ఆర్టీసీ చర్చలు మళ్లీ విఫలం
- 20న లేబర్ కమిషనర్ వద్ద తుది చర్చలు
హైదరాబాద్, జూలై 11 (టీ మీడియా): ఆర్టీసీ కార్మికుల చర్చలు మళ్లీ వాయిదా పడ్డాయి. గుర్తింపు సంఘం ఎన్‌ఎంయూ, ఆర్టీసీ యాజమాన్యం మధ్య అవగాహన కుదరకపోవడంతో ఈ నెల 20న లేబర్ కమిషనర్ వద్ద మరోసారి చర్చించాలని నిర్ణయించారు. బుధవారం ఉదయం లేబర్ కమిషనర్ వద్ద ఎన్‌ఎంయూ, ఆర్టీసీ యాజమాన్యం ప్రతినిధుల మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఆర్టీసీ పెద్ద సంస్థ అయిన కారణంగా ఇరువురు పట్టువిడుపులు చాలించాలని, మరోసారి యాజమాన్యం, గుర్తింపు సంఘం మాట్లాడుకుని ఈ నెల 20న తన వద్దకు రావాలని కమిషనర్ సూచించారు.
సాయంత్రం యాజమాన్యంతో జరిగిన చర్చల్లో ప్రధాన కాంట్రాక్టు కార్మికుల క్రమబద్ధీకరణపై యాజమాన్యం సానుకూలంగా స్పందించలేదని, ఒకేసారి అంత మందిని క్రమబద్ధీకరిస్తే సంస్థపై రూ.120 కోట్ల అదనపు భారం పడే అవకాశముందని యాజమాన్య ప్రతినిధులు చెప్పినట్లు ఎన్‌ఎంయూ అధ్యక్షుడు నాగేశ్వరరావు ‘టీ మీడియా’తో చెప్పారు. జీతాలు కూడా చెల్లించలేని స్థితిలో ఉన్న సంస్థ అంత మంది సర్వీసులను క్రమబద్ధీకరించలేమని చేతులు ఎత్తివేసిందని, నెలకు మూడు రోజుల లీవు విషయంలో కూడా సానుకూలత కనబర్చలేదన్నారు. చనిపోయిన కార్మికుల పిల్లలను ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే తీసుకుంటామనే డిమాండ్ ఒక్కటే అనుకూలంగా ఉందన్నారు. దీంతో ఈ నెల 20న మరోసారి యాజమాన్యంతో చర్చలు జరపాలని నిర్ణయించి సమావేశాన్ని వాయిదా వేసినట్లు నాగేశ్వరరావు తెలిపారు.
Other News