సింహా.. రచ్చ.. దమ్ము.. గబ్బర్‌సింగ్.. ఇవి టాలీవుడ్ సినిమాలు!
వాంటెడ్, దబాంగ్, రెడీ, బాడీగార్డ్, సింగమ్, రౌడీ రాథోడ్.. ఇవి బాలీవుడ్ సినిమాలు!
టాలీవుడ్, బాలీవుడ్‌కు చెందిన ఈ సినిమాలన్నింటి మధ్య ఉన్న కామన్ లక్షణం ఏంటో తెలుసా? అన్నీ మాస్ సినిమాలు. ఇవి సగటు ప్రేక్షకునిలో కొత్త ఉత్తేజాన్ని నింపాయి. ఉద్వేగంతో ఊగిపోయేలా చేశాయి. తెరపై హీరో చేసే యాక్షన్‌కు చప్పట్లు చరిచేలా చేశాయి. ఈలలు వేసేలా చేశాయి. మాస్ సినిమాలకు మళ్లీ ప్రాణం పోశాయి.
భారతీయ సినీ ప్రపంచంలో మాస్ సినిమాలది ఓ ప్రత్యేక శైలి! నిర్మాతకు కనక వర్షాన్ని, ఎగ్జిబిటర్లకు లాభాల్ని, దర్శకుడికి క్రేజ్‌ని, హీరోకు సూపర్‌స్టార్ హోదాని... మొత్తంగా సినిమాకు సూపర్‌హిట్‌నీ అందించగలిగిన వన్ అండ్ ఓన్లీ సినిమా ‘మాస్ సినిమా’!
న్యూ మిలీనియంలోని తొలి సంవత్సరం అంటే దాదాపు 2001 నుంచి ఇటు టాలీవుడ్‌లోనూ, అటు బాలీవుడ్‌లోనూ తెరమరుగైపోయిన ‘మాస్ సినిమా’ ఇప్పుడు రెట్టించిన శక్తితో, ద్విగుణీకృత ఉత్సాహంతో వెండితెరపై దూకింది. ఇంతకాలం చప్పగానూ, కాసిన్ని నవ్వులతోనూ నిండిపోయిన థియేటర్లను హై వోల్టెజ్ ఎనర్జీతో ఎగిరిపడేలా చేశాయి. ఈలలతో, గోలలతో థియేటర్లు దద్దరిల్లేలా చేశాయి. ఇటీవలే సింహా, రచ్చ, గబ్బర్‌సింగ్ సినిమాలు టాలీవుడ్‌లో, సింగమ్, రౌడీరాథోడ్ సినిమాలు బాలీవుడ్‌లో సృష్టించిన సంచలనాల సునామీయే ‘మాస్ సినిమా’ మళ్లీ మన వెండితెరపై ప్రత్యక్షమైందని చెప్పడానికి తెర ఎత్తు సాక్ష్యం.
‘మాస్ సినిమా’ మూలాలు
నిజానికి సృజనాత్మక కళారూపాలన్నింటి లక్ష్యమూ మనిషిలో నిద్రాణంగా ఉన్న భావోద్వేగాలను తట్టిలేపడమే. అయితే ఒక్కో కళారూపానికి దానికి ఉండే పరిమితుల దృష్ట్యా ప్రజల అంతర్గత భావ సంచలనాలను రేకిత్తించడంలో తేడాలున్నాయి. అయితే సినిమా కంటే సంపూర్ణ కళారూపానికి మనిషిలోని ఎమోషన్స్ కాక, అవసరమైతే ‘అవూడినలిన్’వంటి వినాళ రసాయనాలను సైతం ‘యాక్టివేట్’ చేయించేంత శక్తి ఉందని ఎన్నో మనోవైజ్ఞానిక పరిశోధనలలో రుజువయ్యింది. అందుకే అంతరాలకు అతీతంగా కోట్లాది ప్రజలకు సినిమాలంటే మక్కువ ఉంటోంది. ప్రేక్షకుల భావోద్దీపనను టాప్‌రేంజ్‌కి తీసుకెళ్లగలిగే శక్తి ఉన్న సినిమాలు ‘మాస్ సినిమాలు’గా ఉన్నాయి. అయితే ఇప్పుడు అంటున్న మాస్ సినిమాలకు మూలాలు ఎక్కుడున్నాయని లోతుగా పరిశీలిస్తే.. అవి మన ప్రాచీన ఇతిహాసాలలోనే ఉన్నాయని అర్థమవుతుంది. ప్రపంచంలోని ఆయా జాతులు - దేశాల ఉమ్మడి వారసత్వ సంపదగా ఉంటున్న ఆయా దేశాల ఇతిహాసాలే ఈ మాస్ కథలకు కేరాఫ్ అడ్రస్ అనుకోవచ్చు.
