ఆ ఐజీని కొనసాగించొద్దు
- ఐజీ సీతారామాంజనేయులుపై లాయర్ చంద్రశేఖర్ మరో పిటిషన్
న్యూఢిల్లీ, జూలై 17 (టీ మీడియా): సీనియర్ పోలీస్ అధికారి సీతారామాంజనేయులుకు వ్యతిరేకంగా జాతీయ మానవ హక్కుల కమిషన్‌లో మరో పిటిషన్ దాఖలైంది. నకిలీ ఎన్‌కౌంటర్లపై హక్కుల కమిషన్ బాధిత కుటుంబాలకు కేవలం ఆర్థిక న్యాయమే చేసిందని, వారికి చట్టపరమైన న్యాయం కూడా చేయాలని కోరుతూ లాయర్ చంద్రశేఖర్ మంగళవారం పిటిషన్ వేశారు. నిబంధనల ప్రకారం సీతారామాంజనేయులుపై సెక్షన్ 302 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి విచారణ జరిపించాలని ఆయన కోరారు. నకిలీ ఎన్‌కౌంటర్లని నిర్ధారణ జరిగినపుడు ఆయనను దోషిగా పరిగణించాలని, కానీ ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఐజీగా కొనసాగిస్తున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హక్కుల కమిషన్ చైర్మన్ కేజీ బాలకృష్ణన్, గతంలో ఈ విషయమై విచారణ జరిపి నకిలీ ఎన్‌కౌంటర్లుగా తేల్చిన డివిజన్ బెంచ్‌కి పిటిషన్‌ని బదలాయించారు. జస్టిస్ బీసీ పటేల్, జస్టిస్ సత్యవూబతాపాల్‌తో కూడిన ధర్మాసనం ఈ వ్యవహారంపై తుది నిర్ణయం తీసుకోనుంది.
Other News