|
|
ఇలాగైతే ఫలితాలు సాధించేదెలా?
-ఆందోళనలో ఉపాధ్యాయులు హైదరాబాద్, జూన్ 23 (టీ మీడియా): రాష్ట్రంలో విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు వారాలు గడిచినప్పటికీ ఇంతవరకు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందక పోవటంతో విద్యార్థుల తల్లిదంవూడులతో పాటు.. ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్ళలో ఫలితాలు సాధించని ఉపాధ్యాయులపై విద్యాశాఖా చర్యలకు సిద్ధమైంది. కానీ ఆ శాఖా చేయాల్సిన పనులను మాత్రం విస్మరిస్తోంది. 2011-12 విద్యా సంవత్సరం పదవ తరగతిలో కనీసం 10 శాతం ఫలితాలు సాధించని ఉపాధ్యాయులను డి కేటగిరీ స్థానాలకు బదిలీ చేస్తోంది. ఇదిబాగానే ఉన్నా.. సకాలంలో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు అందించని విద్యాశాఖపై ఏం చర్యలు తీసుకోవాలి? అని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. స్కూళ్ళు ప్రారంభమై 12 రోజులు గడిచినా ఇంకా పాఠ్యపుస్తకాలే అందకపోతే ఎప్పుడు పాఠాలు ప్రారంభించాలని వారు నిలదీస్తున్నారు. విద్యాపక్షోత్సవాల సందర్భంగా ప్రభుత్వ స్కూళ్ళలో ఎన్‌రోల్‌మెంట్ పెంచాలని ఉపాధ్యాయులను పురమాయిస్తూనే, విద్యార్థులకు అందించాల్సిన పాఠ్యపుస్తకాల పంపిణీలో విద్యాశాఖ జాప్యం చేస్తోంది.
ఇప్పటికీ సగానికిపైగా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందలేదని క్షేత్రస్థాయి లెక్కలు చెబుతున్నాయి. ఈసారి విద్యార్థులకు నాణ్యమైన మల్టీకలర్‌లో పాఠ్యపుస్తకాలు పంపిణీ చేస్తున్నామని, అందుకే ముద్రణలో ఆలస్యమైందని అధికారులు అంటున్నారు. ఈ నెలాఖరుకల్లా మెత్తం పాఠ్యపుస్తకాలను జిల్లాలకు పంపిణీ చేస్తామని చెబుతున్నారు. ఈ పుస్తకాలు జిల్లాలకు చేరేదెప్పుడు? జిల్లాల నుంచి పాఠశాలలకు చేరెదెప్పుడు? పాఠాలు ప్రారంభించేదెప్పుడు? అని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యాశాఖ అధికారుల లెక్కల ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు 5.31 కోట్ల పాఠ్య పుస్తకాలు అవసరం కాగా గత ఏడాది మిగిలిన పాఠ్యపుస్తకాలు 39లక్షలు ఉన్నాయి. ఇంకా 4.91 కోట్ల పాఠ్య పుస్తకాల ముద్రణ ప్రక్రియ చేపట్టారు. ఇందులో ఇప్పటి వరకు సుమారు 70నుంచి 75 శాతం స్టాకు జిల్లా పాయింట్లకు చేరాయంటున్నారు. మహబూబ్‌నగర్ 67.30%, రంగాడ్డి 84.43%, హైదరాబాద్ 79.20%, నిజామాబాద్ 73.71%, ఆదిలాబాద్ 55.58%, కరీంనగర్ 78.47%, వరంగల్ 85.01% , ఖమ్మం 83.71%, నల్గొండ 77.56%, శ్రీకాకుళం 80%, విజయనగరం 76%, విశాఖపట్నం 78%, తూర్పుగోదావరి 93.70%, పశ్చిమగోదావరి 80.88%, కృష్ణా 68.09%, గుంటూరు 65.09%, ప్రకాశం 38%, నెల్లూరు 74.82%, చిత్తూరు 70.54%, కడప 65.09%, అనంతపురం 60.70%, కర్నూలు 92.60%, 1 నుంచి 10 తరగతుల వరకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసినట్లు పాఠ్యపుస్తకాల డైరెక్టర్ సుధాకర్ తెలిపారు.
Other News
|
|