శ్రీవారికి వైభవంగా పుష్పపల్లకి సేవ
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం ఉదయం ఆణివార ఆస్థాన సేవ కార్యక్షికమాలు ప్రారంభించారు. కార్యక్షికమంలో భాగంగా ఉదయం ఏడు నుంచి తొమ్మిది గంటల మధ్య బంగారు వాకిలి ముంగిట ఘంటా మండపంలో సర్వభూపాల వాహనంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామిని గరుత్మంతునికి కొలువుదీర్చారు. మరో పీఠంపై స్వామివారి సర్వ సైన్యాధ్యక్షుడైన విష్పక్సేనుల వారిని దక్షినాభిముఖంగా వేంచేయింప చేశారు. అనంతరం ఆనంద నిలయంలోని మూలవిరాట్టుకు, బంగారు వాకిలి వద్ద ఆస్థానంలో వేంచేయింపు చేసి ఉన్న ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు చేసి ప్రసాదాలు నివేదించారు. తర్వాత వెండి పళ్లెంలో ఆరు పట్టువస్త్రాలను పెద్దజీయర్ శిరస్సుపై పెట్టకుని మంగళవాయిద్యాల నడుమ చిన్నజీయర్, అధికారగణంతో వెంటరాగా స్వామివారి మూలవిరాట్టుకు పట్టు వస్త్రాలను సమర్పించారు. వస్త్రాల్లో నాలుగింటిని మూలవిరాట్టుకు, మిగిలిన రెండు శ్రీమలయప్పస్వామికి, విష్వక్సేనుల వారికి అలంకరించారు. శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు తన శిరస్సుకు స్వామివారి పాదవస్త్రం ‘పరివట్టం’ కట్టుకుని బియ్యపు దక్షణ స్వీకరించి స్వామివారిని ఆశీర్వదించారు. సాయంత్రం స్వామివారు ఉభయదేవేరులతోపాటు శోభాయమానంగా అలంకరించిన పుష్పపల్లకిని అధిరోహించి తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం భక్తులు 31 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 18 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది.
Other News