గ్రీక్ సాహిత్యంలోని ఇలియడ్, ఒడిస్సీ ఇతిహాసాలు, వాటిలోని ట్రోజన్ హార్స్, ట్రాయ్ వంటి కథలు, అరేబియన్ నైట్స్ కథలు, చైనీయుల ‘ఆర్ట్ ఆఫ్ వార్’ కథలు అన్నీ జానపథ గాథలుగా, ఐతిహాసిక కథలుగా మాస్ ఎలిమెంట్స్‌ని కలిగి ఉన్నాయని చెప్పాలి. మనదేశం విషయానికొస్తే.. రామాయణం, మహాభారతాలను మించిన మాస్‌కథలు ఉండేవేమో అనిపిస్తుంది. దానికి తగినట్లే మన భారతీయ సినిమాలలోని 70శాతం కథలకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఈ రామాయణ, మహాభారతాలే ఆధారం, స్ఫూర్తి. ఉదాహరణకు ‘షోలే’సినిమాలో రామాయణంలోని విశ్వామిత్ర యజ్ఞం, రామలక్ష్మణులచే రక్షణ, స్వీతాస్వయంవర ఘట్టాలే మూలం కదా! అలాగే హమ్, సమరసింహాడ్డి, ఇంద్ర, నరసింహనాయుడు లాంటి ఎన్నో సినిమాలకి మహాభారతంలోని విరాటపర్వంలో వచ్చే పాండవుల అజ్ఞాతవాసం ఘట్టాలే మూలం. ఇంకా చెప్పాలంటే.. అసలు శకునిని మించిన ‘అండర్ కవర్ కాప్’(పోకిరి - వాంటెడ్ కథాంశం అదేగా) ఇంకెవరైనా ఉంటారా?
‘మాస్ సినిమా’ల ప్రస్థానం
నాగరికత, ఆధునికత ఎంత పెరుగుతున్నా, మాస్ సినిమాలు ఆయా కాలాలు, తరాలలో ఆయా రూపాలలో దర్శనమిచ్చాయని చెప్పాలి. పౌరాణిక చిత్రాలు నడుస్తున్న కాలంలో జానపద చిత్రాలు మాస్ చిత్రాలే! ఇవి కథ, పాత్రలు, సన్నివేశాలు, ఆఖరికి సంగీతం, పాటలు అన్నీ సగటు ప్రేక్షకుడికి కావలసిన వినోదాన్ని అందించే లక్ష్యంతోనే ఉండేవి తప్ప లాజిక్‌లు, ‘క్షేమేంవూదుని ఔచిత్య నియమం’ పరిధిలో ఉండేవి కావు. అందుకే మాస్ పబ్లిక్ పల్స్‌ని పరుగుపూత్తించే సినిమాలే మాస్ సినిమాలుగా గుర్తింపు పొందడమే కాక, కలెక్షన్ల వేటలో సైతం అవే మొదటి స్థానంలో నిలిచాయి.
