నూరేళ్ల తెరపై తెలంగాణ ఆత్మ

RANGULAKALAప్రేమాభిషేకం...మైనర్ బాబు..శ్రీవారి ముచ్చట్లు... అత్తకు యముడు అమ్మాయికి మొగుడు..పెసిడెంటు గారి అబ్బాయి...ఇవి తెలుగు సినిమా టైటిల్స్! ఈ పేర్లలో, కథాంశాల్లో ఎక్కడా తెలంగాణ వినిపించదు, కనిపించదు. ఒక్క అక్షరాల్లో తప్ప! అంకుర్...మండి...నిషాంత్.. నిఖా...బజార్...సుస్మాన్! ఈ పేర్లలో తెలుగు లేదు. కానీ తెలంగాణ గోస ఉంది...భాష మనది కాదు...కానీ ఆత్మ మనదే! అదే పైన చిత్రాలకు, కింది పరభాషా సినిమాలకు ఉన్న తేడా! తెలుగుకి, తెలంగాణ సినిమాకు మధ్య వ్యత్యాసం! భారతీయ సినిమా నూరేళ్ల చరివూతలో ఆ తేడా అద్భుతాలు సృష్టించింది... వందేళ్ల సినీ ప్రయాణంలో ఆ వ్యత్యాసం గొప్ప మలుపులను చూపింది! ఇండియన్ సినిమా డ్రెడ్ ఇయర్స్ సెలవూబేషన్స్ సందర్భంగా ఫోకస్ చేయాల్సిన విషయాల గురించే ఈ రంగులకల...

సరిగ్గా నూరేళ్ల కిందట సినిమా అంటే తెలియని భారతదేశం ఈ వందేళ్లలో ఆ రంగంలో రెండవ అతిపెద్ద పరిక్షిశమగా ఎదగడం ఓ గొప్ప సక్సెస్! అయితే ‘ఇండియన్ సినిమా’ అనే బ్రాండ్ ఇమేజ్ ఏర్పడడం వెనుక దేశంలోని ప్రాంతీయ సినిమాలూ దోహదపడిన విషయాన్ని విస్మరించలేం. దేశంలోని విభిన్నతలు - వైరుధ్యాలలాగే మన సినిమారంగంలోని కథావస్తువులు, నేపథ్యాలు, భాషలు, జీవన శైలులు అన్నీ కలిసి భారతీయ సినిమాకు ఓ వెరైటీ నేపథ్యాన్ని ఇవ్వడమేకాక ప్రధాన స్థాయి (మెయిన్‌స్ట్రీమ్) సినిమాగా ఎదగడానికి సహకరించాయి. అంతర్జాతీయ స్థాయి కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెట్టాయి. అలా భారతీయ సినిమాకు జాతీయ అంతర్జాతీయ యవనికలపై ‘బ్రాండ్ ఇమేజ్’ తీసుకొచ్చిన సినిమాల్లో తెలంగాణ సినిమాలు, తెలంగాణ నేపథ్యంతో స్ఫూర్తి పొందిన సినిమాల పాత్రా తక్కువేమీ కాదు.

