ఎంసీఐ స్పందిస్తుంది
-మెడికల్ సీట్ల పెంపుపై హైకోర్టు తీర్పును గౌరవిస్తుంది: కొండ్రు మురళి
-ఎంసీఐ అధికారులతో భేటీ
న్యూఢిల్లీ, జూలై 16 (టీ మీడియా): ఉస్మానియా, కాకతీయ వైద్య కళాశాలలకు మెడికల్ సీట్ల పెంపు విషయమై భారత వైద్య మండలి (ఎంసీఐ) సానుకూల నిర్ణయం తీసుకుంటుందని మంత్రి కొండ్రు మురళి ఆశాభావం వ్యక్తంచేశారు. ఎంసీఐ అధికారులతో ఈ విషయమై కూలంకషంగా చర్చించామని, సీట్లు పెంచాల్సిందిగా రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును వారి దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. కోర్టు ఉత్తర్వులను ఎంసీఐ గౌరవిస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. ఓయూ, కేయూలకు మెడికల్ సీట్ల పెంపు విషయమై ఎంసీఐ అధికారులతో సోమవారం రాష్ట్ర వైద్య విద్యాశాఖ మంత్రి కొండ్రు మురళి భేటీ అయ్యారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో న్యాయపరమైన అంశాలని ఎంసీఐ అధికారులు పరిశీలిస్తున్నారని, ఈ విషయంలో తప్పకుండా సానుకూల ఫలితాలు వస్తామని ఆశిస్తున్నామని తెలిపారు. రాజీవ్ యువకిరణాల పథకంపై కొంత మంది ఎంపీలు ప్రధానికి తప్పుడు సమాచారం ఇచ్చారని, కానీ ఈ పథకం కింద ఉద్యోగాలు పొందిన వారు చాలా సంతోషంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినట్లుగా రానున్న రెండేళ్లలో 15 లక్షల ఉద్యోగాల కల్పించాలన్న లక్ష్యాన్ని సాధిస్తామని ధీమా వ్యకం చేశారు. రాజీవ్ యువకిరణాలపై ప్రధానికి వివేక్ లేఖ రాయడం కాంగ్రెస్ పార్టీ కుటుంబ వ్యవహారమని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణాడ్డి అన్నారు. ఈ పథకం వల్ల ఎంతో మంది లబ్ధి పొందుతున్నారని, చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా ఉంటే సరిదిద్దుకుంటామని అన్నారు.
Other News