|
|
డీఎల్‌ఎఫ్‌కు రూ.280 కోట్ల టోపీపెట్టిన ఘరానా
..గుప్తా అరెస్ట్
-పోలీసు కస్టడీలో పీవీఆర్ మాల్ యజమాని - డీఎల్‌ఎఫ్ పేరుతో హెచ్‌ఎండీఏకి టోకరా - తప్పుడు ఆథరైజేషన్ పత్రాల సృష్టి - ఖరీదైన 24.23 ఎకరాలు లీజుకు - నెలలు గడిచినా చెల్లించని అద్దె - ఆలస్యంగా వెలుగు చూసిన నిజం - పోలీసులకు హెచ్‌ఎండీఏ ఫిర్యాదు - నిగ్గు తేల్చిన నేర పరిశోధక విభాగం - గతంలో డీఎల్‌ఎఫ్‌కు రూ. 280 కోట్లకు టోపీ - అరెస్టు చేయగానే గుప్తాకు ఛాతి నొప్పి - ఆస్పవూతికి తరలింపు.. ఐసీయూలో చికిత్స హైదరాబాద్, జూన్ 23 (టీ మీడియా):విలువైన స్థలం ఖాళీగా పడి ఉందంటే చాలు.. దానిపై ఆయన కన్ను పడుతుంది! తక్షణమే అది వివాదాస్పద భూమిగా మారిపోతుంది! వెంటనే ఆయన రంగ ప్రవేశం చేస్తాడు.. అయితే కారుచౌకగా సెటిప్మూంట్.. లేదంటే పెద్ద మొత్తాల్లో డబ్బు గుంజుకోవడం! ఇది ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అనేది ఆయన గురించి బాగా తెలిసినవారు చెప్పేమాట! ఈ అనుభవంతోనే ఆయన ప్రఖ్యాత నిర్మాణ సంస్థ డీఎల్‌ఎఫ్‌కు 280 కోట్లరూపాయల మేర కుచ్చుటోపీ పెట్టాడు! ఇదే కాదు.. నగరంలో చాలా దందాలు ఆయన చేతుల మీదుగా ఈ రూపాల్లో జరిగినవే! ఆఖరుకు హెఎండీఏకే టోకరావేశాడు.. తన కంపెనీకి డీఎల్‌ఎఫ్‌లో భాగస్వామ్యం ఉందని నమ్మించి.. 24.23 ఎకరాలను లీజుకు కొట్టేశాడు! దీనికోసం తప్పుడు ఆథరైజేషన్ పత్రాలను సైతం సృష్టించాడు! తీరా ఆ స్థలానికి అద్దె చెల్లించకపోయేసరికి నేరుగా డీఎల్‌ఎఫ్ కంపెనీకి లేఖలు రాసిన హెఎండీఎ అధికారులకు దిమ్మతిరిగే సమాధానం వచ్చింది! అసలు తాము ఎవరికీ ఆథరైజేషన్ లెటర్ ఇవ్వలేదని డీఎల్‌ఎఫ్ యాజమాన్యం పంపిన లేఖతో కదిలిన అధికారులు.. పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు తీగలాగి.. డొంకను కదిలించారు! రియల్టర్‌గా ఉంటూ.. చీటర్ అవతారం ఎత్తే పీవీఆర్ మాల్స్ యజమాని గౌరీ శంకర్ గుప్తాను శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో అరెస్టు చేశారు.
డీఎల్‌ఎఫ్‌కంపెనీలో తనకు భాగస్వామ్యం ఉందంటూ తప్పుడు పత్రాలు సృష్టించి, దాదాపు పాతిక ఎకరాల భూమిని అక్రమంగా లీజుకు పొందిన కేసులో గుప్తాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన కొద్ది సేపటికే తనకు ఛాతీలో నొప్పిగా ఉందని గుప్తా చెప్పటంతో ఆయనను ఓ కార్పొరేట్ ఆస్పవూతిలో చేర్పించారు. ప్రస్తుతం గుప్తా అక్కడ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందుతున్నారు. నిర్మాణ రంగంలో ఉన్న గుప్తా తన సన్నిహితుడైన మనోజ్‌శర్మ డైరెక్టర్‌గా జాఫర్‌ఖాన్ అనే మరో వ్యక్తితో కలిసి దాదాపు నాలుగున్నరేళ్ల క్రితం ఎస్‌బీపీఎల్ డెవలపర్స్ ప్రయివేట్ లిమిటెడ్ పేర సంస్థను ప్రారంభించాడు. ఆ తరువాత దేశంలోనే పేరున్న ఢిల్లీలోని డీఎల్‌ఎఫ్‌తో తమ సంస్థకు భాగస్వామ్యం ఉన్నట్టుగా చెప్పుకొని బాలానగర్ మండలం మూసాపేటలో ఇంటిక్షిగేటెడ్ మెగా అగ్రికల్చర్ హబ్ నిర్మాణానికిగాను 24.23 ఎకరాలను లీజుకివ్వాల్సిందిగా హెచ్‌ఎండీఏ (నాటి హుడా)కు దరఖాస్తు చేసుకున్నాడు. దీనిని నమ్మిన హెచ్‌ఎండీఏ అధికారులు 24.23 ఎకరాల భూమిని నెలకు 39.64లక్షల అద్దెకు లీజుకివ్వటానికి ముందుకొచ్చారు. ఒప్పందం కుదుర్చుకోవాలంటూ ఢిల్లీలోని డీఎల్‌ఎఫ్ ఎస్‌బీపీఎల్ డెవలపర్స్ ప్రయివేట్ లిమిటెడ్ సంస్థకు లిఖితపూర్వకంగా సూచించారు.