ఆ లెక్కన హాలీవుడ్ సినిమాలను గమనిస్తే.. అక్కడి సూపర్ హీరో సినిమాలన్నీ మాస్ సినిమాలనే చెప్పాలి. ఎందుకంటే హాలీవుడ్ సినిమాలలో ‘స్పెషలైజేషన్’ ఓ ముఖ్యాంశం. అంతేకాక సినిమా కథల్లో డ్రామా ఉన్నప్పటికీ ‘వాస్తవికత’ సూత్రం ఆధారంగానే నిర్మింపబడతాయి. అంతే తప్ప ‘మాస్ బేస్’ ఉండదు. ఆ లోటును భర్తీ చేస్తూ అక్కడి సూపర్ మేన్, స్పైడర్ మ్యాన్, బ్యాట్‌మ్యాన్, సూపర్ గర్ల్, జేమ్స్‌బాండ్ వంటి సినిమాలు వచ్చాయి. మాస్ సినిమాలుగా అవి కేవలం హాలీవుడ్‌కే కాక, ప్రపంచ వ్యాప్తంగా విస్తరించాయి. ఇక బాలీవుడ్‌లో మాస్ సినిమాల ప్రస్థానం జంజీర్, దీవార్, షోలే సినిమాల ఆగమనంతో బలపడిందని చెప్పాలి. అంతకుముందు వచ్చిన సినిమాలలో ‘మాస్ ఎలిమెంట్స్’ ఉన్నప్పటికీ, అవన్నీ ఫ్యామిలీ డ్రామా, సోషల్ రియాలిటీల ముందు అంతగా హైలైట్ అవలేదు. కానీ ‘జంజీర్’ నుంచి బాలీవుడ్‌లో మాస్ సినిమాల విజృంభణ మొదలై ఆ తర్వాత అమితాబ్, ధర్మేంవూదలతో దూసుకెళ్లి ఇప్పుడు అక్షయ్‌కుమార్, అజయ్‌దేవగన్, హృతిక్‌రోషన్‌లతో టాప్ రేంజికి చేరుకున్నాయి. ఇక సల్మాన్‌ఖాన్ అయితే ఇప్పుడు ‘మాస్ సినిమాల రారాజు’! అయితే బాలీవుడ్‌లో ఈ ట్రెండ్ మళ్లీ ఇటీవలే ఊపందుకొన్నదని చెప్పాలి.
అగ్నిపథ్, బాడీగార్డ్, సింగమ్, రౌడీ రాథోడ్ వంటి మాస్ యాక్షన్ సినిమాలు 100కోట్ల కలెక్షన్లను దాటడం, దేశ వ్యాప్తంగా ఈ సినిమాలకు విపరీతమైన ప్రేక్షాకాదరణ ఏర్పడటంతో ఇప్పుడు మాస్ సినిమాల శకం మళ్లీ మొదలైంది. అయితే బాలీవుడ్‌లో 2వేల నుంచి ఇటీవలి వరకూ కామెడీలు, యాక్షన్ కామెడీలు, ఫ్యామిలీ డ్రామాలే రాజ్యం ఏలాయి. ప్రస్తుతం ‘రౌడీ రాథోడ్’ ఇచ్చిన ఊపులో మరిన్ని మాస్ మసాలా సినిమాలు త్వరలో బాలీవుడ్‌లో దుమ్ము రేపనున్నాయి.
ప్రాంతీయ సినిమాల సంగతి?
