మళ్లీ సీఎం అఖిలేశే!

Tue,January 10, 2017 02:25 AM

మాటమార్చిన ములాయం
లక్నో, జనవరి 9: ఎస్పీలో ఓ వైపు వర్గపోరు తారస్థాయికి చేరుతుంటే మరోవైపు పార్టీ కురువృద్ధుడు ములాయంసింగ్ యాదవ్‌కు పుత్రప్రేమ పొంగుకొచ్చింది. తిరుగుబాటు చేసి వేరుకుంపటి పెట్టుకొన్న కుమారుడు యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్‌పై ఆయన అపారమైన అభిమానం కురిపించారు. రాబోయే ఎన్నికల్లో తమపార్టీ తిరిగి అధికారంలోకి వస్తే అఖిలేశే సీఎం అవుతారని ప్రకటించారు. మా పార్టీ సమైక్యంగా ఉంది.. ముక్కలయ్యే ప్రసక్తే లేదు.. అఖిలేశ్ మా పార్టీ తరఫున మళ్లీ ముఖ్యమంత్రి పదవి చేపడుతారు అని ములాయం స్పష్టం చేశారు. అఖిలేశ్‌ను పార్టీ సీఎం అభ్యర్థిగా ప్రకటించేందుకు ససేమిరా అన్న ములాయం మాటమార్చడం గమనార్హం. త్వరలో యూపీ అంతా పర్యటించి పార్టీకి ఐక్యతా సందేశం ఇస్తామని, గందరగోళం తొలగిస్తామని ఆయన చెప్పారు. అఖిలేశ్ తదుపరి ముఖ్యమంత్రి అవుతారు అని ములాయం స్పష్టం చేశారు. అంతకుముందు ఢిల్లీలో ఎస్పీ ప్రత్యర్థి వర్గాలు పోటాపోటీగా ఈసీకి ఎన్నికల గుర్తుపై విజ్ఞాపనలు సమర్పించాయి. ములాయం స్వయంగా ఈసీని కలిసి తన వర్గానికి సైకిల్ గుర్తును కేటాయించాలని డిమాండ్ చేశారు. ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ అఖిలేశ్‌తో తనకు సమస్యలు లేవని అంటూ.. రాంగోపాల్ యాదవ్ వల్లే పార్టీలో సమస్య వచ్చిపడిందని మండిపడ్డారు.
mulayam
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన వెంటనే అందరి దృష్టి ఆ రాష్ట్రంలోని దళితులపై పడింది. రాజకీయ పార్టీల జాతకాలను తారుమారు చేయగల స్థాయిలో ఉన్న దళితులు ఈసారి ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారన్నది చర్చనీయాంశమైంది. ఉత్తరప్రదేశ్‌లో 20.7 శాతం ఉన్న దళితులు ఏకపక్షంగా ఎటు వైపు మొగ్గు చూపితే ఆ రాజకీయ పార్టీ గణనీయమైన స్థానాలతో అధికారంలోకి రావడం ఖాయం. దీంతో ప్రధాన రాజకీయ పక్షాలన్నీ దళితులను తమవైపు తిప్పుకొనే ప్రయత్నాలు ప్రారంభించాయి. కాగా ఈ ఎన్నికల్లో ఎవరిని ఎన్నుకోవాలన్న దానిపై దళితులు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చేసినట్టు తెలుస్తున్నది.

దళితుల ఓటుబ్యాంకును కొల్లగొట్టేందుకు ఆయా పార్టీలు ఇప్పటికే తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించాయి. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి చెప్పుకోదగిన దళిత నాయకుడెవరూలేరు. మహారాష్ట్రకు చెందిన రాందాస్ అఠవలె, బీహార్‌కు చెందిన రాంవిలాస్ పాశ్వాన్, ఉదిత్‌రాజ్‌లను రంగంలోకి దింపుతున్నది. అధికార సమాజ్‌వాదీ పార్టీ దళితుల విషయంలో బీజేపీ, బీఎస్పీల రాజకీయ అంచనాలను చెదరగొట్టేందుకు ఇటీవల 17 యాదవేతర ఓబీసీ కులాలను దళితుల్లో చేర్చాలని ప్రతిపాదించింది. ఇక మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ గతంలో తమ హయాం లో దళితుల అభివృద్ధికి చేపట్టిన చర్యలను గుర్తు చేస్తూ, తమ సందేశాలను కరపత్రాల రూపంలో పం చిపెడుతున్నది. కాంగ్రెస్ పార్టీ గత స్మృతులను గుర్తుచేస్తూనే దళితుల కోసం తమకు ప్రత్యేక మ్యానిఫెస్టో ఉందని ప్రచారం చేస్తున్నది. యూపీలో ఇదివరకే అడుగిడిన మజ్లిస్ పార్టీ భీమ్‌తోనే మీమ్ (దళితులతో ముస్లింలు) అంటూ రంగంలోకి దిగింది.

