హుక్కా సెంటర్లపై మెరుపు దాడులు
12 సెంటర్లపై కేసులు నమోదు
- హోం మంత్రి ఆదేశంతో..రంగంలోకి దిగిన పోలీసులు
సిటీబ్యూరో హైదరాబాద్, జూలై 11 (టీ మీడి యా): హుక్కా సెంటర్లపై చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రాడ్డి ఇచ్చిన ఆదేశాలతో పోలీసులు బుధవారం రాత్రి నగరంలోని పలు హుక్కా సెంటర్లపై మెరుపు దాడులు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా కొంత మంది నిర్వాహకులు హుక్కా ముసుగులో యువతీ, యువకులకు మత్తుపదార్థాలను ధూమపానం రూపంలో మైనార్టీ తీరని యువతను అందిస్తున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం పశ్చిమ మండలం పోలీసులు పలు హుక్కా సెంటర్లపై దాడిచేసి పలువురు మైనార్టీ యువతీ, యువకులను అదుపులోకి తీసుకుని నిర్వాహకులపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై తీవ్రంగా స్పందించిన హోం మంత్రి సబితా ఇంద్రాడ్డి హుక్కా సెంటర్లపై వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా బుధవారం తనను కలిసిన నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మను ఆదేశించారు. నగరంలో ఉన్న హుక్కా సెంటర్లు, పబ్‌లను పనితీరు.. నిబంధనలను హోం మంత్రికి వివరించారు. హోం మంత్రి ఆదేశాల మేరకు పోలీసులు నగరంలోని పలు సెంటర్లపై దాడులు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న 12హుక్కా సెంటర్లపై కేసులు నమోదు చేసినట్లు సమాచారం. దాడుల విషయం తెలియడంతో జంట పోలీసు కమిషనరేట్‌ల పరిధిలోని హుక్కాసెంటర్లను నిర్వాహకులు మూసివేశారు.
ముందస్తుగా పోలీసుల సమాచారం
హుక్కాసెంటర్లపై దాడి విషయాన్ని కొంతమంది పోలీసులు తమ పరిధిలోని నిర్వాహకులకు ముందుగానే సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. దీంతో అప్రమత్తమైన పలువురు నిర్వాహకులు వెంటనే హుక్కాసెంటర్లను మూసివేశారు. స్థానిక పోలీసులకు సమాచారం లేకుండా వారి పరిధిలో హుక్కా సెంటర్లపై దాడులు చేయడం సాధ్యం కాదు. దీంతో పోలీసుల దాడుల విషయం ముందుగానే హుక్కా సెంటర్ల నిర్వాహకులకు తెలిసిపోయింది.
Other News