అసలు మొదట్నించీ మాస్ సినిమాలకు మహారాజ పోషకులు దక్షిణాది సినీ ప్రేక్షకులే అని చెప్పాలి. కోలీవుడ్ విషయానికొస్తే.. అక్కడ మాస్ సినిమాల వెల్లువ ఎంజీఆర్, శివాజీగణేషన్‌లతో మొదలై రజనీకాంత్, కమల్‌హాసన్‌లతో శిఖరస్థాయిని చేరుకుంది. తర్వాతి తరంలో విక్రమ్, సూర్య, విజయ్, ధనుష్ వంటి హీరోలతో మాస్ సినిమా కొత్త పుంతలు తొక్కింది. వీరందరిలోనూ రజనీకాంత్ ‘మాస్ సూపర్ స్టార్’గా ప్రేక్షకుల హృదయాల్లో మరెవరూ చేరుకోనంత స్థానాన్ని సాధించారు. ఇక టాలీవుడ్‌లో ఎన్టీఆర్, అక్కినేనిల కాలంలోనే మాస్ సినిమాలకు, మాస్ హీరోయిజంకు బీజాలు పడ్డాయి. ‘పాతాళ భైరవి’తొలి మాస్ సినిమాగా, ఎన్‌టీఆర్ మాస్ హీరోగా గుర్తింపు పొందారు. కాగా తెలుగులో మాస్ సినిమాలకు స్వర్ణయుగం ‘అడవిరాముడు’తో శ్రీకారం చుట్టుకొని చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంక సినిమాలతో ఉన్నత స్థానానికి చేరింది. ఈ తరంలో ఎన్‌టీఆర్, మహేష్‌బాబు, పవన్‌కల్యాణ్, రామ్‌చరణ్, అల్లు అర్జున్‌లతో మాస్ సినిమా పరాకాష్ఠకు చేరుకుంది.
‘సాండల్‌వుడ్’(కర్ణాటక)లో రాజ్‌కుమార్‌తో మొదలైన మాస్ సినీ ప్రస్థానం, రవీంవూదన్, విష్ణువర్థన్, అంబరీష్, ఉపేంద్ర, పునీత్, రాజ్‌కుమార్‌లతో ఇప్పుడు ఓ అనివార్య అంతర్భాగంగా మారింది. మేధోవూపేక్షకులు అత్యధికంగా ఉన్న బెంగాల్‌లో సైతం 2001 నుంచి మాస్ సినిమాల ప్రభంజనం ఊపందుకుంది. ప్రసేన్‌జిత్ ఆగమనంతో ఇప్పుడు అక్కడ సత్యజిత్‌రే తరహా ఆర్ట్ సినిమాలు వెనక్కి వెళ్లి బాలీవుడ్ స్టైల్ మాస్ సినిమాలు ఊపందుకున్నాయి. ఇంకా చెప్పాలంటే.. ఇటీవలే ప్రసేన్‌జిత్ హీరోగా వచ్చిన ‘విక్షికమసింగ’(తెలుగు విక్రమార్కుడుకు రీమేక్)బెంగాల్ మొత్తం మీద అత్యధిక కలెక్షన్లు చేసిన చిత్రంగా రికార్డు సృష్టించింది.
ఇక మాలీవుడ్ (మలయాళ సినిమా)లో ఇప్పటికీ పూర్తిస్థాయి మాస్ సినిమా రూపుదిద్దుకోలేదని (అంటే బాలీవుడ్, టాలీవుడ్ తరహా)చెప్పాలి. మోహన్‌లాల్, మమ్ముట్టి, పృథ్వీరాజ్ వంటి హీరోలు ఏకకాలంలో మాస్, క్లాస్ రెండు రకాల సినిమాలను చేస్తూ ఉండటం వల్ల అక్కడ మాస్ సినిమాల సునామీ అంతగా లేదు.
ఏవి మాస్ ఎలిమెంట్స్?
-చెడుపైన మంచి విజయం సాధించడం మాస్ సినిమాల ప్రధాన సూత్రం.
-మాస్‌హీరో సాధారణంగా సామాన్యుడో లేక అణిచివేతకు గురవుతున్న ప్రజలలో ఒకడిగానో ఉంటాడు. లేదా ఓ అనాథ..తప్పిపోయిన కొడుకు లేదా అక్రమసంతానమై ఉంటాడు. ఏ బాదరబందీ లేకుండా బలాదూర్‌గా తిరిగే స్వేచ్ఛా పిపాసిగానైనా ఉంటాడు.
-సమాజంలోని అవినీతిని, కుళ్లును తట్టుకోలేక తనలో తానే మథనపడతాడు. మార్పు కోసం ఏమైనా చేయాలనుకుంటాడు. ‘ఛేంజ్ ఏజెంట్’లా, ‘యాంగ్రీ యంగ్ మ్యాన్’లా ఉంటాడు.
