బాబుతో బాలయ్య భేటీ

- పార్టీ వ్యవహారాలపై అసంతృప్తి!
హైదరాబాద్, ఆగస్టు 12 (టీ మీడియా):తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో ఆయన వియ్యంకుడు, సినీ నటుడు బాలకృష్ణ ఆదివారం భేటీ అయ్యారు. పార్టీలో క్రియాశీల పాత్ర పోషించడానికి, ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి తను సిద్ధమేనంటూ కొద్దిరోజులుగా చెబుతూవస్తున్న బాలకృష్ణ పార్టీలో తనకంటూ ఒక కీలక పదవిని ఆశిస్తున్న విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని ఆయన చంద్రబాబుకు కూడా ఎరుకపర్చినట్టు సమాచారం. కానీ బాలయ్య ప్రతిపాదనపై చంద్రబాబు ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో వీరిద్దరూ సమావేశం కావడం ఇదే మొదటిసారి. దానితో ఆదివారం ఉదయం చంద్రబాబు నివాసంలో గంటసేపు ఏకాంతంగా బాలయ్య చర్చలు జరపడం ప్రాముఖ్యం సంతరించుకుంది. బాలకృష్ణకు పార్టీలో ఏ పదవి ఇవ్వాలనే అంశంపైనే ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. తాజా రాజకీయ పరిణామాలపై వీరు చర్చించినట్లు పార్టీ వర్గాలు చెపుతున్నప్పటికీ వీరి చర్చల్లో బాబు తీరుపై బాలయ్య అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు సమాచారం. పొలిట్‌బ్యూరో సమావేశంలో కీలక అంశాలైన బీసీ డిక్లరేషన్, ఎస్సీ వర్గీకరణ, తెలంగాణ వంటివాటిపై తనను సంప్రదించకుండానే విధాన నిర్ణయాలు తీసుకోవడంపై బాలయ్య అసంతృప్తిని వ్యక్తంచేసినట్లు తెలిసింది.
అంతే కాకుండా 2014 ఎన్నికల మేనిఫెస్టోను కూడా తనకు తెలియకుండానే పొలిట్ బ్యూరోలో నిర్ణయించడం పట్ల కూడా బాలయ్య అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే పార్టీ వర్గాలు మాత్రం బాలకృష్ణ, చంద్రబాబుల మధ్య ఎలాంటి రాజకీయ అంశాలు చర్చకు రాలేదని పేర్కొంటున్నాయి. బాలయ్య రాజకీయ ఎంట్రీపై చర్చించడానికే ఈ భేటీ జరిగినట్టు ఆయన అభిమానులు చెప్తున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడంపై బాలయ్య ఏదోఒకటి తేల్చుకోవాలని బాబుతో భేటీ అయినట్లు సమాచారం.
Other News