తెలంగాణ - ప్రత్యేక జీవనం
తొలి నుంచి తెలంగాణ భౌగోళికంగా, రాజకీయంగా, సంస్కృతి-సంవూపదాయాల పరంగా వైవిధ్యాన్ని, ప్రత్యేక ముద్రను కలిగి ఉంది . దక్కన్ పీఠభూమిలో కీలక ప్రాంతంగా ఉత్తరాది, దక్షిణాది సంస్కృతుల మధ్య సంధాన వారధిగా నిలిచింది తెలంగాణ . అయితే 1323 వరకు కాకతీయుల పాలనలో సమగ్ర సంస్కృతిని, భాషా సారస్వత కళావైభవాన్ని సాధించిన తెలంగాణ ప్రాంతం ఆ తర్వాత కుతుబ్‌షాహీల పాలనలో, నైజాం పాలనలో మిగతా తెలుగు ప్రాంతం కన్నా భిన్నమైన సామాజిక జీవనశైలులను సొంతం చేసుకుంది. ఈ ప్రత్యేక రాజకీయ పాలనా పరిస్థితులు తెలంగాణ గ్రామీణ జీవనవిధానాన్ని, మట్టి మనిషి అనుబంధాలను, కుటుంబ జీవన విలువలను విలక్షణ సంస్కృతిగా రూపొందించాయి. సాధారణంగా కళారూపాలన్నీ ఆయా ప్రాంతాల సాంస్కృతిక, సామాజిక జీవనానికి ప్రతిబింబంగా ఉన్నట్లుగానే తెలంగాణ నేపథ్యంతో వచ్చిన సినిమాలన్నీ ఇక్కడి ప్రత్యేక జీవన సంస్కృతులకు అద్దం పట్టాయి. మరోవైపు తెలంగాణ నేలపై పదఘట్టనలు చేసిన భూస్వామ్య విధానం, గడీల సంస్కృతి, సాధారణ ప్రజల సంబంధాలు వంటివి ఈ ప్రాంత సినీ దర్శకులకే కాక ఇతర ప్రాంత సినీ దర్శకులకూ ఎంతో స్ఫూర్తినిచ్చాయి. ఇక్కడి జీవన విలువలపై సినిమాలు తీసేందుకు పురికొల్పాయి. అలా వచ్చిన సినిమాపూన్నో ‘భారతీయ సినిమా’పై తమదైన ముద్రను వేయడమేకాక అంతర్జాతీయ ప్రశంసలను అందుకున్నాయి.

అంకుర్‌గా...
సినిమాకళ పరంగా తెలంగాణ సినిమా మొదటి నుంచీ ‘మెయిన్ స్ట్రీమ్ తెలుగు సినిమా’ పాదాల కింద నలిగిపోయిందనే చెప్పాలి. అయితే తెలంగాణలోని మానవీయ సంబంధాలు - ఫ్యూడల్ నియమాలు తెలుగు సినిమా కన్నా జాతీయ స్థాయిలోనే ఎక్కువ ప్రభావాన్ని చూపించాయి. దీనికి 1974లో హిందీలో వచ్చిన ‘అంకుర్’ సినిమానే మంచి ఉదాహరణ. ఇది భారతీయ సినిమాని పలురకాలుగా ప్రభావితం చేసింది. ‘అంకుర్’ తెలంగాణలోని భూస్వామి - పాలేరు కుటుంబాల పరిస్థితిని తెరకెక్కించి తెలంగాణ నేపథ్య సినిమాకు తెరలేపింది. మొదటి తెలంగాణ సినిమాగా దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. మరోవైపు సత్యజిత్ రే తర్వాత తరంలోని న్యూవేవ్ ఆర్ట్ ఫిలిం దర్శకులకు ‘అంకుర్’ కొత్త డైరెక్షన్ ఇచ్చింది . ఈ సినిమా మొత్తాన్ని రంగాడ్డి జిల్లా పరిసర ప్రాంతాల్లోనే చిత్రీకరించారు. ‘షబానా ఆజ్మీ’ ఈ సినిమా ద్వారే తొలిసారిగా పరిచయమైంది. అలా భారత జాతి గర్వించదగ్గ కళాకారిణిని భారతీయ సినిమాకు పరిచయం చేసిన ఘనత తెలంగాణ సినిమా దక్కించుకుంది.

రెండురకాల ముద్ర
భారతీయ సినిమాపై తెలంగాణ ప్రాంతీయ ముద్ర రెండు రూపాల్లో కనిపిస్తుంది. ఒక కళాత్మక సమాంతర (ఆర్ట్, పార్లల్)సినిమా కాగా, రెండోది క్రాసోవర్ హింగ్లీష్ సినిమా. కథ, కథనం, టెక్నిక్ వంటి ఎన్నో అంశాలను తెలంగాణ నుంచి స్ఫూర్తి పొందిన ఈ రెండు రూపాలు భారతీయ సినిమాను తీవ్రంగా ప్రభావితం చేశాయి.