-సమాజం, వ్యవస్థ, వ్యక్తుల చేతిలో వ్యక్తిగత అన్యాయానికి గురై ఉంటాడు. లేదా సామాజిక వివక్షకు బాధితుడై ఉంటాడు.
-పగ, ప్రతీకారం తీర్చుకోవడం హీరో లక్ష్యం. ఆ ప్రతీకారానికి హీరోకు బలమైన కారణం ఉంటుంది.
-‘సంభవామి యుగే యుగే’ ఫిలాసఫీయే మాస్ హీరో చేష్టలకు ఆధారం. సమాజంలో అవినీతి, అక్రమాలు, అన్యాయాలు పెచ్చు మీరినప్పుడు సామాన్యులను రక్షించడానికి, సామాజిక శాంతిని స్థాపించడానికి మాస్‌హీరో వస్తాడు.
-మంచితనం, మానవత్వం, మల్లెలాంటి మనసు మాస్ హీరోకు పెట్టని ఆభరణాలు.
-మాస్ హీరోకి సెంటిమెంట్స్‌పై, అనుబంధాలపై నమ్మకం ఎక్కువ. తల్లితంవూడులను, భార్యపిల్లలను, స్నేహితులను రక్షించుకునే ‘ప్రొటెక్టివ్ నేచర్’అతనిది. సెంటిమెంట్స్‌నీ, అనుబంధాలనీ ఎవరైనా భగ్నం చేస్తే మాస్ హీరో ఉగ్రుడవుతాడు.
-మాస్ హీరోకి కండబలం, గుండెబలం, బుద్ధి బలం పెట్టని కోటలు.
-సాధారణంగా మాస్ హీరో అన్ని వర్గాల ప్రజలతో కలిసిపోయి, అందరికీ తలలో నాలుకలా ఉంటూ, సామాన్యుల కష్టాలే తన కష్టాలుగా భావించే ‘ఎంపథెటిక్ టెండెన్సీ’ని కలిగి ఉంటాడు. దగా పడిన ప్రజల పట్ల ‘సానుభూతి’ మాత్రమే కాదు, ‘సహానుభూతి’ కూడా ఎక్కువే.
-అల్లరి, అలవాట్లు, మాటతీరులో కఠినత్వం, బిహేవియర్‌లో రఫ్‌నెస్‌లాంటి ‘బండ’లక్షణాలున్నప్పటికీ మాస్‌హీరో మనసు మాత్రం వెన్నలాంటిది. వెన్నెలలాంటింది. బంగారం లాంటిది.
-తన వాళ్లకోసం ఎలాంటి త్యాగాన్ని అయినా చేయడానికి ‘ఎవర్ రెడీ’. తన కళ్లనీ, కిడ్నీని, ప్రాణాన్ని కూడా త్యాగం చేయడానికి వెనుకాడడు.
-సర్వమానవ సమానత్వ భావన మాస్‌హీరోకు పుట్టుకతో వచ్చే లక్షణం. అందుకే సంపన్నులను దోచుకొని పేద ప్రజలకు పంచుతాడు. అక్రమార్జనపరుల ఆస్తులను, డబ్బును కొట్టేసి ప్రజలకు మేలు చేసే ధర్మాసుపవూతులను, శరణాలయాలను, పాఠశాలలను నిర్మిస్తాడు.(రాబిన్‌హుడ్ స్టైల్ - జెంటిల్‌మేన్ స్టైల్)
-బలాలు - స్వయంకృషి, ఆత్మవిశ్వాసం, ధైర్యం, ఎందరినైనా ఉత్త చేతులతో మట్టి కరిపించగలిగే సామర్థ్యం. పథకం ప్రకారం పనిచేయగలిగే మేథస్సు.