ఆరు ఉపకులాలే కీలకం


ఎన్నికలకు సంబంధించి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే దళితుల్లో ఒక్కొక్కరికి వేర్వేరు కారణాలున్నప్పటికీ వారి వైఖరి ఇప్పటికే ఒక స్పష్టతనిస్తున్నట్టు తెలుస్తున్నది. యూపీలోని దళితుల్లో 66 ఉప కులాలున్నాయి. వీటిలో ప్రధానంగా జాతవ్-చమర్, పాసీ, ధోబీ, కోరీ, వాల్మీకీ, ఖాటిక్ అనే ఉప కులాలకు చెందిన వారు దళితుల్లో 87 శాతం మంది ఉన్నారు. మిగిలిన 60 ఉపకులాల్లో ముసహర్, సపేరా, బాసర్, తాంత్వా తదితర కులాలకు చెందినవారు నామమాత్రపు సంఖ్యలో రాష్ట్రమంతటా విస్తరించి ఉన్నారు. ఎన్నికల్లో వీరి ప్రభావం తక్కువే. దళితుల్లో ప్రధానమైన ఆరు ఉప కులాల్లో జాతివేతరులైన పాసీ, వాల్మీకి, ఖాటిక్‌లు సామాజికంగా, రాజకీయంగా హిందూత్వ వైపు మొగ్గు చూపుతారన్న అభిప్రాయం నెలకొంది. మత కల్లోలాలు చెలరేగిన ముజఫర్‌నగర్, షామ్లీ, మవు, గోరఖ్‌పూర్ వంటి జిల్లాల్లో వీరు ముస్లిం వ్యతిరేకులుగా ఉన్నారు. వీరి ముస్లిం వ్యతిరేకత బీజేపీకి ఓట్లుగా పరివర్తన చెందకపోవడం గమనార్హం. తాము గత ఎన్నికల్లో బీఎస్పీయేతర పార్టీలకు ఓట్లు వేశామని, ఈసారి నిర్ణయం మార్చుకున్నామని వాల్మీకి, పాసి, ఖాటిక్ ఉప కులాల వారు చెప్పారు. తమ సామాజిక-సాంస్కృతిక ప్రాధాన్యాలు, రాజకీయ దృక్పథం వేర్వేరని వారు స్పష్టం చేస్తున్నారు.

అధికార పార్టీలపై వ్యతిరేకత


యూపీ దళితుల్లోని దాదాపు అన్ని వర్గాలు అధికార సమాజ్‌వాదీ పార్టీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తున్నది. అయోధ్యలో కోరీ ఉపకులానికి చెందిన ఓ దళితుడు ఎస్పీ కే రాజ్ మే హమ్‌లోగోఁ కీ పోలీస్ మే సున్వాయీ నహీ హై (సమాజ్‌వాదీ పాలనలో పోలీసులు దళితులను పట్టించుకోరు) అని అన్నా రు. ఝాన్సీకి సమీపంలో రోడ్డుపక్కన గుడిశల్లో ఉం టున్న పాసీ కులానికి చెందిన వారు కొంత దూరం లో ఉన్న ఖాళీగా ఉన్న అపార్ట్‌మెంట్ల వైపు చూపించారు. కాన్షీరాం ఆవాసియా కాలనీ పేరిట మాయావతి హయాంలో వాటిని దళితులు, ఇతర పేదల కో సం నిర్మించారు. కానీ 2012లో ఎస్పీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఆ కాలనీకి నీరు, విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని వారు తెలిపారు. దీంతో తాము ఆ అపార్ట్‌మెంట్లను వదిలి ఇలా రోడ్డు పక్కన గుడిశల్లోకి రావాల్సి వచ్చిందని చెప్పారు. ఇక ఆదర్శ గ్రామాల ఎంపికలోనూ తాము వివక్షనెదుర్కొన్నామని వాల్మీకి యువకుడు చెప్పారు. ఐదేండ్లలో దళితులపై హింసకు, నేరాలకు పాల్పడిన వారిలో చాలామందిపై చర్యలు తీసుకోవడంలో అధికార యం త్రాంగం విఫలమైందని దళితులు ఆరోపిస్తున్నారు. ఇక కాంగ్రెస్ గురించి ధోబీ కులానికి చెందిన ఓ వ్యక్తి కాంగ్రెస్ దిమాక్ సే ఉతర్ చుకీ హై (ప్రస్తుతం మా మది నుంచి కాంగ్రెస్ తొలగిపోయింది) అని అన్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటువేసిన దాదాపు 45 శాతం మంది దళితులు ఈసారి ఆ పార్టీ పట్ల సుముఖత వ్యక్తం చేయడం లేదు. కేంద్రంలో రెండున్నరేండ్ల బీజేపీ పాలన తమకెటువంటి ప్రయోజనాన్ని చేకూర్చలేదని వారంటున్నారు. దీనికితోడు నోట్ల రద్దు అంశం వారిలో ప్రభుత్వం పట్ల ప్రతికూల ప్రభావం చూపినట్టు తెలుస్తున్నది.
- పీపుల్స్ పల్స్ సౌజన్యంతో

934

More News

మరిన్ని వార్తలు...