ఆ తరువాత తెర మీదకు వచ్చిన ఎస్ దుర్గావూపసాద్ అనే న్యాయవాది.. డీఎల్‌ఎఫ్ ఎస్‌బీపీఎల్ డెవలపర్స్ ప్రయివేట్ సంస్థ ఒప్పందం కుదుర్చుకోవటానికి తనకు ఆథరైజేషన్ ఇచ్చిందని చెప్పి హెచ్‌ఎండీఏతో స్థలం లీజుకు సంబంధించి 2008, ఆగస్టు 27న అగ్రిమెంట్ కాగితాలపై సంతకాలు చేశారు. దీనిపై సాక్షి సంతకాలు చేసిన మనోజ్‌శర్మ, జాఫర్‌ఖాన్‌లు తమ డ్రైవింగ్ లైసెన్సులను ఐడీ ప్రూఫ్‌గా హెచ్‌ఎండీఏ అధికారులకు అందచేశారు. ఒప్పందం కుదిరిన నేపథ్యంలో 2009, జనవరి 12న హెచ్‌ఎండీఏ అధికారులు 24.23 ఎకరాల స్థలాన్ని మనోజ్‌శర్మకు అప్పగించారు.
మోసం ఇలా బయటపడింది... కుదిరిన అగ్రిమెంట్ ప్రకారం ప్రతినెలా డీఎల్‌ఎఫ్ ఎస్‌బీపీఎల్ డెవలపర్స్ ప్రయివేట్ లిమిటెడ్ సంస్థ హెచ్‌ఎండీఏకు రూ.39.64లక్షలను అద్దెగా చెల్లించాలి. అయితే, 2010 జూన్ వరకు హెచ్‌ఎండీఏకు అద్దెగా రూపాయి కూడా రాలేదు. దాంతో హెచ్‌ఎండీఏ అధికారులు బకాయి పడ్డ 3.96 కోట్ల రూపాయల అద్దెను వెంటనే చెల్లించాలని, లేనిపక్షంలో ఒప్పందాన్ని రద్దు చేసి, స్థలాన్ని స్వాధీనం చేసుకుంటామని పేర్కొంటూ ఢిల్లీలోని నాజ్ సినిమా కాంప్లెక్స్ ప్రాంతంలో ఉన్న డీఎల్‌ఎఫ్ ఎస్‌బీపీఎల్ డెవలపర్స్‌కు నోటీసు పంపించారు. దీనికి స్పందన రాకపోవటంతో మరో నాలుగైదుసార్లు నోటీసులు జారీ చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో న్యూఢిల్లీ సంసద్ మార్గ్‌లో ఉన్న డీఎల్‌ఎఫ్ ఎస్‌బీపీఎల్ డెవలపర్స్ సంస్థ నుంచి హెచ్‌ఎండీఏ అధికారులకు ఓ లేఖ అందింది. హెచ్‌ఎండీఏతో స్థలం లీజుకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకోవటానికి తాము ఎవ్వరికీ ఆథరైజేషన్ ఇవ్వలేదన్నది దాని సారాంశం. దాంతోపాటు ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపించాల్సిందిగా డీఎల్‌ఎఫ్ సంస్థ హెచ్‌ఎండీఏ అధికారులను కోరింది. దాంతో హెచ్‌ఎండీఏ ఎస్టేట్ ఆఫీసర్‌గా ఉన్న ఎం అశోక్‌కుమార్ జరిగిన విషయాన్ని మొత్తం వివరిస్తూ హైదరాబాద్ నేరపరిశోధక విభాగం అధికారులకు ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు నేరపరిశోధక విభాగం ఏసీపీ రామనర్సింహాడ్డి ఐపీసీ 420, 419, 409 సెక్షన్ల ప్రకారం మనోజ్‌వర్మ, జాఫర్‌ఖాన్‌లపై కేసులు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. దర్యాప్తులో ఈ మొత్తం వ్యవహారంలో సూత్రధారి గుప్తా అని బయటపడింది. తన వద్ద పనిచేస్తున్న ఉద్యోగులతో కలిసి గుప్తా డీఎల్‌ఎఫ్ ఎస్‌బీపీఎల్ డెవలపర్స్ పేరును అడ్డం పెట్టుకుని హెచ్‌ఎండీఏతో స్థలానికి సంబంధించిన లీజును దక్కించుకున్నట్టుగా తేలింది. దాంతో అతనిపై కూడా కేసులు నమోదు చేసి శుక్రవారం రాత్రి 9.30గంటలకు అరెస్టు చేశారు. అనంతరం నేరపరిశోధక విభాగానికి తరలించారు. ఆ తరువాత కొద్దిసేపటికి గుప్తా తనకు ఛాతీలో తీవ్రమైన నొప్పిగా ఉందని చెప్పటంతో అతన్ని ఓ కార్పొరేట్ ఆస్పవూతిలో చేర్పించారు.
Other News
|
|