అవిశ్వాసం
అధ్యక్ష్యా!
మా భాషను ఆశను
మా మెతుకును మా బతుకును
బర్బాద్ చేసినచోట
మీకు మందబలం ఉన్న దగ్గర
మాకు మాట్లాడే
అవకాశం ఎట్లా కల్పిస్తరు!
అధ్యక్షా!
మీ మీద
మాకు ఎట్లా విశ్వాసం ఉంటుంది
అయ్యా!
మీ పొలాలకు నీళ్లివ్వడానికి
మా ఊళ్లకు ఊళ్లను కన్నీళ్లలో
ముంచుకున్న వాళ్లం
మీ రోడ్లను వెడల్పు చేయడానికి
మా పచ్చని చెట్లలాంటి
ఇండ్లకు ఇండ్లను
కూలగొట్టుకున్న వాళ్లం
మీ బంగ్లాలకు భవంతులకు
మా బక్క ప్యాద బస్తీలను
కిస్తీలలో పెట్టి
కిస్మత్ అనుకొని సమర్పించుకున్నవాళ్లం
అధ్యక్షా!
ఏమన్నా ఎన్నన్నా మాటలు గాలికి పోతయని
మూటలు పోవద్దనుకునే
మిమ్ముల్ని అన్నా.. ఆడినా..
నీళ్లల్ల ఏలుపెట్టి నోట్లెపెట్టుకున్నట్టే
అయ్యా!
బడితె వున్నోనిదే బర్రె
మంది వున్నోల్లదే న్యాయం
రంధి పడేటోల్ల నోట్లె మన్ను
అధ్యక్షా!
ఒకరు కాదు ఇద్దరు కాదు
వందల మంది మా పోరగాండ్లు
ఎవర్ని ఏమనలేక
మ్యాదకంగా బలిదానం చేసుకున్నరు
అయ్యా!
మీకు దయరాకపాయె
మీకు గోరెడంత నెనరులేకపాయె
మారె!
ఎద్దుపుండు కాకికి ఏమి ముద్దు
నమ్మక్ హరామ్‌లను మా దగ్గర పెట్టుకొని
మిమ్ముల్ని అని ఏమి లాభం
అధ్యక్షా!
ఒకరి నీడను
ఒకరు అనుమానంగా చూస్తున్నచోట
ఒకరి మాట
ఒకరు అవమానంగా భావిస్తున్న దగ్గర
దేండ్లయినా కలిసిపోయే చెంచలా
సిగ్గూ శరం లేని మా నాయకులు
మీరు కల్సి వుండవచ్చు గని
పక్క పక్కన కూర్చొని
ఒకరి మీద ఒకరు ‘దిల్లగీ’ అడుకోవచ్చు గని
మాకు మాత్రం సమ్మతం కాదు
అధ్యక్షా!
పేరుకు ప్రతిపక్షం
ఊరుకు అధికార పక్షం
దొంగలు దొంగలు
ఊర్లకు ఊర్లు పంచుకున్నట్లు
అంతా ఒక్కటే
తెలంగాణ కోసం
చనిపోయిన మా పిల్లలకు కోసం
మీ అసెంబ్లీ కంటికి
ఇసుమంత చెమ్మరాదు
సంతాపం అసలే తెలుపదు
మనసు పచ్చి పుండైపోయింది
విశ్వాస ఘాతుక
అసెంబ్లీ వుంటే మాకేంది
వూడి పోతే మాకేంది!!
అధ్యక్షా!
ఒకరి పొడ ఒకరికి గిట్టనిచోట
పాసంగం లేని కప్పల తక్కెడైన
మీ శాసనసభ పై
మా విశ్వాసం ఎట్లా ఉంటుంది
అధ్యక్షా!
మీరంతా
ఒప్పుకున్నా తప్పుకున్నా
నాలుగు కోట్ల ప్రజల తరపున
అవిశ్వాసం ప్రతిపాదిస్తున్నాను
అతి గొప్ప ఆత్మగౌరవ విశ్వాసంతో
అవిశ్వాసం ప్రకటిస్తున్నాను
- జూకంటి జగన్నాథం
Other Articles