HomeNational News

గణతంత్ర పరేడ్‌లో తెలంగాణకు దక్కని అవకాశం

Published: Wed,January 11, 2017 01:09 AM
  Increase Font Size Reset Font Size decrease Font size   

న్యూఢిల్లీ, నమస్తే తెలంగాణ: గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని రాజ్‌పథ్‌పై శకటాన్ని ప్రదర్శించే అవకాశం తెలంగాణకు ఈసారి కూడా దక్కలేదు. శకటాల అర్హతను నిర్ణయించడానికి రక్షణ శాఖ పరిధిలో పనిచేస్తున్న ఉత్సవాల నిపుణుల కమిటీ ఏడు దశల్లో సమావేశాలను నిర్వహించింది. తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ ఇతివృత్తంతో శకటం నమూనాను ఉత్సవాల నిపుణుల కమిటీకి ప్రదర్శించి చూపింది. ఆరు సమావేశాల్లోనూ ప్రతి దశలో తన సత్తాను చాటుకున్న బతుకమ్మ శకటం హఠాత్తుగా చివరి నిమిషాల్లో అర్హతకు నోచుకోలేకపోయింది. ఆరు సమావేశాల్లోనూ ఎక్కడా శకటం డిజైన్‌ను నిపుణులు తప్పుపట్టలేదు. పైగా కొన్ని సూచనలు చేసి మరింత కనువిందు చేసేలా రూపొందించాలని సలహాలు కూడా ఇచ్చారు. గత సంవత్సరం అవకాశం కోల్పోయినా ఈసారి అవకాశం దక్కుతుందని తెలంగాణ ప్రభుత్వం భావించింది. కానీ ఏ కారణం లేకుండా చివరి నిమిషాల్లో ఎంపికైన శకటాల జాబితాలో తెలంగాణ పేరు లేకపోవడం విస్మయం కలిగించింది. గతేడాది చివరి సమావేశం వరకూ తన పనితీరును కనబర్చినా అవకాశం చేజారిపోయింది. ఈసారి కూడా అదే జరిగింది. కారణాలు ఇప్పటివరకూ తెలియరాలేదు.

ఈసారి మొత్తం 23 శకటాలు


అబుదాబి రాజు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహాయన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్న ఈ సంవత్సరం గణతంత్ర వేడుకల్లో 17 రాష్ర్టాలకు చెందిన శకటాలు, కేంద్ర ప్రభుత్వానికి చెందిన మరో ఆరు శకటాలు అర్హతను సాధించాయి. గతేడాది మాదిరిగానే కేంద్ర ప్రభుత్వ పారా మిలిటరీ బలగాలైన బీఎస్‌ఎఫ్, ఐటీబీపీ (ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్), సశస్ర్త్ సీమా బల్ తదితర విభాగాల శకటాలకు కూడా ఈసారి అవకాశం లభించలేదు. అయితే బీఎస్‌ఎఫ్‌లోని ఒంటెల విభాగం (క్యామెల్ కంటింజెంట్) మాత్రం ప్రదర్శనకు అవకాశం పొందింది. ఇప్పటివరకూ బాహ్య ప్రపంచానికి పెద్దగా వివరాలు బహిర్గతం కాకుండా ఉన్న నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ తరఫున శకటం ఈసారి ప్రదర్శనలో పాల్గొంటుండడం ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ శకటంతోపాటు బ్లాక్ క్యాట్ కమెండోలు కూడా మార్చ్ నిర్వహిస్తారు.

601

More News