‘...తారంగం..!’
చుక్క తెగి పడినట్లు మా ఒళ్లోకి ఒక శిశువు వచ్చింది
విదేశీ భాషల ప్రపంచంలోకి దేశీయ పాప
బుద్ధుణ్ణి మంత్రించిన ఒక ప్రాకృత చిరునవ్వు పాళీ
తలపుల్లో తారామతి బారాదరీలో నర్తించిన సితారా
విలియం బ్లేక్ ఆశించిన ముఖ కాంతి ధార
ఎ స్టార్ ఇజ్ ఎ స్టార్ ఇజ్ ఎ స్టార్
నయన తార
ఉదయతార
శ్రీకాకుళం నుంచి బెంగాలు దాకా
కల్లోలమైన సముద్ర తీరాన
అల పిలుపుకు కిలకిలమని
ఆకాసేపూ ఇంకేమీ ధ్యాసలేదు
‘ఆమెన్’ అంతా అమన్!
మంత్రనగరి సరిహద్దులు దాటి
మమ్మల్నందరినీ కట్టి పడేసిన
మాయల మరాఠీ
నిద్రలేని వెయ్యిరావూతులు కటకటాలనుంచి
ఆకాశంలో ఆ మూల
ఈ మూలా నక్షత్రం కోసమేనా నిరీక్షించింది
తారలూ! అనే ఒక పిలుపుకు
తళుక్కుమనే ఒక నవ్వు
పెదవుల మీద విరిసే తేజస్సులో
వెలిగించిన దీపం వలె
రెటినా నుంచి రెప్పల మీంచి
నునులేత చెక్కిళ్ల పొంచి
ఎట్లా వ్యాపించి కేరింత అవుతుంది
ఎన్ని మాటల పెట్టు
గుండెల్ని తాకే అర్థం కాని ఆకూతపట్టు
ఉరుకుల పరుగుల దైనందినాల్లో
మళ్లీ మళ్లీ పడిలేచే బాల్యం
మన జీవితంలో ఎప్పుడూ ఉండడం
ఎంత గొప్ప అనుభవం
ఊరూ అడవీ చిత్తడి నేలంతా
నెత్తుటి మయమవుతున్న వేట వేళ
ఒక హేల
వినూత్న సృష్టి లీల
నీ పాదాల దగ్గర తారాడినపుడు
ప్రభాత భేరీని
భరోసా యిస్తున్న
ఒక వేగు చుక్క
అయినవాళ్లందరూ
కంటిచుక్కలయి రాలుతూ
మింటి చుక్కలయి దారి చూపుతున్నపుడు
తారసిల్లిన ఒకతార నేనున్నానంటూ
నేల మీదికి దిగివచ్చిన
నీలాల నింగి ఆసరా..
-వరవరరావు
Other Articles