ఆర్ట్ ఫిలిం మూవ్‌మెంట్‌ని అత్యున్నత దశకు తీసుకెళ్లిన కొన్ని సినిమాలకు తెలంగాణ జీవన సంస్కృతే ఆలంబనగా నిలిచింది. సినిమా ప్రయోజనాన్ని వెలికి తీయడానికి కావలసిన మానవీయ కథనాలు తెలంగాణ జీవనంలో ఉండటమే దీనికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. అందుకే భారతీయ సినీరంగంలో ‘మీనింగ్ ఫుల్ సినిమా’ని ఆవిష్కరించిన చాలా చిత్రాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా తెలంగాణ జీవనమే ప్రేరణ అయింది. అలా 1977లో ‘ఒక ఊరి కథ’, 1979లో ‘మా భూమి’, 1982లో ‘బజార్’, 1983లో ‘మండీ’ 1987లో ‘సుస్మాన్’, 1988లో ‘దాసి’, 1990లో ‘మట్టి మనుషులు’ వంటి సినిమాలు జాతీయ స్థాయిలో కళాత్మాక చిత్రాల ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాయి. ఈ సినిమాలన్నింటిలోని కథా వస్తువుకు తెలంగాణ ప్రాంత జనజీవన స్థితిగతులే ఆధారం. అంతేకాదు ఇక్కడి సాంస్కృతిక విలువలను ప్రతిబింబించాలనే ఆలోచనతో ఈ సినిమాలన్నిటినీ ఇక్కడే చిత్రీకరించడం వల్ల ప్రతి ఫ్రేమ్‌లో తెలంగాణ మట్టి మానవసంబంధాలు హృద్యంగా అల్లుకున్నాయి.

క్రాసోవర్ సినిమా
వందేళ్ల భారతీయ సినిమా గమనాన్ని ఓ మలుపు తిప్పిన సినిమా జానర్‌లలో క్రాసోవర్ సినిమా ఒకటి. ఇండియన్ సినిమా గ్లోబల్ ఆడియెన్స్‌కు చేరువ కావడానికి, హాలీవుడ్‌కు గట్టి పోటీగా నిలవడానికి కావాల్సిన నేపథ్యాన్ని ఆవిష్కరించింది ఈ క్రాసోవర్ సినిమానే! అయితే దీన్ని ఆరంభించిన ఘనత, స్ఫూర్తినిచ్చిన క్రెడిట్ కూడా తెలంగాణ ప్రాంతానిదే అని చెప్పాలి. క్రాసోవర్ సినిమా సంస్కృతికి తొలిబీజం వేసిన సినిమా ‘హైదరాబాద్ బ్లూస్’. 1998లో విడుదలైన ఈ సినిమా డైలాగ్‌ల విషయంలో అప్పటిదాకా ఉన్న నియమాలను బ్రేక్ చేసింది. హిందీ, ఇంగ్లీష్ కలగలసిన ‘హింగ్లీష్’ తరహా దైనందిన భాషాశైలిని తొలిసారిగా భారతీయ వెండితెరపై చూపించింది. ఆ తర్వాత ఈ తరహా సినిమాపూన్నో వచ్చి ప్రస్తుతం మన సినిమారంగంలో ‘హింగ్లీష్ సినిమా జానర్’గా స్థిరపడ్డాయి. ఈ కోవలోనే 2006లో వచ్చిన ‘అంక్షిగేజ్’ లాంటి ఎన్నో సినిమాలు హైదరాబాద్‌లోని ఇండో ఇస్లామిక్ ఫ్యూజన్ కల్చర్‌తో సెల్యూలాయిడ్‌ను ఏలుతూ దుబాయ్, సౌదీ అరేబియా, ఇరాన్ వంటి ఇస్లామిక్ దేశాల్లో సైతం భారతీయ సినిమా జెండాను ఎగురవేశాయి.

