప్రతి ఆధునిక మహిళకూ ఆదర్శమే. ప్రతి మహిళా అపర్ణాసేన్‌లో తనను చూసుకుంటుంది ’ అని రామ్‌కమల్ ముఖర్జీ ప్రస్తుతించారంటే అపర్ణాసేన్ మార్క్ ఎట్లాంటిదో అవగతం అవుతుంది. తండ్రి చిదానంద గుప్తా నుంచి రీల్ వారసత్వాన్ని అందుకున్న అపర్ణా నటనతో తన కెరీర్‌కు క్లాప్ కొట్టించుకుంది. అంతకుముందే 1961లో ఫోటోక్షిగాఫర్ బ్రియాన్ బ్రెక్ ‘మాన్‌సూన్ సిరీస్’ ఫొటో షూట్‌కు మోడల్‌గా పనిచేసింది. అదే యేడు, సత్యజిత్ రే తీసిన ‘తీన్‌కన్యా’ సినిమాలో మృణ్మయిగా తొలిసారి కెమెరా ముందుకు వచ్చింది. 1981లో మొదటిసారిగా ‘36 ఛౌరంఘీలేన్’కు స్క్రీన్ ప్లేతో డైరెక్టర్‌గా కెమెరా వెనక నిలబడింది. వయసు పైబడిన ఓ ఆంగ్లో ఇండియన్ మహిళా టీచర్ గాథను ‘36 ఛౌరంఘీలేన్’లోతెరకెక్కించిన వైనం అద్భుతం. ఆ సినిమాతో అపర్ణ టాక్ ఆఫ్ ది సినిమాగా మారింది. ఈ సినిమా మనీలా ఇంటర్నేనషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో గ్రాండ్ ప్రిక్స్ అవార్డును సాధించింది. పరోమా, సతి, యుగాంత్ వంటి సినిమాల్లో ఆధునిక భారతంలో మహిళ ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితులను చర్చించింది. తర్వాత 2000లో వచ్చిన ‘ఏక్ దిన్’ 36 చౌరంఘీలేన్ విజయానుభవాన్ని పంచింది. విడాకులు తీసుకున్న ఓ స్త్రీకి, ఆమె అత్తకు మధ్య ఉన్న అనుబంధ దృశ్యమే ‘ఏక్ దిన్’. ఎన్నో అంతర్జాతీయ సినిమా ఉత్సవాల్లో అవార్డులను పండించింది.
మిస్టర్ అండ్ మిసెస్ అయ్యర్...
ఓ జర్నీలో ప్రేమ కథ. తీవ్రవాదం అల్లర్లలో అల్లాడిపోతుంది. మెత్తని ప్రేమకు కటువైన ఉగ్రవాదాన్ని సున్నితంగా అల్లిన అపర్ణ తీరు అద్భుతం. పెళ్లయి, ఓ బిడ్డకు తల్లయిన తమిళ బ్రాహ్మణ అమ్మాయి పెళ్లికాని ఓ ముస్లిం కుర్రాడితో డార్జిలింగ్ నుంచి కోల్‌కత్తా దాకా ప్రయాణించడమే అసలు కథ. ఆ దారిలో ఎన్నో అడ్డంకులు, భయాలు ఆ ఇద్దరి అపరిచుతుల మధ్య ప్రేమ చిగురించడాలు..పతి దృశ్యం శృతిమించని వైనమే. హింసను కత్తులు, కటార్లు, నెత్తుటి మడుగులు, తుపాకుల చప్పుళ్లతో కాదు.....మనసును కదిలించే లాంగ్ షాట్లతో కూడా చూపించవచ్చు అని నిరూపించింది అపర్ణ. పెళ్లయ్యాక వేరే వ్యక్తితో కలిగే ప్రేమనూ అంతే హృద్యంగా తెరకెక్కించింది. ప్రేమకు సామాజిక కోణాన్ని గురిపెట్టి నాజూకైన ఫ్రేములతో మనసును మెత్తగా స్పృశించేలా సృజించింది మిస్టర్ అండ్ మిసెస్ అయ్యర్‌ను. అందుకే అదో సంచలనం అయింది. అపర్ణాసేన్‌కు సెల్యులాయిడ్ మీద పర్మినెంట్ నేమ్‌కార్డ్ పడేలా చేసింది! తర్వాత అపర్ణా కెమెరా యాంగిల్‌ను ఎక్కుపెట్టి తీసిన స్క్రీజో ఫీనియా మెయిన్ ఎలిమెంట్‌గా ‘15 పార్క్ ఎవెన్యూ’, రాహుల్ బోస్ హీరోగా ‘జపనీస్ వైఫ్’ అన్నీ విమెన్ ఓరియెంటెడ్ చిత్రాలే! అపర్ణా ప్రత్యేక పంథాను చాటిన అద్భుతాలే!
సాయి పరాంజపే...
