అడుగు పెట్టనీయం
-
అడుగడుగునా అడ్డుకుంటాం: విజయశాంతి
- జై తెలంగాణ అంటేనే ముందుకు: హరీశ్‌రావు
సిద్దిపేట, టీ మీడియా ప్రతినిధి: ‘భర్త మరణించాడని... కొడుకు జైలు పాలయ్యాడని కన్నీరు పెట్టుకుంటున్న విజయమ్మా తెలంగాణలో ఎంతోమంది తల్లుల కడుపుకోతకు మీ భర్త కారణం కాదా? వచ్చిన తెలంగాణను అడ్డుకోవడంలో నీ కొడుకు చంద్రబాబుతో కుమ్మక్కై పార్లమెంట్ సాక్షిగా ప్లకార్డు ప్రదర్శించలేదా? తెలంగాణను అడ్డుకున్నది నీ భర్త, నీ కొడుకే అని తెలవదా, 800 మంది తెలంగాణ బిడ్డలను పొట్టన పెట్టుకుని తెలంగాణలో ఎలా పర్యటిస్తారు. తెలంగాణపై మీ వైఖరి చెప్పందే అడుగుపెట్టనీయం. అడ్డుకుంటాం. మా సత్తా చూపుతాం’ అని మెదక్ ఎంపీ విజయశాంతి హెచ్చరించారు. ఆదివారం మెదక్ జిల్లా సిద్దిపేటలోని మున్నూరుకాపు సంక్షేమ భవనంలో నిర్వహించిన టీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు.
రాష్ట్రంలో ఏడాదికో సమైక్యవాద పార్టీ పుట్టుకోస్తోందని, తెలంగాణ ప్రజల మనోవేధనను అర్థం చేసుకుని ప్రత్యేక ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలిపిన సీమాంధ్ర పార్టీ ఒక్కటీ లేదన్నారు. శత్రువు వస్తే అడ్డుకోవాలి, ప్రశ్నించాలి, సత్తా చాటాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే హరీశ్‌రావు మాట్లాడుతూ జై తెలంగాణ అంటేనే విజయమ్మ కాన్వాయ్ ముందుకెళ్తుందని, లేదంటే అమె పర్యటనను అడ్డుకుంటామని, తెలంగాణపై వైఖరి కోసం పట్టుపడతామని స్పష్టం చేశారు. తెలంగాణకు చంద్రబాబు ఎంతగా అన్యాయం చేశాడో అంతేస్థాయిలో జగన్ ద్రోహం చేశాడన్నారు. వైఎస్ జగన్ తెలంగాణ ప్రజలకు బేషరతు క్షమాపణలు చెప్పడమే కాదు, తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించేవరకు నిరసనల హోరు తప్పదని హెచ్చరించారు. దీక్ష ముసుగులో ఉద్యమంపై దాడి చేస్తున్నారని ధ్వజమెత్తారు.
ఢిల్లీలో తెలంగాణపై సానుకూల చర్చజరిగిన ప్రతిసారీ ఏదో వంకతో సీమాంధ్ర పార్టీలు హడావుడి చేయడం పరిపాటిగా మారిందన్నారు. ఇక్కడ తెలంగాణవాదం లేదని ఢిల్లీకి చూపించాలన్న దుర్బిద్ధితోనే ప్రజలు ముక్తకం వ్యతిరేకిస్తున్నా మొండిగా దీక్ష చేస్తామంటున్నారని, ఈ దీక్ష వెనుక లొగుట్టు ఇక్కడి జనానికి తెలుసునన్నారు. కాంగ్రెస్, వైఎస్సార్సీపీ నేతలు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని మరీ ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. వీరి బాగోతం రాష్ట్రపతి ఎన్నికల సాక్షిగా బట్టబయలయిందని, సీమాంధ్ర పార్టీలు కలిసికట్టుగా ఉద్యమంపై దాడి చేస్తున్నాయన్నారు. ఎవన్ని కుట్రలు పన్నినా ఉద్యమాన్ని ఆపలేరని, తెలంగాణపై వైఖరి ప్రకటించని పార్టీలకు గుణపాఠం తప్పదని హెచ్చరించారు.
Other News