-బలహీనతలు - రక్త సంబంధీకులు, జన్మనిచ్చిన తల్లితంవూడులు, కుటుంబం, తనని నమ్ముకున్న పేద సామాన్య ప్రజలు. (అందుకే క్లైమాక్స్‌లో విలన్ తన డెన్‌లో వీళ్లని బంధించి హీరోని ఆటాడిస్తాడు.)
-మాస్‌హీరో చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోవడానికి ఏ మాత్రం వెనుకాడడు. అవసరమైతే చట్టాన్ని ధిక్కరిస్తాడు, ప్రశ్నిస్తాడు. సవరించమని కోరతాడు. అలా అని చట్టానికి అతీతంగా ఉండడు. అదే సమయంలో చట్టంపై తన విధేయతని ప్రకటించి శిక్షను కూడా స్వీకరిస్తాడు.
-మాస్‌హీరో సకల కళావల్లభుడు. సకలశాస్త్ర పారంగతుడు. పాట పాడతాడు, బ్రేక్‌డ్యాన్స్ చేస్తాడు. ఆఖరికి విమానాన్ని కూడా నడుపుతాడు. (ఎప్పుడు నేర్చుకున్నాడని మాత్రం అడగొద్దు)
-సినిమా కథ కేంద్రం అంతా హీరోనే కనుక కథతో త్రీడీ ఆడుకుంటాడు. ఎ. కథను డామినేట్ చేస్తాడు. బి. కథలోని సన్నివేశాలను డ్రైవ్ చేస్తాడు. సి.కథలోని పాత్రలను ‘డైక్ట్’చేస్తాడు.
-మాస్‌హీరో శృంగారంలో ఎంతో నిగ్రహి. హీరోయిన్‌తో ఎన్ని పాటలు పాడినా, ఎన్ని స్టెప్పులు వేసినా కాలు జారడు. హీరోయిన్‌లకు నెల తప్పించడు. (అదే హీరో చెల్లెలు మాత్రం బలహీన క్షణంలో ఒక్కసారికే కాలు జారి నెల తప్పుతుంది)
-మాస్ సినిమాలలో లాజిక్‌లు, జస్టిఫికేషన్‌లు, మాస్‌హీరో చేష్టలలో ఔచిత్యాలు ప్రశ్నించకూడదు. అసలు ఆలోచించనే కూడదు. మాస్ సినిమాల లక్ష్యం ‘ఎంటర్‌టైన్’చేయడమే కానీ ‘ఎడ్యుకేట్’చేయడం కాదు.
-మాస్‌హీరో శ్రీరాముడి కన్నా ఎక్కువగా శ్రీకృష్ణుడికన్నా తక్కువగా ఉంటాడు.
-మాస్‌హీరో అనర్గళంగా మాట్లాడే మంచి వక్త, ఫైట్స్, యాక్షన్‌లో సాటిలేని వీరుడు. సింగిల్ హ్యాండ్‌తో వందలాది గూండాలను ఉతికి ఆరేస్తాడు. విచివూతమైన టార్గెట్‌లతో(కాలు నేల మీద ఆన్చకుండా కొట్టడం, బీడీ కాలే లోపు కొట్టడం)ఫైట్ చేస్తాడు.
కొసమెరుపు: ఐమ్యాక్స్‌లో రౌడీ రాథోడ్ సినిమాకి వెళ్లాను. సాధారణంగా మల్టీప్లెక్స్ ప్రేక్షకులు కామ్‌గా సినిమా చూస్తారు. కానీ తెరపై అక్షయ్‌కుమార్ మాస్ యాక్షన్‌కి థియేటర్‌లోని జనాలంతా ఈలలు, కేకలతో ‘బి సెంటర్’ థియేటర్‌ని గుర్తుకు తెచ్చారు. మాస్ సినిమా ప్రభావానికి మల్టీప్లెక్స్ మైండ్స్ కూడా అతీతం కాదని చెప్పడానికి ఇంతకన్నా ఎగ్జాంపుల్ ఏముంటుంది?
మామిడి హరికృష్ణ, 9701376302
| |
|
![]() |
|