80ల్లోనే సిల్వర్ స్క్రీన్ మీద కనిపించిన మరో మహిళా దర్శకురాలి పేరు! ఈమె థీమ్‌లు మధ్యతరగతి కుటుంబాలు! బలమైన కథ, సున్నితమైన హాస్యం, చిత్రీకరణలో భావుకత...ఇవీ సాయి పరాంజపే ప్రత్యేకతలు. కథ, దిశ, స్పర్శ్, చష్మేబద్దూర్ నుంచి సాజ్ దాకా ప్రతీ సినిమాలో కనిపిస్తాయి. అందుకే సాయి తీరు న్యూవేవ్ అయినా ఇంటపూక్చువల్స్‌నే కాదు సామాన్యులనూ అలరిస్తాయి. ప్రేక్షకుల అభిరుచికి రిచ్‌నెస్‌ను ఆపాదిస్తాయి. తాను తీసుకున్నవన్నీ సీరియస్ అంశాలే కానీ గంభీరమై డైలాగులు ఉండవ్. సామాన్యుల జీవితాల్లోని కన్వర్‌జేషన్సే కనిపిస్తాయి. సాయి సినిమాల్లోని ప్రతి పాత్రలో ప్రేక్షకుడు తనను చూసుకుంటాడు. దీనికి జగిత్యాల బీడీ కార్మికుల మీద ఆమె తీసిన ‘దిశ’నే మంచి ఉదాహరణ. ఓ ఫిల్మ్‌మేకర్‌కు ఇంతకన్నా గొప్ప విజయం ఉంటుందా? అలాగే ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాసం గల ఓ అంధుడి కథతో తెరకెక్కించిన ‘స్పర్శ్’ ఆమె పర్‌సెప్షన్‌కు ప్రతీక. ఆత్మవిశ్వాసానికి అంధత్వం ఓ అవకరమే కాదని చూపిన సినిమా అది. ఇలాంటి క్లిష్టమైన సబ్జెక్ట్‌ను పేరున్న ఏ కమర్షియల్ మేల్ డైరెక్టరూ ఇంత బాగా డీల్ చేయడేమో అనిపించిన దృశ్యకావ్యం స్పర్ష్. అందుకే అవార్డులు, రివార్డులు ఆమెను ముంచెత్తాయి. దటీజ్ సాయి పరాంజపే!
కల్పనాలాజ్మీ....
గురుదత్ మేనకోడలు, శ్యామ్‌బెనెగల్‌కూ చుట్టము. కానీ ఈ ఇద్దరి ఇన్‌ఫ్లుయెన్సులు లేకుండా సొంత ఫ్రేమ్‌ను ఫిక్స్ చేసుకున్న గొప్ప దర్శకురాలు . శ్యామ్‌బెనెగల్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా రీల్ లైఫ్‌మొదలుపెట్టిన కల్పనా ‘ఏక్ పల్’ సినిమాతో డైరెక్టర్‌గా మారింది. తానే నిర్మించిన ఈ సినిమాకు గుల్జార్‌తో కలిసి స్క్రీన్ ప్లే కూడా సమకూర్చుకుంది. మొదటి సినిమాతోనే పనిమంతురాలుగా పేరుతెచ్చుకుంది. కథ మహాశ్వేతాదేవిదే అయినా రుడాలి కల్పనా రేపిన సంచలనం. ఈ సినిమా డింపుల్ కపాడియకు జాతీయ అవార్డును తెచ్చిపెట్టింది. తర్వాత ఈమె తీసిన దర్మియా (1997), దామన్‌లూ మంచి చిత్రాలుగా ముద్రపడ్డాయి. లో బడ్జెట్, వాస్తవికత..ఇవే కల్పనాలాజ్మీ ప్రత్యేకతలు. ఈ మార్క్‌తోనే ఇంటర్నేషనల్ ఫేమ్‌ను తన అడ్రస్‌గా మార్చుకుంది.
దీపా మెహతా...
ఓ సంచలనం! లెస్బియనిజాన్నీ తన సినిమాకు కథగా చేసుకునే గట్స్ ఉన్న ది వన్ అండ్ ఓన్లీ (ఉమన్)డైక్టర్! పంచభూతాల్లోని నిప్పు, నీరు, భూమి మీద సినిమాలను తీసి తానే ఓ చర్చగా మారిన ధీర వనిత. మొదట్లో డాక్యేమెంటరీస్‌తో కెరీర్ స్టార్ట్ చేసిన దీపా చిన్న పిల్లల సినిమాకు స్క్రీన్ రైటర్‌గా సినిమా ఎంట్రీ తీసుకుంది. 1991లో సామ్ అండ్ మీతో డైరెక్టర్‌గా మారింది. ఈ సినిమా ఆయేడు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో కెమెరా డి ఓర్ అవార్డును గెల్చుకుంది. ‘ది రిపబ్లిక్ ఆఫ్ లవ్’ , ‘హె ఆన్ ఎర్త్’ లాంటి ఎన్నో ఇంగ్లీష్ సినిమాలకూ దర్శకత్వ బాధ్యతలు వహించింది.
మీరానాయర్...