మెయిన్ స్ట్రీమ్ బాలీవుడ్‌లోనూ....
తెలంగాణ నేపథ్యంతో ఆర్ట్ ఫిలింస్, క్రాసోవర్ సినిమాలే కాకుండా బాలీవుడ్ మెయిన్ స్ట్రీమ్ సినిమాలుగానూ రూపొందాయి. హైదరాబాద్‌లోని ప్రత్యేక జీవన సంస్కృతి బాలీవుడ్ సినిమాల్లో కూడా స్పెషల్ ఫ్రేమ్‌ను ఫిక్స్ చేసింది. ఆ తరహాలో 1982లో వచ్చిన ‘నిఖా’ సినిమాని ప్రముఖంగా చెప్పుకోవచ్చు. హైదరాబాదీ ముస్లిం కుటుంబాల జీవన నేపథ్యంతో ఇస్లామిక్ వివాహవ్యవస్థలోని విడాకుల ఉదంతాన్ని ఇతివృత్తంగా చేసుకుని వచ్చిన ఈ సినిమా మ్యూజికల్‌గా, కమర్షియల్‌గా సూపర్ హిట్ అయింది. బి. ఆర్. చోప్రా వంటి పెద్ద దర్శకుడు తీసిన ఈ సినిమా షూటింగ్ అధిక భాగం హైదరాబాద్‌లోని వివిధ నైజాం భవనాలు, ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ కాలేజ్ భవనంలో జరిగింది.

అలాగే 1988లో వచ్చిన ‘హీరో హీరాలాల్’ అనే సినిమా హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలోని ఓ ఆటోరిక్షా డ్రైవర్ కథగా వచ్చింది. వీటన్నిటిని గొప్ప మలుపులుగా పరిగణించడాన్ని బట్టి తెలంగాణ భారతీయ సినిమా పై వేసిన ముద్ర ఇక్కడ స్పష్టమవుతోంది.

జాతీయ తెరపై తెలంగాణ సృజన
ప్రత్యేక సినిమాగా ‘తెలంగాణ సినిమా’ తన సొంత అస్తిత్వాన్ని ప్రకటించడం మొదలై ఇప్పటికి 37 ఏళ్లు మాత్రమే. అయినా నూరేళ్ల భారతీయ సినిమాలో తనదైన శైలిని చూపిస్తూ మరే ప్రాంతీయ సినిమాకు సాధ్యంకానంత ప్రగతిని, విజయాన్ని సాధించింది. ఇంకా చెప్పాలంటే ‘ సోకాల్డ్ తెలుగు సినిమా’ కన్నా తెలంగాణ సినిమానే భారతీయ సినీవూపస్థానంలో కీలకమైన మలుపులకు కారణమైంది.
శ్యామ్ బెనెగల్ , పైడి జైరాజ్‌లు పొందిన ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాలు, జాతీయ స్థాయిలో ఐదు అవార్డులను సాధించిన ఏకైక చిత్రం ‘దాసి’ భారతీయ వెండితెరపై తెలంగాణ ముద్రని శాశ్వతం చేశాయి. అలాగే ప్రఖ్యాత ఆర్ట్ చిత్రాల దర్శకుడు గౌతమ్ ఘోష్‌ను ‘మా భూమి’ ద్వారా భారతీయ సినిమాకు పరిచయం చేసిన ఘనతను కూడా తెలంగాణ సొంతం చేసుకుంది. అలాగే బి. నర్సింగరావు వంటి తెలంగాణ భూమిపువూతుడి క్రియేషన్స్ ద్వారా తెలంగాణ సినిమానే కాక భారతీయ సినిమా కూడా అంతర్జాతీయ చలనచివూతవేదికల మీద సగర్వంగా తలెత్తుకుని నిలబడింది.
అలాంటి తెలంగాణ చిత్రాన్ని, తెలంగాణ ముద్రని భారతీయ సినిమా వందేళ్లు పూర్తి చేసుకుంటున్న ఈ సందర్భంలో విస్తృతంగా చర్చించి, ఆ స్ఫూర్తిని నేటి ఫిలింమేకర్స్ మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మామిడి హరికృష్ణ

Other News



Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd
News Photo Galleries Features
Latest News
Telangana News
Seemandhra News
National News
International News
Festivals gallery
Actress gallery
Cinema gallery
Fashion gallery
Political gallery
Sports gallery
Zindagi
Turning Point
Mee Features
Life Style
Sunday magazine