సలాం బాంబేను తన పేరుగా స్థిరపర్చుకున్న రియల్ డైరెక్టర్! ముంబై స్లమ్‌నే తన తొలి సినిమాకు సబ్జెక్ట్‌గా చేసుకుంది మీరానాయర్. వీధి బాలల మీద వచ్చిన ఈ హృద్య చిత్రం అంతర్జాతీయ సినిమా డయాస్ మీద మహిళా దర్శకుల సత్తా చాటింది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో గోల్డెన్ కెమెరా అవార్డును గెల్చుకుంది. ఈ సినిమా తర్వాత ఆమె వీధి బాలల కోసం సలాం బాలక్ ట్రస్ట్‌ను కూడా ఏర్పాటు చేసింది. తర్వాత మిసిసిప్పి మసాలా, మాన్‌సూన్ వెడ్డింగ్, కామసూత్ర, వానిటీ ఫైర్, ది నేమ్ సేక్ లాంటి సినిమాలు మీరానాయర్‌కు విమర్శలు, ప్రశంసలను ఇవ్వడమే కాదు ఆయా విషయాల మీద కొత్త చర్చకు నాంది పలికాయి. వీటిలో రేఖతో తీసిన కామసూత్ర దేశంలో పెద్ద సంచలనాన్నే సృష్టించింది. సిల్వర్ స్క్రీన్ మీద తన సేవలకు ఈ లేడీకి పద్మ భూషణ్ లాంటి జాతీయ పురస్కారాలతో పాటు ఎన్నో అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి.
వీళ్ల తర్వాత వచ్చిన లీనా యాదవ్, మేఘనా గుల్జార్(రాఖి, గుల్జార్ల కూతురు)లూ న్యూవేవ్ సినిమాలో తమ స్టయిల్‌ను రికార్డు చేసుకున్నారు. లీనా యాదవ్ తీసిన తీన్ పత్తా ఆమెను సత్తా ఉన్న దర్శకురాలిగా నిలిపింది. తనూజా చంద్ర ‘సుర్’, పూజా భట్ ‘జక్మ్’సినిమాలు కమర్షియల్ హిట్లు కొట్టకపోయినా...ఆ మహిళలను స్టఫ్ ఉన్న దర్శకురాళ్లుగా నిలబెట్టాయి. కిరణ్‌రావు విషయానికి వస్తే...లగాన్ లాంటి సినిమాతో అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఫీల్డ్‌లోకి వచ్చి తాను రాసుకున్న ముంబై డైరీని దోభీఘాట్‌గా తెరకెక్కించింది. అతిగా ఎనాలసిస్ చేయకుండా తాను ముంబై వచ్చిన తొలినాళ్లలో ఆ నగరాన్ని చూసింది చూసినట్టు చిత్రీకరించిన కిరణ్ తీరు భేష్! ఆమీర్ దర్శకత్వం వహించిన తారే జమీన్ పర్ సినిమాకు కిరణే కీలక పాత్ర పోషించింది. ఏమైనా మొదటి సినిమాతోనే కిరణ్ మంచి పర్‌సెప్షన్ ఉన్న దర్శకురాలిగా క్రిటిక్స్ మెరిట్స్‌ను కొట్టేసింది. న్యూవేవ్ ఈతరం మహిళా నిర్దేశకుల్లో దక్షిణాదికి చెందిన ఒకప్పటి నటి రేవతి కూడా ప్లేస్ తీసుకుంది. ఆమె తీసింది ‘మిత్ మై ఫ్రెండ్’ సినిమా ఒకటే అయినా...మంచి ఫామ్ ఉన్న డైరెక్టర్‌గా అందరి దృష్టినీ ఆకర్షించింది. షార్ట్ ఫిల్మ్స్ లిస్ట్‌లో గీతాంజలీ రావు, షొనాలీ బోస్‌లాంటి వాళ్లున్నారు.
రైజింగ్ ఫరెవర్...
స్త్రీలను స్త్రీలే అర్థం చేసుకుంటారు అనడానికి ఈ మహిళా దర్శకులే నిదర్శనం. సినిమాను నడిపించే నిర్దేశకులుగా తెర వెనుక గొప్ప భూమికను పోషిస్తూ....తెర మీదా అబలను సబలగా....ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా....అసామాన్య స్త్రీగా చూపిస్తూ మహిళలందరికీ ప్రేరణగా నిలుస్తున్నారు. కమర్షియల్ మేల్ డైరెక్టర్లకు, వాళ్ల సినిమాల్లోని స్త్రీ పాత్ర చిత్రీకరణకు సవాల్ విసురుతున్నారు. ప్రేక్షకులూ ఆ మూసలోంచి బయటకు రావడానికి కొత్త ప్రయోగాలకు బయోస్కోప్‌ను డయాస్‌గా మార్చుకుంటున్నారు. అపర్ణాసేన్ దగ్గరి నుంచి అనూష రిజ్వి దాకా న్యూవేవ్ సినిమాకు న్యూ హోప్స్! ఔత్సాహిక మహిళా దర్శకులకు న్యూ వేవ్‌ను ఏర్పర్చిన నిర్దేశకులు!
| |
|
![]() |
|